
జాతిరత్నాలు ఇతర వెబ్ సిరీస్ చిత్రాలు ఇక్కడే చిత్రీకరణ
జైలు సీన్లు ఇక్కడే తీసేందుకు దర్శకుల ఆసక్తి
‘ఫీల్ ద జైల్’తో తెరపైకి..
ఇప్పటి వరకు 12కుపైగా షూటింగ్‌లు
సంగారెడ్డి పాత జైలుకు పెరుగుతున్న డిమాండ్
జైలుకు ఆర్థిక ఆదాయంతో పాటురాష్ట్ర వ్యాప్తంగా పేరు
జాతిరత్నాలు ఇతర వెబ్ సిరీస్ చిత్రాలు ఇక్కడే చిత్రీకరణ
సంగారెడ్డి పాత జైలు షూటింగ్ స్పాట్‌గా మారింది. ఈ జైలులో చిత్రీకరించిన ‘జాతిరత్నాలు’ సినిమా హిట్ కొట్టడంతో దర్శకుల దృష్టి దీనిపై పడింది. పాత కంది శివారులో కొత్త జైలు కట్టగా, పాత జైలును ఏమి చేయాలనే ఆలోచన అప్పటి అధికారుల్లో కలిగింది. దీంతో ‘ఫీల్ ద జైల్’ కాన్సెఫ్ట్ తెరపైకి వచ్చింది. రోజుకు రూ.500 కట్టి, సామాన్యులు ఒక రోజు జైలు జీవితం అనుభవించే అనుభూతిని అందుబాటులోకి తేగా, దీనికి మంచి ఆదరణ లభించింది. తాజాగా బిత్తిరి సత్తి నటిస్తున్న ఓ వెబ్ సిరీస్, ఇతర షార్ట్ మూవీస్‌లు ఇందులో తీస్తున్నారు. గత నెలలో అన్నపూర్ణ బ్యానర్లో హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న ఓ వెబ్సినిమా షూటింగ్ కూడా ఇక్కడే తీశారు. అయితే ఈ పాత జైలులో పాత గోడలు, పాత రూపంలో ఉన్న కట్టడం ఉండడాన్ని అలాగే ఉంచడంతో దర్శకు లు ఇక్కడ జైలు సన్నివేశాలు తీయడానికి ఎక్కువ ఆసక్తి చూపు తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ 12కుపైగా చిత్రీకరణలు జరుగ గా, జైళ్ల శాఖకు ఆదరణతో పాటు ఆదాయం వస్తున్నది.
కంది, ఆగస్టు 19: ఒకప్పుడు కరుడుగట్టిన ఖైదీలందరూ ఆ జైలులోనే శిక్షను అనుభవించారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు చెం దిన ఖైదీలను ఇక్కడే ఉంచేవారు. అయితే, ఈ జైలు పాతది కావడం, సరిపడా వసతులు లేకపోవడంతో ప్రభుత్వం కంది శివారులో విశాలమైన జైలు నిర్మించింది. పాత జైలు అంతరించిపోకుండా ఉండేందుకు అ ప్పటి జైలు ఉన్నతాధికారి కొత్తగా ఆలోచించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ‘ఫీల్ ద జైల్’ కాన్సెఫ్ట్ తెచ్చారు. రోజుకు రూ.500 కట్టి, సామాన్యులు ఒక రోజు జైలు జీవితం అనుభవించే అనుభూతిని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి ఎంతో ఆదరణ లభించింది. ఆ తర్వాత ఇదే జైలు ఆవరణలో ఆయుర్వేద వైద్యశాలను ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల తర్వాత సరిపడా సిబ్బం ది ఇతర కారణాలతో అది ఆగిపోయిం ది. ప్రస్తుతం ఈ జైలు సినిమా షూటింగ్‌లకు అడ్డాగా మారింది. ఈ సంవత్సరం విడుదలై మంచి హిట్ కొట్టిన జాతిరత్నాలు సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇదే జైలులో తీశారు. పైగా ఆ సినిమా దర్శకుడు కూడా ఈ ఊరికి చెందిన వాడే కావడం విశేషం. తాజాగా బిత్తిరి సత్తి నటిస్తున్న ఓ వెబ్ సిరీస్‌కు సంబంధించిన సన్నివేశాలను కూడా నాలుగు రోజుల పాటు ఇక్కడే చిత్రీకరించారు. వీటితో పాటు ఇతర కొన్ని షార్ట్ మూవీస్ కూడా ఇందులో తీస్తున్నారు. రోజురోజుకూ ఈ సంగారెడ్డిలోని పాతజైలుకు మంచి ఆదరణ రావడంతో ఇతర దర్శకులు కూడా ఇక్కడ జైలుకు సంబంధించిన సన్నివేశాలు తీసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇప్పటి వరకు 12కుపైగా షూటింగ్‌లు
