
సదాశివపేట, సెప్టెంబర్ 4 : మండలంలోని నిజాంపూర్ కే ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న పోటు రామకృష్ణ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యార్థుల సంఖ్యను పెంచి పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు కృషి చేసినందుకు జూలై 21వ తేదీన ‘మనం మన ఊరి బడి అవార్డు -2021’ అవార్డును అందుకుని ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచాడు. పాఠశాల ఆవరణలో విద్యార్థుల భాగస్వామ్యంతో హరితహారం నిర్వహించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాడు. దాంతో పాటు 18సార్లు రక్తదానం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. దాతలు, వ్యాపారస్తులు, పూర్వ విద్యార్థుల భాగస్వామ్యంతో విరాళాలు సేకరించి పాఠశాలకు టేబుళ్లు, బల్లాలు, కుర్చీలు, విద్యార్థులకు టై బెల్ట్‌లు, ఐడీ కార్డులు అందించాడు.
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల స్వీకరణ..
2014లో మండల స్థాయి అవార్డును అప్పటి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డీఈవో సురేశ్ నుంచి అందుకున్నారు. 2015లో జిల్లా స్థాయి అవార్డును జడ్పీ చైర్ పర్సన్ రాజమణి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డీఈవో నజీమొద్దీన్ నుంచి అందుకున్నారు. 2016లో లయన్స్ క్లబ్ జిల్లా స్థాయి అవార్డు, 2017లో జాతీయ స్థాయి ఆట అవార్డును మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ జేడీ.లక్ష్మీనారాయణ, ఆట జాతీయ అధ్యక్షుడు బెక్కంటి శ్రీనివాస్‌రావు చేతుల మీదుగా అందుకున్నారు. 2017లోనే రాష్ట్ర స్థాయి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి నుంచి స్వీకరించారు. 2017లో జాతీయ స్థాయి ప్రతిభా రత్న అవార్డును మాజీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ విప్, ఎమ్మెల్యే కూన రవికుమార్ నుంచి అందుకున్నారు. 2018లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, అప్పటి ఎమ్మెల్యే బాబుమోహన్ నుంచి స్వీకరించారు. 2018లోనే రాష్ట్ర స్థాయి లయన్స్ అవార్డును సీడీసీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి నుంచి అందుకున్నారు. 2019లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, జనార్దన్‌రెడ్డి అందించారు. జాతీయ స్థాయి ఐటప్ అవార్డును రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, ఐపీఎస్ అధికారి దినకర్‌బాబు, అప్పటి బీసీ కమిషన్ చైర్మన్ రాములు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ చేతులు మీదుగా అందుకున్నారు. 2020లో రాష్ట్ర స్థాయి గ్రీన్ ఇండియన్ అవార్డును ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం, మిస్ ఇండియా పసిఫిక్ డాక్టర్ సుధా జైన్, మిస్ ఇండియా తెలంగాణ పైనలిస్టు ఇందిరాప్రియ నుంచి తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి లయన్స్ క్లబ్ అవార్డు డిస్ట్రిక్ గవర్నర్ లయన్ గంధాని శ్రీనివాస్‌రావు, ప్రతాపరెడ్డి, రమణ నుంచి స్వీకరించారు. 2021లో మనం..మన ఊరి బడి అవార్డును వ్యవస్థాపక అధ్యక్షుడు పెయ్యల అజరత్ అందజేశారు.
రవీంద్ర భారతిలో రాష్ట్రస్థాయి అవార్డు స్వీకరణ..
రాష్ట్రస్థాయి లయన్స్‌క్లబ్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2021ను శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో లయన్స్ క్లబ్ జిల్లా చైర్పర్సన్ పద్మా ఓబుల్‌రెడ్డి ఆధ్వర్యంలో మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు నుంచి అందుకున్నారు.