
ప్రభుత్వ నిబంధనల ప్రకారం దళితబంధు లబ్ధిదారులను ఎంపిక చేసి జిల్లాలో పకడ్బందీగా పథకాన్ని అమలు చేస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ తెలిపారు. ఈ పథకం అమలుకు సంబంధించి గురువారం ‘నమస్తే తెలంగాణ’కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి వంద మంది దళితులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలోగా లబ్ధిదారులను ఎంపిక చేసి, మార్చి నెలాఖరులోగా వారికి యూనిట్లు అందజేస్తామన్నారు. యూనిట్ ఎంపిక లబ్ధిదారుల ఇష్టమని, వారికి ఆసక్తి ఉన్న యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. లబ్ధిదారులకు ప్రభుత్వ యంత్రాంగం అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని కలెక్టర్ తెలిపారు.
మెదక్, జనవరి 27: ప్రభుత్వ నిబంధనల ప్రకారం దళితులందరికీ దళితబంధు పథకం వర్తింపజేస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులకు దళితబంధు పథకంపై దిశానిర్దేశం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారని, మెదక్ జిల్లాలోని దళితులందరికీ దళితబంధు పథకం వర్తింపిజేస్తామని, అయితే మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి వంద మంది దళితులను ఎంపిక చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలోగా లబ్ధిదారులను ఎంపిక చేసి, మార్చి నెలాఖరులోగా వారికి యూనిట్లు అందజేస్తామన్నారు. యూనిట్ ఎంపిక లబ్ధిదారుల ఇష్టమని ఆయన స్పష్టం చేశారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.
అర్హతకు ప్రాతిపదిక ఎలా నిర్ణయిస్తారు..?
కలెక్టర్: ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం పొందని వారిని గుర్తించి అర్హులను ఎంపిక చేస్తాం. అయితే ముందుగా గ్రామాన్ని ఎంపిక చేసి గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేస్తాం. వచ్చే నెల మొదటి వారంలోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని అనుకుంటున్నాం. ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత కుటుంబాల వివరాలు సేకరిస్తున్నాం.
నమస్తే తెలంగాణ: దళితబంధు అమలు తీరు ఎలా ఉండబోతున్నది.?
కలెక్టర్: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దళితబంధు పథకాన్ని మెదక్ జిల్లాలో పారదర్శకంగా అమలు చేస్తాం. జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలతో చర్చించి గ్రామాలను ఎంపిక చేస్తాం. ఫిబ్రవరి మొదటి వారంలోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి, మార్చి చివరి నాటికి యూనిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించాం.
ప్రభుత్వ పరంగా పథకం విధి విధానాలు ఏమిటి..?
కలెక్టర్: దళితబంధు పథకాన్ని దళితులందరికీ అమలు చేయాలని గతంలో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దళితులై ఉండాలి, అన్ని దళిత కుటుంబాలై ఉండాలి, లబ్ధిదారులు వారికి ఇష్టమైన యూనిట్లను పెట్టుకోవచ్చు. ఏదైనా యూనిట్‌ను ముగ్గురు, నలుగురు కలిసి కూడా స్థాపించుకోవచ్చు. ప్రతి నియోజకవర్గానికి వంద మందిని మొదటి దశలో ఎంపిక చేస్తాం. ఈ సంవత్సరం కొన్ని, వచ్చే సంవత్సరం మరిన్ని ఇలా నాలుగైదు సంవత్సరాల్లో దళితబంధు పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి యూనిట్లను అందజేస్తాం.
అభ్యర్థుల ఎంపికలో ఎవరెవరి ప్రాత ఉంటుంది..?
కలెక్టర్: దళితబంధు పథకం అమలులో ఎమ్మెల్యేల పాత్ర ఉంటుంది. లబ్ధిదారులను పూర్తిగా ఎమ్మెల్యేలే ఎంపిక చేస్తారు. మెదక్ జిల్లాలో రెండు నియోజకవర్గాలు మెదక్, నర్సాపూర్ ఉండగా, సంగారెడ్డి జిల్లాలోని అందోల్ నియోజకవర్గం, నారాయణఖేడ్ నియోజకవర్గాలు, సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల గుర్తింపు వరకే ఉంటుంది. ఎంపిక విధానాన్ని పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తాం. ప్రభుత్వ ఆదేశాలు తప్పక పాటిస్తాం.
జిల్లాలో దళితబంధు అమలు ఎంత వరకు వచ్చింది..?
కలెక్టర్: జిల్లాస్థాయిలో జాయింట్ అకౌంట్ క్రియేట్ అయింది. లబ్ధిదారుల జాబితా రాగానే వ్యక్తిగత అకౌంట్లు ఓపెన్ చేస్తాం. ఇప్పటికే జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించాం. త్వరలో జిల్లా మంత్రి హరీశ్‌రావు, జిల్లాలోని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తాం.
దళితబంధులో ఏమేమి యూనిట్లు ఉన్నాయి.?
