
అచ్చమైన లోకల్ పార్టీ టీఆర్ఎస్
ప్రజల అవసరాలే మా ఎజెండా
టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగలోఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
సిద్దిపేట అర్బన్/సిద్దిపేట, సెప్టెంబర్ 2 : ప్రజలే హైకమాండ్‌గా, ప్రజా సంక్షేమమే ఊపిరిగా పనిచేసే పార్టీ టీఆర్ఎస్ అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేటలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 27న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకోలేక పోయామన్నారు. నేడు జెండా పండుగతో ప్రారంభమై.. గ్రామ, వార్డు, మండల, పట్టణ, జిల్లా కమిటీల నిర్మాణం పూర్తి చేసుకోవాలని పార్టీ ఆదేశించిందన్నారు. ఆ దిశగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర ఆవిర్భావమే లక్ష్యంగా పనిచేసి రాష్ర్టాన్ని సాధించిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ దిశగా రూపుదిద్దుకుంటున్నదని తెలిపారు. సంక్షేమానికి, అభివృద్ధ్దికి పెట్టింది పేరు టీఆర్ఎస్ అన్నారు. బీజేపీ నాయకులు చేయాల్సింది పాదయాత్రలు కాదని.. పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించేందుకు ఢిల్లీకి యాత్ర చేయాలని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఉన్న ఆస్తులను అమ్మేస్తున్నదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బీహెచ్ఈఎల్ లాంటి సంస్థలను కాపాడుకునేందుకు ప్రయత్నం చేసిందన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి, అనేక సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి గొప్ప సంపదను సృష్టించిందన్నారు. ఇదే టీఆర్ఎస్కు, బీజేపీకి ఉన్న తేడా అన్నారు. కొన్ని పార్టీలు ఢిల్లీ హైకమాండ్‌గా, కొన్ని పార్టీలు ఆంధ్రా నాయకుల చేతిలో పనిచేస్తున్నాయని, కానీ ప్రజల అవసరాలే ఎజెండాగా పని చేసే పార్టీ టీఆర్ఎస్ అన్నారు. ప్రజల బాధలే తన బాధగా పనిచేసే నాయకుడు కేసీఆర్ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజల కోసం, ప్రజల ఆలోచనల నుంచి పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రజల పార్టీ, అచ్చంగా లోకల్ పార్టీ టీఆర్ఎస్ అన్నారు. ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలంతా క్రియాశీలకంగా పని చేయాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజుల రాజనర్సు, పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.