
కరోనాతో దాదాపు ఏడాదిన్నర పాటు బోసిపోయి కనిపించిన పాఠశాలలు కళకళలాడాయి. ప్రత్యక్ష తరగతులకు ప్రభుత్వం అనుమతించి పాఠశాలలను తెరవడంతో విద్యార్థులు బుధవారం బడిబాట పట్టారు. దీంతో సందడి వాతావరణం కనిపించింది. మూతికి మాస్క్..చేతులకు శానిటైజేషన్..టెంపరేచర్ పరీక్షించిన తర్వాతే తరగతి గదుల్లోకి విద్యార్థులను అనుమతించారు. భౌతిక దూరం పాటిస్తూ, కొవిడ్ నిబంధనలతో విద్యాబోధన కొనసాగింది. వర్షాలు, ఇతరత్రా కారణాలతో తొలిరోజు పూర్తిస్థాయిలో విద్యార్థులు హాజరు కాలేదు. పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, జూనియర్ కాలేజీలు, అన్ని విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు విద్యాసంస్థలను సందర్శించి వసతులు, బోధన పరిశీలించారు. నిబంధనల ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం తయారు చేయించి వడ్డించారు. కొవిడ్ నేపథ్యంలో అధికార యంత్రాంగం తగిన జాగ్రత్త చర్యలు చేపట్టింది.
సిద్దిపేట జిల్లాలో మొత్తం 1262 పాఠశాలలు ఉండగా, 38 గురుకులాలు మినహాయిస్తే 1224 పాఠశాలలు బుధవారం ప్రారంభమయ్యాయి. అందులో ప్రభుత్వ పరిధిలో నడిచే పాఠశాలలు 1014, ప్రైవేట్ పాఠశాలలు 210 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 1,43,481 మంది విద్యార్థులు ఉండగా, తొలిరోజు బుధవారం 49,360 మంది తరగతులకు హాజరయ్యారు. 34.40 హాజరుశాతం నమోదైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో 86,038 మంది విద్యార్థులు ఉండగా, 32 హాజరుశాతంతో మొదటి రోజు 27,532 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రైవేట్ పాఠశాలల్లో 57,443 మంది విద్యార్థులు ఉండగా, 21,828 మంది విద్యార్థులు హాజరై, 38 హాజరుశాతం నమోదైందన్నారు.
సిద్దిపేట జిల్లాలో ఉన్న 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 7,598 మంది విద్యార్థులకు గానూ 1,114 మంది హాజరయ్యారు. 14.66 హాజరుశాతం నమోదైందని ఇంటర్ విద్యాధికారులు వెల్లడించారు. జిల్లాలోని 33 ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 18,252 మంది విద్యార్థులకు గానూ 3,365 హాజరయ్యారు. పాఠశాలతో పాటు అన్ని కళాశాలలు, వృత్తి విద్యా కళాశాలలు బుధవారం తెరుచుకున్నాయి.
సంగారెడ్డి జిల్లాలోని 1272 పాఠశాలల్లో తొలిరోజు బుధవారం 24శాతం మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. తొలిరోజు కావడంతో విద్యార్థులు తక్కువగా వచ్చారని, క్రమంగా హాజరుశాతం పెరుగుతుందని డీఈవో నాంపల్లి రాజేశ్ తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. కొన్ని పాఠశాలలు మాత్రమే ప్రారంభమయ్యాయి. ప్రైవేట్ పాఠశాలల్లో తొలిరోజు 6 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రుల నుంచి హామీపత్రాలు స్వీకరించాకే విద్యార్థులను తరగతి గదుల్లోకి అనుమతించాయి. జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షిషా కంది మండలం చర్లగూడెం గ్రామ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి తరగతులను పరిశీలించారు. డీఈవో నాంపల్లి రాజేశ్ ఇస్నాపూర్, నందికంది, కంది, సదాశివపేట, పెద్దాపూర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సందర్శించి హాజరుశాతం పరిశీలించారు. సదాశివపేటలోని కేజీవీబీ పాఠశాలను డీఈవో రాజేశ్ సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఎంఈవోలు పాఠశాలలను సందర్శించి తొలిరోజు తరగతుల నిర్వహణను పరిశీలించారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తొలిరోజు విద్యార్థులు తరగతులకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపారు. విద్యార్థుల కోసం పాఠశాల సిబ్బంది శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచారు. అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోని ప్రభుత్వ పాఠశాలలు సందడిగా ప్రారంభమయ్యాయి. చౌటకూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌ను జడ్పీ సీఈవో ఎల్లయ్య సందర్శించారు. పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి.
