
కేటాయించిన ప్రభుత్వం.. ప్రతిపాదనలు సిద్ధ్దం చేస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
తరతరాలుగా వివక్షకు గురైన దళితుల బతుకులు బాగుపడనున్నాయి. దళితవాడలు, గిరిజన తండాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తూ భారీగా నిధులు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏటా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి పథకం(సీడీపీ) కింద రూ.5 కోట్లు నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. సీడీపీ నిధుల వినియోగానికి సంబంధించి ఇటీవల మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మార్గదర్శకాలను అనుసరించి ప్రతి ఎమ్మెల్యే తమకు కేటాయించిన రూ.5 కోట్ల నిధుల్లో ఎస్సీ,ఎస్టీ ఆవాస ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు తప్పనిసరిగా ఖర్చుచేయాల్సి ఉంటుంది. అక్కడి జనాభా ఆధారంగా ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సీడీపీ నిధుల్లో మెజార్టీ వాటా దళితవాడలు, గిరిజన తండాల్లో అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేస్తారు. తద్వారా వాటి రూపురేఖలు మారుతాయి. సీడీపీలోని జనరల్ కోటాకు అదనంగా ఎస్సీ,ఎస్టీల నిధులు ఖర్చు చేస్తారు. ఎమ్మెల్యేలు జనరల్ కోటాలో వచ్చే నిధులను సైతం ఎస్సీ,ఎస్టీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తారు. సీడీపీ నిధుల వినియోగానికి జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదం తప్పనిసరి.
సంగారెడ్డి, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం దళితవాడలు, గిరిజన తండాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. దళిత వాడలు, గిరిజన తండాల్లో అభివృద్ధి పనులకు వేర్వేరు పథకాల కింద ప్రభుత్వం నిధులు ఖర్చుచేస్తున్నది. ప్రస్తుతం ఖర్చు చేస్తున్న నిధులకు అదనంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కాన్స్టిట్యూమెన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రాం(సీడీపీ) కింద రూ.5 కోట్లు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీడీపీ నిధుల వినియోగానికి సంబంధించి ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మార్గదర్శకాలను అనుసరించి ప్రతి ఎమ్మెల్యే తమకు కేటాయించిన రూ.5 కోట్ల నిధుల్లో ఎస్సీ,ఎస్టీ ఆవాస ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు తప్పనిసరిగా నిధులు కేటాయించాలి. ఎస్సీ,ఎస్టీ జనాభా ఆధారంగా ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో సీడీపీ నిధుల్లో మెజార్టీ వాటా దళితవాడలు, గిరిజన తండాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేస్తారు. దీంతో జిల్లాలోని దళితవాడలు, గిరిజన తండాల రూపురేఖలు మారనున్నాయి. సీడీపీలోని జనరల్ కోటాకు అదనంగా ఎస్సీ,ఎస్టీల నిధులు ఖర్చు చేస్తారు. ఎమ్మెల్యేలు జనరల్ కోటాలో వచ్చే నిధులను సైతం ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు సీడీపీ నిధులు ఖర్చు చేస్తారు. సీడీపీ నిధుల వినియోగానికి జిల్లా ఇన్చార్జి, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆమోదం తప్పనిసరి. సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి, సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అధికార యం త్రాం గం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సీడీపీ నిధులను జనరల్, ఎస్సీ,ఎస్టీ కోటాల వారీగా కేటాయించింది. ఆ మేరకు ఎమ్మెల్యేలు సీడీపీ నిధులను తమ నియోజకవర్గాల్లో ఖర్చు చేయనున్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సీడీపీ నిధులకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులకు అందజేశారు. ఎమ్మె ల్యే అందజేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా త్వరలో నియోజకవర్గంలో సీడీపీ నిధులతో అభివృద్ధి పనులు జరగనున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సీడీపీ నిధులు విడుదల చేస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రూ.5 కోట్ల చొప్పున సీడీపీ నిధులు ప్రభుత్వం అందజేస్తోంది. జిల్లాలోని ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి, సంగారెడ్డి, పటాన్చెరు, అందోలు, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు రూ.5 కోట్ల చొప్పున మొత్తం రూ.30 కోట్ల సీడీపీ నిధులు కేటాయించారు. ఇందులో ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి సీడీపీ నిధుల్లో జనరల్ కోటా కింద రూ.21.99కోట్ల నిధులను ఈ ఏడాది ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఖర్చు చేయనున్నారు. అందోలు నియోజకవర్గంలో సీడీపీ జనరల్ కోటాలో రూ.3.47 కోట్లు, నారాయణఖేడ్ నియోజకవర్గంలో రూ.3.44 కోట్లు, పటాన్చెరులో రూ.4.00కోట్లు, సంగారెడ్డిలో రూ. 3.89 కోట్లు, జహీరాబాద్‌లో రూ.3.40 కోట్లు ఎమ్మెల్యేలు ఖర్చు చేయనున్నారు. ఎమ్మెల్సీ, ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి జనరల్ కోటాలో రూ.3.77 కోట్ల సీడీపీ నిధులు ఎమ్మెల్యేలు ఖర్చు చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలోని ఎస్సీ,ఎస్టీ జనాభా ఆధారంగా మిగతా నిధులు ఖర్చు చేస్తారు. అధికార యంత్రాం గం ఎస్సీ,ఎస్టీ జనాభా ఆధారంగా ప్రతి నియోజకవర్గానికి సీడీపీ నిధులను కేటాయిస్తుంది. అందోలు నియోజకవర్గంలో ఎస్సీకోటాలో రూ.1.24 కోట్లు, నారాయణఖేడ్‌లో రూ.86.74 లక్షలు, పటాన్చెరులో రూ.86.56 లక్షలు, సంగారెడ్డిలో రూ.89.91 లక్షలు, జహీరాబాద్‌లో రూ.1. 28 కోట్లు దళితవాడల్లో అభివృద్ధ్ది, మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యేలు ఖర్చు చేయనున్నారు. ఎమ్మెల్సీ, ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి ఎస్సీ కోటాలో రూ.77.25 కోట్లు ఖర్చు చేస్తారు. ఇక ఎస్టీ కోటాలో సీడీపీ నిధులను జనాభా ఆధారంగా కేటాయించారు. ఈ నిధులను గిరిజన తండా ల్లో అభివృద్ధ్ది, మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేస్తారు. అందోలు నియోజకవర్గంలో ఎస్టీ కోటాలో సీడీపీ నిధులను రూ.28.09 లక్షలు, నారాయణఖేడ్‌లో రూ.68. 94 లక్షలు, పటాన్చెరులో రూ.13.24 లక్షలు, సంగారెడ్డిలో రూ.20.54 లక్షలు, జహీరాబాద్‌లో రూ.31. 07 లక్షలను ఎమ్మెల్యేలు ఖర్చు చేయనున్నారు. ఎమ్మె ల్సీ, ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి తన సీడీపీ నిధుల నుంచి ఎస్టీ కోటాలో రూ.45.40 లక్షలు ఖర్చు చేస్తారు. జిల్లాలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సీడీపీ నిధులు వినియోగానికి ప్రతిపాదనలను తయారు చేసి కలెక్టర్‌కు అందజేసేందుకు సిద్ధమవుతున్నారు.