
చేర్యాల, ఆగస్టు 31 : దశాబ్దాలుగా ఇబ్బందులు పెడుతున్న మత్తడి నీటి సమస్య ఎట్టకేలకు కాల్వ నిర్మాణంతో పరిష్కారమైంది. ఒకప్పుడు మత్తడి పడితే చేర్యాల పట్టణంలోని సిద్దిపేట-జనగామ ప్రధాన రహదారి చెరువును తలపించేది. సిద్దిపేట, చేర్యాల, జనగామ రహదారిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడేది. రోడ్లకిరువైపులా సెల్లార్లు, దుకాణాలు జలమయమయ్యేవి. వ్యాపారాలు సాగక బడా, చిరువ్యాపారులు ఆర్థికంగా నష్టపోయేవారు. ఈ విషయమై మున్సిపల్ పాలకవర్గం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మత్తడి నీటిని మళ్లించేందుకు శాశ్వత చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కోరగా, ఆయన ఈ సమస్యను సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించడంతో కాల్వ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవల భారీగా కురుస్తున్న వర్షాలకు పెద్ద చెరువులోని మత్తడి నీరు పట్టణంలోకి రాకుండా కాల్వ ద్వారా కుడి చెరువు వైపునకు ప్రవహిస్తూ సమస్య పరిష్కారానికి కార్యరూపం దాల్చింది.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఔదార్యం..సమస్యకు పరిష్కారం
పెద్ద చెరువు మత్తడి పడే ప్రాంతం పట్టా భూమి కావడంతో మత్తడి నీటి మళ్లింపు కోసం కాల్వ నిర్మాణానికి భూ యాజమానులతో సమస్య ఏర్పడింది. టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, పట్టణ పెద్దలు ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కలిసి సమస్యను వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే భూ యజమానులతో చర్చలు జరిపి మత్తడి వద్ద భూమిని కొనుగోలు చేసి 20 గుంటలను కాల్వ నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. అంతేకాక ఈ సమస్యను సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లి నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయించడంతో కాల్వ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నీటి మళ్లింపునకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం కురిసిన వర్షాలతో పెద్ద చెరువు మత్తడి పడుతుండడంతో నూతనంగా నిర్మించిన కాల్వలో వరద నీరు జోరుగా ప్రవహిస్తున్నది.
కుడి చెరువులోకి మత్తడి నీరు..
పెద్ద చెరువు మత్తడి వద్ద నిర్మించిన కాల్వ నుంచి కుడి చెరువులోకి నీటిని తరలించేందుకు టీఆర్ఎస్ సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. మత్తడి నీటి మళ్లింపు కోసం చేపట్టిన కాల్వ పనులను సైతం ఇటీవల మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. పెద్ద చెరువు మత్తడి నీటిని కుడి చెరువు వరకు వెళ్లేలా కాల్వను నిర్మించాలని దానికి కావాల్సిన నిధులను సైతం ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు. కాల్వ నిర్మాణ పనులకు రూ.1కోటి20లక్షలు సైతం త్వరలో మంజూరు కానున్నాయి. అనంతరం కాల్వ నిర్మాణ పనులు మరింత ముందుకు సాగనున్నాయి. కాల్వ నిర్మాణ పనులు చేపట్టిన టీఆర్ఎస్ సర్కారుకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
శాశ్వత పరిష్కారానికి కృషి
పెద్ద చెరువు మత్తడి నీటి మళ్లింపు కోసం నిర్మించిన కాల్వతో రోడ్డు పైకి నీరు రాకుండా పరిష్కారం లభించింది. కాల్వ నిర్మాణంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. పెద్ద చెరువు నుంచి కుడి చెరువు వరకు కాల్వను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. నిర్మాణ పనుల వల్ల వ్యాపార, వాణిజ్య వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలిగింది. కుడి చెరువులోకి మత్తడి నీటిని తీసుకుపోయేందుకు నా వంతుగా ప్రయత్నాలు ప్రారంభించా. కాల్వ నిర్మాణానికి కృషి చేసిన మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కృతజ్ఞతలు.
అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరింది
గతేడాది కురిసిన భారీ వర్షాలకు రోడ్డుపైకి నీరు చేరడంతో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి భూమిని విరాళంగా అందజేసి నిర్మాణ పనులను ప్రారంభింపజేశారు. మంత్రి హరీశ్‌రావు సైతం నిధులు మంజూరు చేయడంతో కాల్వ నిర్మాణ పనులు జరిగాయి. ప్రస్తుతం ఉన్న కాల్వ నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లి కుడి చెరువులోకి నీరు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. మత్తడి నీటికి శాశ్వత పరిష్కారం చూపించిన మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.