మెదక్ జిల్లాలోని 950 ప్రభుత్వ పాఠశాలల్లో 95,498 మంది విద్యార్థులకు గాను, మొదటి రోజు 22,550 మంది (23.61శాతం) విద్యార్థులు తరగతులకు డీఈవో రమేశ్‌కుమార్ తెలిపారు. జిల్లాలో 108 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, వాటిలో 62 పాఠశాలలు మాత్రమే తెరుచుకున్నాయి. జిల్లా కేంద్రంలోని 1వ వార్డులోని ఔరంగాబాద్ ప్రాథమిక పాఠశాల, 25వ వార్డులోని బాలికల ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సందర్శించారు. ఈ పాఠశాలల్లో పారిశుధ్య పనులపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన నోట్‌బుక్స్‌ను ఆమె పంపిణీ చేశారు. ఔరంగాబాద్ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఎమ్మెల్యే వెంట జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, డీఈవో రమేశ్‌కుమార్, ఎంఈవో నీలకంఠం, కౌన్సిలర్లు కిశోర్, కృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు జయరాజ్, శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు మధుసూదన్‌రావు, దుర్గాప్రసాద్, శ్రీధర్‌యాదవ్, బొద్దుల కృష్ణ, కసాపురం మధు, బీమరి శ్రీనివాస్, కిష్టయ్య తదితరులు ఉన్నారు. కాగా, జిల్లాలోని 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 5,490 మంది విద్యార్థులకు గానూ తొలిరోజు 909 మంది విద్యార్థులు (16.6శాతం) హాజరైనట్లు ఇంటర్ నోడల్ అధికారిల సత్యనారాయణ పేర్కొన్నారు. 22 ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 3,258 మంది విద్యార్థులకు గానూ 874 మంది విద్యార్థులు (26.8శాతం) హాజరైనట్లు తెలిపారు.
పాఠశాలలు తెరవక పోవడంతో నెలల తరబడి పిల్లలు ఇంటి వద్దనే ఉంటుండంతో వారి భవిష్యత్ ఏమవుతుందోనన్న బెంగ ఏర్పడేది. పిల్లలు గతంలో నేర్చుకున్న సదువులను కూడా మర్చిపోతున్నారు. పిల్లల భవిష్యత్ దృష్ట్యా ప్రభుత్వం పాఠశాలను ప్రారంభించడం సంతోషంగా ఉంది.
తరగతులపైనే నాకు ఆసక్తి..
పాఠశాలలు ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత నేను నేరుగా పాఠశాలకు వెళ్లి స్నేహితులతో కలిసి తరగతులకు హాజరవుతున్నాననే ఆసక్తి నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మళ్లీ మామూలు వాతావరణంతో విద్యాబోధనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం బాగుంది. నేను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ప్రతిరోజూ పాఠశాలకు వస్తా. త్వరలోనే కరోనా మహమ్మారి సమూలంగా అంతం అవ్వాలని కోరుకుంటున్నా.
పాఠశాలలకు సెలవులు వచ్చినప్పుడు, తిరిగి మళ్లీ ఎప్పుడెప్పుడు పాఠశాలకు వెళ్లాలి అనే భావన ఉంటుందో ఈ సారి పాఠశాలలు కరోనా కారణంగా మూతపడినప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితే ఎదురైంది. కానీ, కరోనా ప్రభావంతో పాఠశాలలు తెరవలేదు. ఆన్లైన్ తరగతులు వింటున్నా కూడా ఏదో వెలితిగా అనిపించింది. పాఠశాలకు వెళ్తేనే చదువులు కొనసాగుతాయి. ప్రత్యక్షంగా బోధన పద్ధతులు అర్థమవుతాయి. అని నాకు ధృడంగా అనిపించేది. ప్రభుత్వం మా భవిష్యత్ గురించి ఆలోచించి చాలా మంచి నిర్ణయం తీసుకుంది.
కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొవిడ్ నిబంధనలను పాటిస్తున్నాం. విద్యార్థులు విధిగా మాస్కు ధరించేలా, భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నం. ఒక్కో బెంచీకి ఒక్కో విద్యార్థిని మాత్రమే కూర్చోబెడుతున్నం. పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుపై దృష్టి పెట్టేలా ఏర్పాట్లు చేయించాం.
చాలా రోజుల తర్వాత బడులు షురూ కావడంతో పిల్లలు సంతోషంగా బడికి పోయిం డ్రు. పాఠశాల లు బంద్ కావడంతో పిల్లలు చదువులు ఎట్లనోనని రోజూ బాధపడేవాళ్లం. బడికి పోతనే పిల్లలకు చదువుతో పాటు క్రమశిక్షణగా ఉంటరు. పిల్లలకు మాస్క్‌లు పెట్టి బడికి జాగ్రత్తగా పంపించినం.