
చేర్యాల, సెప్టెంబర్ 5: కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకుని అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడంతో పాటు స్వామి వారి నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం కొండపైన ఉన్న ఎల్లమ్మకు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రాతిగీరలు వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఈవో ఎ.బాలాజీ, చైర్మన్ గీస భిక్షపతి, ఏఈవో వైరాగ్యం అంజయ్య, ప్రధానార్చకుడు మహదేవుని మల్లికార్జున్, డైరెక్టర్లు, సిబ్బంది, అర్చకులు భక్తులకు సేవలందించారు.
వనదుర్గమ్మకు ప్రత్యేక పూజలు..
పాపన్నపేట, సెప్టెంబర్ 5: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీ మాత ఆలయం ఆదివరం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి ఏడుపాయలకు చేరుకున్న భక్తులు మంజీరానదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఏడుపాయలకు వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటించేలా ఆలయ ఈవో సార శ్రీనివాస్, ఇతర సిబ్బంది తగిన చర్యలు చేపట్టారు. వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఏడుపాయలలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్సై సురేశ్ తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు. వనదుర్గాప్రాజెక్టు వారం రోజులుగా పొంగిపొర్లుతున్నది. శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి నీటిమట్టం మరింత పెరిగింది.
అన్నప్రసాద వితరణ శాలకు విరాళం
కొమురవెల్లి క్షేత్రంలో కొనసాగుతున్న మల్లికార్జునస్వామి వారి అన్నప్రసాద వితరణ శాలకు కొమురవెల్లి ఏపీజీవీబీ శాఖ మేనేజర్ తోట రాము రూ.1,11,016లను ఆదివారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు స్వామి అన్నప్రసాద వితరణ శాలలో ఉచితంగా భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈవో ఎ.బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య, ప్రధానార్చకుడు మహదేవుని మల్లికార్జున్, డైరెక్టర్లుముత్యం నర్సింహులు, ఉత్కూరి అమర్గౌడ్, తివారి దినేష్, చింతల పరశురాములు, తాళ్లపల్లి శ్రీనివాస్, కొంగరి గిరిధర్, బొంగు నాగిరెడ్డి, శెట్టె ఐలయ్య, పొతుగంటి కొమురవెల్లి, గడ్డం మహేశ్యాదవ్, తుమ్మల రవి, ధరావత్ అనిత తదితరులు పాల్గొన్నారు.