
బ్యాంకర్ల ద్వారా రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం
వానకాలంలో వందశాతం రుణాల పంపిణీకి బ్యాంకర్లు సిద్ధం
రూ.1232కోట్ల పంట రుణాలు పంపిణే లక్ష్యం
సంగారెడ్డి, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : రైతులకు పంటరుణాల పంపిణీపై బ్యాంకర్లు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత వానకాలం సీజన్లో వందశాతం రుణాలు పంపిణీ లక్ష్యంగా బ్యాంకర్లు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుత వానకాలం సీజన్లో రూ.1232కోట్ల పంటరుణాలు పంపిణీ చేయాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు రూ.428 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. మిగతా రూ.809కోట్ల పంట రుణాలను సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేసేందుకు బ్యాంకులు చొరవ తీసుకుంటున్నట్లు లీడ్ బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తోంది. అలాగే రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సైతం అందుబాటులో ఉంచుతుంది. కాగా, బ్యాంకర్ల ద్వారా రైతులకు పంటరుణాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రతి ఏటా రాష్ట్రస్థాయిలో బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి రైతులకు విరివిగా పంటరుణాలు అందేలా చూస్తోంది. జిల్లాల వారీగా పంటరుణాలకు సంబంధించి లక్ష్యాలను కేటాయించి, ఆ మేరకు రుణాలు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నది. కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి పంటరుణాలు వందశాతం పంపిణీ జరిగేలా చూస్తున్నారు. జిల్లా యంత్రాంగం బ్యాంకర్లు, వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖ అధికారులతో సమన్వయం చేసి రైతులకు పంటరుణాలు అందేలా చూస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వానకాలం సీజన్లో రూ.144.21కోట్ల రుణాలు పంపిణీ చేయాల్సి ఉండగా, జిల్లాలోని 22 బ్యాంకులు 1266.41కోట్ల పంట రుణాలను రైతులకు అందజేశాయి. 87.67 శాతం రుణాలను బ్యాంకర్లు పంపిణీ చేశారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లో రైతులకు వందశాతం పంటరుణాలను పంపిణీ చేయాలని జిల్లా బ్యాంకర్ల సమావేశం నిర్ణయించారు. ఈ ఏడాది వానకాలం సీజన్లో రూ.1232 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్, కో-ఆపరేటివ్ సెక్టార్లలోని బ్యాంకులకు పంటరుణాల లక్ష్యాలను లీడ్‌బ్యాంకు నిర్దేశించింది. పబ్లిక్సెక్టార్ల్లోని ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్, కెనెరా తదితర 11 బ్యాంకులకు వానకాలం సీజన్లో రూ.764 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రైవేట్ సెక్టార్‌లోని తొమ్మిది బ్యాంకులు రూ.111కోట్లు, కో-ఆపరేటివ్ బ్యాంకు అయిన టీఎస్-కో-ఆపెక్స్బ్యాంకు రూ.205కోట్లు, రీజనల్ రూరల్ బ్యాంకు అయిన ఏపీజీవీబీ రూ.152కోట్ల పంటరుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. వానకాలం సీజన్ ముగిసేనాటికి వందశాతం రుణాలను పంపిణీ చేసేలా లీడ్ బ్యాంకు బ్యాంకర్లతో సమన్వయం చేసుకుంటుంది.
రూ.423 కోట్ల పంపిణీ..
ప్రస్తుత సీజన్లో బ్యాంకర్లు ఇప్పటి వరకు రూ.428కోట్ల రుణాలను రైతులకు అందజేశారు. అత్యధికంగా ఏపీజీవీబీ బ్యాంకు లక్ష్యానికి మించి రుణాలు రైతులకు అందజేసింది. ఏపీజీవీబీ రూ.152కోట్ల రుణాలు అందజేయాల్సి ఉం డగా, ఇప్పటి వరకు రూ.232.49కోట్ల రుణాలు అందజేసింది. కెనెరాబ్యాంకు రూ.51.36 కోట్లు, ఎస్బీఐ రూ.30.24 కోట్లు, యూనియన్బ్యాం కు రూ.29.89 కోట్లు, టీఎస్-కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు రూ.43.25కోట్లు, హెచ్డీఎఫ్సీ రూ.12.62 కోట్లు, లక్ష్మీవిలాస్ బ్యాంకు రూ. 6.71కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.3.68 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.3.53కోట్లు, ఐడీబీఐ రూ.3.89 కోట్ల పంట రుణాలు అంద జేశాయి. మిగతా బ్యాంకులు కోటి రూపాయల నుంచి రూ.3కోట్లలోపు రుణాలను అందజేశా యి. రుణాల పంపిణీలో బ్యాంకర్లు వేగం పెంచారని, ఎస్బీఐ సహాజిల్లాలోని పబ్లిక్, ప్రైవేట్, కో-ఆపరేటివ్ సెక్లార్లోని బ్యాంకులు వందశాతం రుణాల పంపిణీ దిశగా చర్యలు ప్రారంభించినట్లు లీడ్‌బ్యాంకు అధికారులు తెలిపారు.
వందశాతం పంపిణీ లక్ష్యం : రమణారెడ్డి, మేనేజర్ లీడ్‌బ్యాంక్
ఈ ఏడాది వానకాలం సీజన్లో వందశాతం పంట రుణాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుత వానకాలం సీజన్‌కు రూ.1232కోట్ల పంట రుణాలు అందజేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.428కోట్ల రుణాలు పంపిణీ చేయటం చేశాం. బ్యాంకర్లు పంటరుణాల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేశారు. జిల్లాలోని బ్యాంకర్లు రైతుల పంట రుణాలు రెన్యూవల్ చేయటంతో పాటు కొత్త రైతులకు పెద్దసంఖ్యలో రుణాలు అందజేస్తున్నారు. వందశాతం రుణాలు అందజేసేలా బ్యాంకర్లతో సమన్వయం చేసుకుంటున్నాం. ఈ ఏడాది లక్ష్యం మేరకు రైతులకు పంటరుణాలు అందజేస్తాం.