
రైతుబీమా దరఖాస్తు గడువు పెంపు
ఈ నెల 31 వరకు అవకాశం
కొనసాగుతున్న ఎంపిక ప్రక్రియ
గ్రామాల్లో అధికారుల సర్వే
సంగారెడ్డి ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఆరుగాలం కష్టపడి అందరికడుపులను నింపే అన్నదాతకు ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తోంది. రైతు సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా రైతులు అకాలంగా మరణిస్తే వారి కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నది. రైతుబీమా పథకంలో పేరు నమోదు చేసుకున్న రైతులు అకాలంగా మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. 2018 నుంచి రైతుబీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ పథకం ద్వారా జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతు కుటుంబాలు లబ్ధిపొందాయి. జిల్లాలో ఇప్పటి వరకు 1398 మంది రైతుల కుటుంబాలు రైతు బీమా కింద పరిహా రాన్ని పొందాయి. ఇటీవలే ప్రభుత్వం రాష్ట్రంలో ని రైతులందరికీ బీమా వర్తింపజేసేలా ప్రభుత్వం తమ వాటాను ఎల్ఐసీకి అందజేసింది. రైతుబీమా పథకానికి దరఖాస్తులను రైతుల నుంచి వ్యవసాయశాఖ స్వీకరిస్తున్నది. ఈనెల 31 వతేదీ వరకు రైతుబీమా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశాన్ని కల్పించింది. జిల్లాలోని రైతులు కొత్తగా రైతుబీమా పథకం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వీటిని వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించి, గ్రామాల్లో సర్వే చేస్తున్నారు. జిల్లాలోని అర్హులైన రైతులందరికీ రైతుబీమా వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
ఈ నెల 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ, 31 తుదిగడువు
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ రైతుబీమా వర్తించాలని దృఢసంకల్పంతో ఉన్నది. 2018 నుంచి ప్రభుత్వం రైతుబీమా పథకం అమలు చేస్తోంది. 20 18-19, 2019-20, 2020-21 సంవత్సరాలకు మూడేండ్ల పాటు ప్రభుత్వం రైతుబీమా అమలు చేసింది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 1,85,238 మంది రైతులకు రైతుబీమా వర్తింపజేశారు. గత మూడేండ్లుగా జిల్లాలోని 1,85,238 మంది రైతులకు బీమావర్తింపజేసేందకు ప్రభుత్వం ప్రతి ఏటా రూ.53 కోట్లకుపైగా బీమా ప్రీమియం చెల్లిస్తూ వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 సంవత్సరానికి రైతులు బీమా వర్తింపజేసేందుకు రాష్ట్రంలోని రైతులకు బీమా ప్రీమియంగా రూ.1400 కోట్లు చెల్లించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నాల్గో విడత రైతుబీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. రైతులు అకాలంగా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు బీమా సొమ్ము రూ.5 లక్షలు అందుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు 1398 మంది రైతులకు రైతుబీమా పథకాన్ని వర్తింపజేశారు. మృతి చెందిన 1398 మంది రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మొత్తం 69.90 కోట్ల బీమా డబ్బులను నామినీ ఖాతాల్లో జమ చేశారు. రైతుబీమా పథకం వరంగా మారడంతో రైతుల్లోనూ హర్షం వ్యక్తం అవుతున్నది. దీంతో ప్రభుత్వం రైతులందరికీ పథకాన్ని వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. తాజాగా మరో మారు అర్హులైన రైతులను రైతుబీమా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించింది. రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఈనెల 17 నుంచి వ్యవసాయ అధికారులు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారుల సమాచారం మేరకు ఇప్పటి వరకు 14వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 31 వతేదీ వరకు దరఖాస్తు తుది గడువు ఉన్న నేపథ్యంలో దరఖాస్తుల సంఖ్య మరింత పెరగనుంది. రైతుబీమా పథకం వర్తించాలంటే రైతులు 18 నుంచి 59 ఏండ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఆదాయం పన్ను చెల్లిస్తున్న రైతులు, ప్రభుత్వ హోదాల్లో ఉన్నవారు, అధికారులకు రైతుబీమా పథకం వర్తించదు. రైతుబీమా పథకంపై సరైన అవగాహన లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో పట్టాదారుపాసుపుస్తకాలు అందజేయకపోవడం, ఆధార్ నెంబర్లు తప్పుగా ఇవ్వడం, నామినీ పేరు, ఆధార్ నెంబర్లు సరిగ్గా లేకపోవడం, రైతులు స్వగ్రామాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం తదితర కారణాలతో కొంత మంది రైతులు రైతుబీమాకు దూరం కావాల్సి వస్తోంది. దీనిని గుర్తించిన వ్యవసాయశాఖ అధికారులు రైతులు రైతుబీమా పథకంపై సంపూర్ణ అవగాహన కల్పించి రైతుబీమా పథకం పొందేందుకు వారితో దరఖాస్తు చేయిస్తున్నారు. పట్టాదారుపాసుపుస్తకం ఉన్న, ఈనెల 3వ తేదీలోగా ఆన్లైన్లో పట్టాదారు పాసుపుస్తకం డిజిటల్ సంతకం పొందిన రైతులు రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తుదారులు 18 నుంచి 59 ఏండ్లలోపు ఉండాలి. నూతనంగా దరఖాస్తు సమర్పించే రైతులు తమ క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి దరఖాస్తుతోపాటు పట్టాదారుపాసుపుస్తకం, ఆధార్ వివరాలు, నామినికీ సంబంధించిన వివరాలు, ఆధార్ కార్డు జిరాక్స్‌లను ఈనెల 31లోగా అందజేయాలి.
రైతులకు మంచి అవకాశం
రైతుబీమా పథకం అన్నదాతలు వరంలాంటిది. రైతులు అకాలంగా మృతిచెందితే వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేశారు. ప్రతి రైతు అలసత్వం చేయకుండా రైతుబీమా పథకంలో పేరు నమోదు చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం రైతు ల సంక్షేమం కోసం రైతుబీమా పథకాన్ని అమలు చేస్తోంది. రైతులకు ఉపయోగకరమైన ఈ పథకం అందరికీ వర్తింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జిల్లాలోని 18 నుంచి 59 ఏండ్లలోపు వయస్సు రైతులు రైతుబీమా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. రైతులు పట్టాదారుపాసుపుస్తకం, ఆధార్ కార్డు, నామినీ ఆధార్‌కార్డు తదితర వివరాలతో తమ క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారికి రైతుబీమా పథకం దరఖాస్తు అందజేయాలి. ఈనెల 31 తేదీ వరకు దరఖాస్తు సమర్పించేందుకు తు ది గడువు. అయినప్పటికీ రైతులు ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకుంటే మేలు.