
సంగారెడ్డి, ఆగస్టు 22 : రోజూవారి కేసుల్లో రిసోర్స్పర్సన్లు ఇచ్చిన సలహాలు, సూచనలు పాటించి కేసుల పురోగతికి సహకరించాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి సూచించారు. ఆదివారం జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్ హాల్లో రెండోరోజూ జాతీయ సేవాధికార సంస్థ సుప్రీంకోర్టు ఉత్తర్వులు, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి అధ్యక్షతన, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ రిసోర్స్ పర్సన్లు నంద, నారాయణ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన న్యాయ సేవాధికార సంస్థ ప్యానెల్ లాయర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. రెండు రోజుల శిక్షణా శిబిరాన్ని విజయవంతం చేసినందుకు ప్యానెల్ లాయర్లు, రిసోర్స్ పర్సన్లు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. శిక్షణలో రిసోర్స్ పర్సన్లు ఇచ్చిన సలహాలు, సూచనలు పాటించాలన్నారు. శిక్షణా శిబిరంలో రెండు రోజులు హైకోర్టు రిసోర్స్ పర్సన్లు ఎస్.నంద, నారాయణ ప్యానెల్ లాయర్లకు ఆస్తి విభజనలు, అరెస్ట్, రిమాండ్ వంటి కేసులపై పూర్తిగా అవగాహన కల్పించడం సంతోషకరమన్నారు. అంతకుముందు ప్యానెల్ లాయర్లు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ తరఫున రిసోర్స్ పర్సన్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జలీల్, ప్యానెల్ లాయర్లు, సిబ్బంది పాల్గొన్నారు.