
సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 4 : విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతూ ఇతరులకు స్ఫూర్తిగా నిలిచాడు ఓ ఉపాధ్యాయుడు. 300 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో 1200 మందికి పైగా చేరే విధంగా ప్రేరణ కలిగించిన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పయ్యావుల రామస్వామికి భారత ప్రభుత్వం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రకటించింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5వతేదీన భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్చే వర్చువల్‌గా జాతీయ అవార్డు అందుకోబోతున్న పయ్యావుల రామస్వామితో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
అవార్డు రావడంపై మీ స్పందన ?
ధన్యవాదాలు 20 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఎప్పుడూ అవార్డుల కోసం పని చేయలేదు. ఏ అవార్డు వచ్చినా పొంగిపోలేదు. ఇల్లు, పాఠశాల రెండూ నా కుటుంబాలే అనుకుంటా. ఇల్లు, పాఠశాలనే నా ప్రపంచం. నాది ఇందిరానగర్ పాఠశాల అని మా విద్యార్థులు, మా ఉపాధ్యాయులు గర్వంగా చెప్పుకునే విధంగా తీసుకొచ్చాం అది చాలు.
మీరు ఈ పాఠశాలలో ఏ సంవత్సరంలో చేరారు.
అప్పుడు ఇక్కడ ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత ?
నేను ఈ పాఠశాలలో 2015లో చేరాను. అప్పుడు 300 మంది విద్యార్థులు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 1206కి పెరిగింది.
300 నుంచి 1206కు పెరగటానికి ముఖ్యంగా
మీరు ఏఏ కార్యక్రమాలు తీసుకున్నారు?
ముఖ్యంగా విద్యార్థుల వ్యక్తిగత ప్రవర్తన, సామాజిక, ఆర్థిక స్థితిపై దృష్టి సారించాం. ఇందుకు గానూ ప్రత్యేకంగా ఉదయం ఒక గంట సేపు బిహేవియర్ ఛేంజ్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. విద్యార్థుల మానసిక స్థితి, ప్రవర్తన తెలుసుకున్నాం. తల్లిదండ్రులు, విద్యార్థుల మధ్య సంబంధాలు పెంచి వారిలో ఒక మార్పు తీసుకొచ్చాం. అకాడమిక్ సబ్జెక్టుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో జవాబుదారితనం ఉండటం కోసం ప్రతి స్టూడెంట్ ప్రొఫైల్ తయారు చేశాం. సమాజం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాం.
ఒక్కో విద్యార్థి గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవడం ఎలా సాధ్యమైంది?
విద్యార్థిని అర్థం చేసుకోవటానికి ఒక చెక్ లిస్టు ఏర్పాటు చేసి ఆ విద్యార్థి అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి.. అతడి తల్లిదండ్రుల అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి. పర్సనల్‌గా కేస్ స్టడీ చేశాం. విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి వారిలో మార్పు తీసుకువచ్చాం.
పాఠశాల మొత్తం రికార్డులన్నీ ఆన్లైన్ చేయటానికి కారణం ఏంటి? అది ఎలా సాధ్యమైంది?
ఇప్పుడు ఉన్న విద్యావ్యవస్థలో ఉపాధ్యాయుడు టీచింగ్‌పై దృష్టి పెట్టకుండా పాఠశాలలోని క్లరికల్ వర్క్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని అధిగమించటానికి పాఠశాలలోని రికార్డులన్నీ ఆన్లైన్లో నిక్షిప్తం చేశాం. పూర్తి స్థాయిలో బోధనపైనే దృష్టి పెట్టేలా చర్యలు తీసుకున్నాం.
నేడు ప్రపంచాన్ని శాసిస్తున్న ఇంగ్లిష్, కంప్యూటర్ కోర్సుల కోసం మీరు చేసిన
ప్రత్యేక కార్యక్రమం ఏమిటి?
ప్రభుత్వ పాఠశాలలో చదువునే విద్యార్థులకు ఇంగ్లిష్ రాదు అనే ఒక అపోహ ఉంటది. ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్న వాటిలో లాంగ్వేజీ పరంగా ఇంగ్లిష్, సబ్జెక్టు పరంగా కంప్యూటర్. మల్టీ పర్పస్ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు అనేది ఒక డ్రీమ్ గా ఉండేది. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ఈపామ్ సంస్థ సహకారంతో మల్పీ పర్పస్ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈపామ్ సంస్థ, ఎంఐటీ అనే అమెరికా యూనివర్సిటీ సహకారంతో పలు కోర్సులకు శిక్షణ ఇస్తున్నాం.
మంత్రి హరీశ్‌రావు సహకారం ఎలా ఉంది?
మంత్రి హరీశ్‌రావు సహకారం లేకుండా ఈ పాఠశాల ఇంతలా అభివృద్ధి చెందేది కాదు. మేము ఫలితాల్లో చూపించాం కాబట్టి మంత్రి మమ్ముల్ని నమ్మి పాఠశాలకు అనేక వసతులు కల్పించారు. బాలవికాస, నాట్కో లాంటి ట్రస్టుల ద్వారా అనేక వసతులు సమకూర్చారు. ఆయన ఇచ్చిన సపోర్టుకు మేము వందశాతం ఫలితాలు ఇస్తున్నాం.
కరోనా లాంటి సమయంలో బోధనలోఎలాంటి మార్పులు తీసుకున్నారు ?
కరోనా లాంటి క్లిష్ట సమయంలో అన్ని పాఠశాలలు మూతపడ్డా.. మా పాఠశాలలో ఆన్లైన్ క్లాసుల ద్వారా పాఠాలు పూర్తి చేశాం. గూగుల్ ఇన్పుట్ టూల్స్ ద్వారా ఎలాంటి ఆటంకం లేకుండా సిలబస్ పూర్తి చేశాం. ముందుగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత విద్యార్థులకు బోధించేలా చర్యలు తీసుకున్నాం.
ఇప్పటి వరకు మీకు వచ్చిన అవార్డులు ఎన్ని?
నేను ఏ అవార్డుకు దరఖాస్తు పెట్టుకోలేదు. కానీ, ప్రభుత్వ పరంగా కూడా వారే పిలిచి ఇచ్చారు. ఇప్పటి వరకు జిల్లా స్థాయిలో 20 అవార్డులు వచ్చాయి. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో పాటు 8 రాష్ట్రస్థాయి అవార్డులు వచ్చాయి. ఇప్పుడు జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది.
ఇన్ని కార్యక్రమాలు చేయడంలో మీ ఉపాధ్యాయ బృందం సహకారం ఎలా ఉంటుంది.
నిజం చెప్పాలంటే వారి సహకారం లేకుండా ఏ ఒక్క కార్యక్రమం కూడా విజయవంతం కాదు. వందశాతం వారు ఇచ్చిన సహకారంతోనే పాఠశాలను ఇంత అభివృద్ధి చేయగలిగాం. నేను చేసే ప్రతి కార్యక్రమంలో వారి భాగస్వామ్యం ఉంటుంది.