సంగారెడ్డి పాత జైలులో ఇప్పటి వరకు 12కుపైగా సినిమాలు, షార్ట్ ఫిల్మీలు, వెబ్ సిరీస్, ఇతర అంశాలకు సంబంధించిన షూ టింగ్‌లు జరిగాయి. 2017లో మొదటగా ఈ జైలులో షూటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. 2019 ఫిబ్రవరిలో ఓ సినిమాను ఏకం గా 15 రోజుల పాటు ఇక్కడ సన్నివేశాలను చిత్రీకరించారు. అదే సంవత్సరం జూన్, జూలై మాసాల్లో ఇతర సినిమాల షూటింగ్‌లూ జరిగాయి. తాజాగా జాతిరత్నాలు సినిమాతో పాటు గత నెల బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలో ఆహాలో రాబోతున్న తోడేళ్లు వెబ్ సిరీస్‌ను నాలుగు రోజుల పాటు చిత్రీకరించారు. గత నెలలో అన్నపూర్ణ బ్యానర్లో హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న ఓ వెబ్సినిమా షూటింగ్ కూడా ఇక్కడే తీశారు. ఈ పాత జైలులో పాత గోడలు, పాత రూపంలో ఉన్న కట్టడం ఉండడాన్ని అలాగే ఉంచడంతో దర్శకులు ఇక్కడ జైలు సన్నివేశాలు తీయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ రాజీవ్‌త్రివేది, డీఐజీ మురళీబాబు సహకారంతో ఇక్క డ షూటింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. దీంతో సంగారెడ్డి పాత జైలు ఇప్పుడు ఇరు తెలుగు రాష్ర్టాల ప్రజలకు సుపరిచితమవుతుండడంతో ఇక్కడి ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జైలు శాఖ అధికారులు తీసుకుంటున్న సరికొత్త నిర్ణయాలను కూడా వారు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
జైలుకు ఆదరణతో పాటు ఆదాయం
సంగారెడ్డి పాత జైలులో ప్రస్తుతం ‘ఫీల్ ద జైలు’గా మాత్రమే ఉన్నది. ఈ జైలును కాపాడుకునేందుకు జైలు శాఖ అధికారులు చిన్నచిన్న వెబ్ సిరీస్, ఇతర షార్ట్ మూవీలతో పాటు పెద్ద సినిమాల షూటింగ్‌ల కోసం అనుమతి ఇస్తున్నారు. మిగతా దర్శకులు కూడా జైలు సీన్లు, ఇతర సన్నివేశాలు ఇందులో తీయడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ జైలులో షూటింగ్ చేయాలంటే ముందుగా జైలు శాఖ అధికారుల అనుమతి తీసుకున్నాక, రోజుకు పెద్ద సినిమాలకైతే రూ.75వేల నుంచి లక్ష వరకు డీడీ ద్వారా హైద్రాబాద్‌లోని రాష్ట్ర జైలు శాఖలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చిన్న సినిమాలు, ఇతర షార్ట్ మూవీలకు తక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుని షూ టింగ్‌లకు అనుమతి ఇస్తున్నారు. దీంతో సం గారెడ్డిలోని పాత జైలుకు అటు ఆదాయంతో పాటు సినిమాల్లో కనిపిస్తుండడంతో మంచి ఆదరణ దక్కుతుంది.
షూటింగ్‌లతో జైలు శాఖకు ఆదాయం
గతంలోనే సంగారెడ్డి పాత జైలును హెరిటేజ్ జైలు మ్యూజియంగా తీర్చిదిద్దాం. ఇంతకు ముందు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ జైలులో ఒక రోజు సామాన్యమైన వ్యక్తి జైలు జీవితం అనుభూతిని పొందేలా ‘ఫీల్ ది జైలు’ను ఉన్నతాధికారులు తీసుకొచ్చారు. పాతజైలు పూర్తిగా అంతరించిపోకుండా జైళ్ల శాఖ డీజీ, డీఐజీ కొత్త ఆలోచనలతో ప్రస్తుతం సినిమా ఇతర చిన్న చిత్రాలకు షూటింగ్‌కు అనుమతిస్తున్నాం. రోజురోజుకూ ఇక్కడ షూటింగ్ సందడి పెరుగుతున్నది. జైళ్ల శాఖకు మంచి ఆదాయం వస్తున్నది. చాలా సంతోషంగా ఉన్నది.