
సంగారెడ్డి జైలు ఖైదీల కళాఖండాలు
స్క్రాప్‌తో అందమైన సామగ్రి, వస్తువులు
జైళ్ల శాఖకు ఆదా అయిన రూ.12లక్షలు
ప్రత్యేకంగా ‘భరోసా ఊయల’ తయారు
క్షణికావేశం, ఇతరత్రా కారణాలతో నేరాలు చేసి జైలుపాలైన ఖైదీలను సత్ప్రవర్తన బాట పట్టించేందుకు, వారిలో పరివర్తన తెచ్చేందుకు జైలు అధికారులు ఎప్పటికప్పుడు సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగా వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు పలు విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జైలులోని ఖైదీలతో స్క్రాప్‌తో పలు రకాలు వస్తువులు, సామగ్రి తయారు చేయిస్తున్నారు ఇక్కడి జైలు అధికారులు. బీరువాలు, బెంచీలు, ఫెన్సింగ్, సేఫ్టీ గ్రిల్స్, చెప్పుల స్టాండ్లు, ఊయలలు, ఇతర వస్తువులు తయారుచేస్తున్నారు. వీటిని విక్రయించడంతో జైలుకు ఆదాయం సమకూరుతున్నది. ఖైదీల్లో స్కిల్స్ పెరుగుతున్నాయి.
కంది, ఆగస్టు 21 : సంగారెడ్డి జిల్లా జైలులోని ఖైదీలు వ్యర్థానికి మంచి అర్థం ఇస్తున్నారు. స్టీల్ ఫర్నిచర్ మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలో పేరుకపోతున్న స్క్రాప్‌తో కళాఖండాలు తయారు చేస్తున్నారు. సేఫ్టీ గ్రిల్స్, చెప్పుల స్టాండ్ తదితర వస్తువులు తయారు చేసి, వినియోగంలోకి తెస్తున్నారు.
స్క్రాప్‌తో అందమైన వస్తువులు
సంగారెడ్డి జిల్లా జైలులో స్టీల్ ఫర్నిచర్ మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉంది. ప్రత్యేకంగా బయటి నుంచి వచ్చే ఆర్డర్ల ద్వారా బీరువాలు, బెంచీలు, ఇతర వస్తువులను ఖైదీలతో తయారు చేయిస్తుండగా, దీని ద్వారా జైలు శాఖకు యేటా మంచి రాబడి వస్తున్నది. ఇదిలా ఉంటే బీరువాలు, బెంచీలు, ఇతర వస్తువుల తయారీ తర్వాత మిగిలిన ఇనుప స్క్రాప్‌ను పడేస్తున్నారు. దీనిని జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ గమనించారు. స్క్రాప్‌ను వినియోగంలోకి తేవాలని ఆలోచించారు. 2019లో జైలు ఆవరణలో ఉన్న మామిడి తోటకు ఆ స్క్రాప్‌తో ఫెన్సింగ్ చేయించారు. వీటితో పాటు జైలులో అవసరమైన చోట ప్రత్యేకంగా సేఫ్టీ గ్రిల్స్, చెప్పుల స్టాండ్ తదితర వస్తువులను ఖైదీలతో తయారు చేయించి అమర్చారు. మామూలుగా ఇవన్నీ బయట తయారు చేయిస్తే రూ.10-12 లక్షల వరకు ఖర్చు వచ్చేది. స్క్రాప్‌ను వినియో గంలోకి తేవడంతో సంగారెడ్డి జిల్లా జైలు రూ.12 లక్షల వరకు ఆదా అయ్యింది. ఖైదీలు అద్భుత కళాఖండాలు చేస్తుండడంతో అక్కడి సిబ్బంది వారి పనితీరును మెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు ఏ చేతులతోనైతే హత్యలు, దొంగతాలు చేశారో అవే చేతులతో అందమైన కళాకృతులు చేస్తుంటే ఆ ఖైదీల మనస్సులో మారాలనే సంకల్పం మరింతా పెరిగిపోతుందని జైలు సిబ్బంది చెబుతున్నారు.
భరోసా ఊయల..
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాతా, శిశు సంరక్షణ కార్యాలయ ఆవరణలో కొద్ది రోజుల క్రితం అకారణంగా చెత్తకుప్పలు, ముళ్ల పొదల్లో పారేయకుండా, ‘భరోసా ఊయల’ను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే, జిల్లా జైలు సూపరింటెండెంట్ సూచనలతో ఖైదీలు స్క్రాప్‌తో అందమైన ‘భరోసా ఊయల’ను తయారు చేశారు. ఖైదీలు తయారు చేసిన ఈ ఊయలను మరో రెండు రోజుల్లో జైలు శాఖ సిబ్బంది స్వయంగా మాతా, శిశు సంరక్షణ అధికారులకు అప్పగించనున్నారు.