కలెక్టర్: ఒక కుటుంబానికి ఒక యూనిట్ మాత్రమే మంజూరు చేస్తాం. ఎరువుల దుకాణం, మందుల, బార్‌షాప్, మినీ డెయిరీ యూనిట్, టైలరింగ్, పవర్ టిల్లర్, పందిరి కూరగాయల సాగు, ఐరన్ గేట్స్, గ్రిల్స్, ట్రాక్టర్, మినీ ట్రాన్స్‌పోర్టు వాహనాలు, కోడిపిల్లల పెంపకం, వరినాటు యంత్రం, సిమెంట్ ఇటుకల తయారీ, రింగుల తయారీ, కాంక్రీట్ మిశ్రమ తయారీ యంత్రాలు, వ్యాపారం, ఆయిల్‌మిల్, పిండి, పసుపు, కారం, మిల్లుల దుకాణాలు, మినీ సూపర్ బజార్, రిటైల్ దుకాణాలు, హార్డ్‌వేర్, శానిటరీ దుకాణాలు, విద్యుత్ పరికరాల అమ్మకాలు, హోటల్ క్యాటరింగ్, టెంట్‌హౌస్, డెకరేషన్ తదితర పథకాలు లబ్ధిదారుల ఇష్ట ప్రకారం ఎంపిక చేసుకోవచ్చు. లబ్ధిదారుల ఆసక్తి ప్రకారం యూనిట్ స్థాపించుకోవచ్చు. యూనిట్ ఎంపిక లబ్ధిదారు నిర్ణయం ఫైనల్. వారికి అన్నివిధాలుగా గైడెన్స్ అధికారులు, నిపుణుల ద్వారా ఇప్పిస్తాం.
దళిత రక్షణనిధి ఉద్దేశం ఏమిటి..?
కలెక్టర్: లబ్ధ్దిదారులకు రక్షణ కవచంగా నిలిచేది దళిత రక్షణనిధి. ఏదైనా జరుగరానిది జరిగి లబ్ధిదారుడి కుటుంబం తిరిగి పేదరికంలోకి వెళ్లకుండా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. లబ్ధిదారుల నుంచి రూ.10 వేలు సేకరించి, మరో రూ.10 వేలతో కలిపి రక్షణనిధిని ప్రభుత్వం చేస్తున్నది. ఈవిధంగా ఏర్పాటైన రక్షణ నిధి నిర్వహణ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో లబ్ధ్దిదారుల కుటుంబాలు నిర్వహిస్తాయి. స్వయం సహకార బృందాల మాదిరిగా వారు పరస్పరం సహకరించుకునే విధంగా ప్రభుత్వం ఈ రక్షణ వ్యవస్థను రూపొందించింది. ఆపద కాలంలో అవసరమైన సహకారాన్ని అందించి, లబ్ధ్దిదారుడి కుటుంబాన్ని తిరిగి నిలబెడుతుంది. ఏ జిల్లాకు ఆ జిల్లా దళిత రక్షణనిధిని ఏర్పాటు చేస్తాం.
మెదక్ జిల్లాలో దళితబంధు పథకం అమలుకు ఎన్ని నిధులు రావచ్చు..?
కలెక్టర్: మెదక్ జిల్లాలో రెండు నియోజకవర్గాలున్నాయి. అందోల్, నారాయణఖేడ్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో సగ భాగం పక్క జిల్లాలైన సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల పరిధిలోకి వస్తాయి. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు సంబంధించి దళిత బంధు అమలు కోసం ఒక్కో నియోజకవర్గానికి వంద చొప్పున రెండు వందల యూనిట్లకు రూ.20 కోట్లు ఖర్చు కానున్నాయి.
లబ్ధిదారుల ఎంపిక ఎప్పటి వరకు పూర్తవుతుంది..?
కలెక్టర్: ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దళితబంధు తొలి విడతలో ప్రతి నియోజకవర్గంలో మార్చిలోగా 100 మంది లబ్ధిదారులకు యూనిట్లు అందించాల్సి ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలోగా ఎంపిక పూర్తవుతుంది. ఒక్కో లబ్ధిదారుడికి అందజేసే యూనిట్ విలువ రూ.10 లక్షలు ఉంటుంది. ఎంపిక పూర్తయిన వెంటనే ఫిబ్రవరిలో లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి బ్యాంక్ అకౌంట్లు తెరిచి యూనిట్లు గ్రౌండింగ్ చేస్తాం.
మెదక్ జిల్లాలో ఎంత ఎస్సీ జనాభా ఉంది..?
కలెక్టర్: మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 1,27,970 మంది ఎస్సీ జనాభా ఉంది. 39,846 కుటుంబాలు ఉన్నాయి. మెదక్ నియోజకవర్గంలో 45,129మంది, నర్సాపూర్ నియోజకవర్గంలో 37,043 మంది ఉన్నారు. అలాగే, జిల్లా పరిధిలోకి వచ్చే గజ్వేల్ నియోజకవర్గంలో 10,187 మంది, దుబ్బాక నియోజకవర్గంలో 10,657 మంది, అందోల్ నియోజకవర్గంలో 18,776 మంది, నారాయణఖేడ్ నియోజకవర్గంలో 6,178 మంది ఉన్నారు. ఒక్కో నియోజకవర్గంలో వంద కుటుంబాలకు ఆర్థిక సాయం అందనున్నది.