
ముఖ్యనాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీశ్‌రావు
టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను గురువారం ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకగణం సిద్ధమవుతున్నది. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ మంగళవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేయగా, దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నారు. సీఎం కేసీఆర్ గురువారం ఢిల్లీలో పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్న నేపథ్యంలో ఇక్కడా గులాబీ జెండా రెపరెపలాడనున్నది. జెండా పండుగ అనంతరం వార్డు, గ్రామ, మండల, పట్టణ, జిల్లా కమిటీల ఏర్పాటుకు కసరత్తు జరగనున్నది. ఈ ప్రక్రియ ఈ నెల 25వ తేదీ లోపు పూర్తి కానున్నది. జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని మంగళవారం మంత్రి తన్నీరు హరీశ్‌రావు టెలీకాన్ఫరెన్స్ ద్వారా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సిద్దిపేట, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర సమితి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 2న ఊరూరా జెండా పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఈ మేర కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ముఖ్యనాయకులతో మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, దిశానిర్దేశం చేశారు. జెండా పండుగ అనంతరం వార్డు, గ్రామ, మండల, పట్టణ, జిల్లా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియను అంతా ఈ నెల 25వ తేదీ లోపు పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు జెండా పండుగ నిర్వహణ, కమిటీల ఏర్పాటుపై మంగళవారం సిద్దిపేట నియోజకవర్గ ముఖ్యనాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని గ్రామాల్లో 2న ఉదయం 9 గంటలకు ప్రజల భాగస్వామ్యంతో పార్టీ జెండాను ఆవిష్కరించాలని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ఇన్చార్జిలు, ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా జెండా పండుగను విజయవంతం చేయడంతో పాటు పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలను పూర్తి చేసేలా నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 2న ఢిల్లీలోని పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. అదే రోజు పార్టీ జెండా పండుగను నిర్వహిస్తున్నారు. ఢిల్లీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతరప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు వెళ్లనున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు కావస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాధననే లక్ష్యంగా ఆవిర్భవించిన పార్టీ, రాష్ర్టాన్ని సాధించి, తెలంగాణ ప్రజల కలను సాకారం చేసింది. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు గ్రామ, మండల, జిల్లా కమిటీల ఏర్పాటుకు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టగా, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల ఏర్పాటుతో సరికొత్త నిర్మాణాన్ని టీఆర్ఎస్ చేపట్టబోతున్నది. పలువురికి కొత్తగా పార్టీ పదవులు దక్కనున్నాయి. అధికార పార్టీ కావడం, ఉమ్మడి జిల్లాలో ఎదురులేని పార్టీగా నిలవడంతో పార్టీ పదవులకు తీవ్ర పోటీ ఉండే అవకాశాలున్నాయి.
ఘనంగా నిర్వహిద్దాం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
ముఖ్యనాయకులకు టెలీకాన్ఫరెన్స్‌తో దిశానిర్దేశం టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను ఈ నెల 2వ తేదీన ఘనంగా నిర్వహిద్దామని మంత్రి హరీశ్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం సిద్దిపేట నుంచి నియోజకవర్గం పరిధిలోని పార్టీ ముఖ్య, గ్రామ, మండల నాయకులతోపాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర నాయకులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ 2న ఢిల్లీలోని పార్టీ కార్యాలయ భవనానికి భూమిపూజ చేయనున్న నేపథ్యంలో అదేరోజు ఊరూరా జెండా పండుగను నిర్వహించాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో వార్డులు, పట్టణాల్లో ఉదయం 9 గంటలకు ఒకేసారి జెండా ఎగురవేద్దామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా పార్టీ కార్యకర్తలందరికీ సమాచారమివ్వాలన్నారు. ప్రతిఒక్కరూ జెండా పండుగకు వచ్చేలా అందరిని సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలన్నారు. తాను కూడా జెండా పండుగలో పాల్గొంటానని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులు, చెక్‌డ్యామ్‌లు, నిండాయన్నారు. జెండా పండుగ అంటే తెలంగాణ పండుగ అని, టీఆర్ఎస్ పండుగ అంటే ప్రజల పండుగ అని అన్నారు. రాష్ర్టాన్ని సాధించిన టీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణగా మారుస్తున్నారన్నారు.
టీఆర్ఎస్ గ్రామ, మండల, జిల్లా కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. పార్టీ సభ్యత్వ నమోదులో జిల్లాల వారీగా ఇన్చార్జిలున్న నాయకులతోనే పార్టీ కమిటీల ఎన్నికలను పూర్తి చేయనున్నారు. సిద్దిపేట జిల్లాకు మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, మెదక్ జిల్లాకు వేలేటి రాధాకృష్ణశర్మ, సంగారెడ్డి జిల్లాకు బక్కి వెంకటయ్య ఇన్చార్జిలుగా పార్టీ సభ్యత్వ నమోదుకు ఆధిష్ఠానం నియమించడంతో జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తాజాగా జెండా పండుగ నిర్వహణతో పాటు గ్రామ, మండల, పట్టణ, జిల్లా కమిటీల ఎన్నికలను పూర్తి చేస్తారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు కమిటీల ఎన్నికలను పూర్తి చేసే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు వార్డు, గ్రామ కమిటీలను పూర్తి చేస్తారు. సెప్టెంబర్ 12 నుంచి 20 వరకు మండల, పట్టణ కమిటీలు, సెప్టెంబర్ 20 నుంచి 25లోగా జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గాలను పూర్తి చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 51శాతం కేటాయించనున్నారు. గ్రామ కమిటీలో 11మంది సభ్యులకు చోటు ఉంటుంది. వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామ కమిటీని 11మందితో ఏర్పాటు చేస్తారు. అవసరాన్ని బట్టి 11 నుంచి 25 వరకు కమిటీ సభ్యులను పెంచుకోవచ్చు. క్రియాశీల సభ్యులను మాత్రమే కమిటీలో తీసుకోవాల్సి ఉంటుంది. మండల పార్టీలో 22మంది సభ్యులు ఉంటారు. ఇక్కడ కూడా అవసరాన్ని బట్టి 25 వరకు సభ్యులను పెంచుకోవచ్చు. అనుబంధ కమిటీల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, ప్రచార కార్యదర్శితో పాటు ముగ్గురు కార్యవర్గ సభ్యులుంటారు. ఇక్కడ అవసరాన్ని బట్టి సభ్యుల సంఖ్యను పెంచుకోవచ్చు. ప్రధానంగా ఎస్సీ, బీసీ, యువత, రైతు, మహిళా, సోషల్ మీడియా అనుబంధ కమిటీలు అన్ని గ్రామాల్లో వేస్తారు. ఆయా గ్రామాల్లో ఎస్టీ, మైనార్టీలుంటేనే అక్కడ కమిటీలను వేస్తారు.
20 నుంచి 25లోగా జిల్లా కమిటీ ఎన్నికలు పూర్తి
గ్రామ, మండల కమిటీల తరహాలోనే జిల్లా కమిటీలను ఎన్నుకుంటారు. జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గం, అనుబంధకమిటీలు సెప్టెంబర్ 20 నుంచి 25వ తేదీలోగా పూర్తి చేయాలని టీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశాలను జారీ చేసింది. పార్టీ ఆదేశాల మేర కు గ్రామ, మండల, పట్టణ కమిటీలను పూర్తి చేసుకొని, 25వ తేదీలోగా జిల్లా కమిటీలను పూర్తి చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకెళ్లనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 శాసనసభ స్థానాలున్నాయి. జిల్లాలు ఏర్పాటు అయ్యాక హుస్నాబాద్, జనగామ నియోజకవర్గాలు సగ భాగం సిద్దిపేట జిల్లాలో కలవడంతో ఇప్పుడు 12 నియోజకవర్గాలువుతాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి మినహా అన్ని చోట్ల విజయబావుటను ఎగురవేసింది. రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు జిల్లా పరిషత్‌లు, మం డల పరిషత్‌లు పార్టీ సొంతం చేసుకుంది. గతేడాది ఆగస్టులో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ప్రస్తుతం రెండు స్థానాలు మినహా అన్ని చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు. ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ సొంతం చేసుకునేలా వార్డుస్థాయి నుంచి జిల్లా, రాష్ట్రం వరకు పటిష్ట క్యాడర్ టీఆర్ఎస్కు ఉంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి నేటి వరకు అంకితభావంతో పనిచేసే వారికి పదవులు దక్కనున్నాయి.