
సంగారెడ్డి/టేక్మాల్/మెదక్ మున్సిపాలిటీ/అందోల్/మునిపల్లి,సెప్టెంబర్ 9 : దండాలయ్య… ఉండ్రాలయ్యా… దయ చూపయ్య దేవా..! అంటూ ఏకదంతుడిని వినాయక చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు పూజించడం ఆనవాయితీగా వస్తున్నది. వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడానికి మండపాల ఏర్పాట్లలో ప్రత్యేకతను ప్రదర్శించడానికి నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విగ్రహాల ఎత్తు, రంగుల విషయంలో పోటీపడి కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. ఏటా వినాయక చవితిని పురస్కరించుకుని విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. నవరాత్రులు ముగిసిన అనంతరం చెరువుల్లో నిమజ్జనం చేస్తుంటాం. అధికంగా విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ పారీస్‌తో తయారు చేసినవే ఉంటున్నాయి. వీటితో కాలుష్యం పెరుగుతుందనే విషయం తెలిసినా, ఆ విగ్రహాల కొనుగోలు చేయడానికి మక్కువ చూపుతున్నారు. తద్వారా జల కాలుష్యం పెరుగుతున్నది. ప్రకృతిని, జంతు జీవాల్ని ప్రేమించాలని ప్రబోధించే ఈ పండుగను, దానికి విరుద్ధమైన పోకడలతో జరుపుకోవడం తగదని పర్యావరణ ప్రేమికులంటున్నారు. మట్టితో చేసిన వినాయకుడిని పూజించాలని శాస్త్రం చెబుతున్నది. ఈ నేపథ్యంలో మట్టి విగ్రహాలను ప్రతిష్ఠిస్తే పర్యావరణాన్ని తమవంతుగా కాపాడిన వారమవుతాం.
పీవోపీ విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు..
ప్లాస్టర్ ఆఫ్ పారీస్ విగ్రహంలో జిప్సం, సల్ఫర్, పాస్పరస్, మెగ్నీషియం వంటి రసాయనిక పదార్థాలు ఉం టాయి. ఇవి నీటిలో సులువుగా కరగవు. నీరు భూమిలోకి ఇంకకుండా రసాయనాలు అడ్డుపడతాయి. విగ్రహాలకు వేసే రంగుల్లో కాడ్మి యం, సిలికాన్, పాదరసం, సీసం, కర్బనం, మాలిబ్దినం, ఆర్సానిక్, క్రోమియం వంటి లోహాలు కలిసి ఉంటాయి. విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసినప్పుడు ఈ రసాయనాలు నీటిలో కలిసి జలచరాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అలాగే, వాటిని తాగే ప్రాణులకు వ్యాధుల ముప్పు పొంచి ఉంది. మానవుడిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రధానంగా కాలేయం, మూత్రపిండ సం బంధిత వ్యాధులకు కారణమవుతాయి.
మెగ్నీషియం : అనేక రంగుల్లో మెగ్నీషియం వినియోగిస్తారు. ఇది చేతిపై చేరి స్వేద గ్రంథుల ద్వారా శరీరంలోని నరాల్లోకి చేరుతుంది. నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. మెదడు మొద్దు బారిపోతుంది.
కాల్షియం : నీళ్లలో కాల్షియం శాతం పెరిగితే ఆ నీరు బరువెక్కుతుంది. నీటి గాడత పెరుగుతుంది. ఈ నీటిని వినియోగిస్తే పక్షవాతం వస్తున్నది. మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయి. జుట్టు రాలిపోతుంది. థైరాయిడ్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
లెడ్ : వైద్య పరిభాషలో లెడ్ని విషంతో పోలుస్తారు. రంగుల ద్వారా ఈ లెడ్ శరీరంలోకి చేరుతుంది. దీనితో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
ఆర్గానిక్ : దీని ద్వారా ఎముకల సమస్య ఉత్పన్నమవుతుంది. కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది.
మట్టి విగ్రహాలను పూజించాలి..
మట్టి వినాయకులను ప్రతిష్ఠించడం మనకు, ప్రకృతికి మహోపకారం. ముఖ్యంగా వినాయకుల దగ్గర ఇష్టంగా ఆడుకునే చిన్నపిల్లలకు ఆరోగ్యకరంగా ఉంటుంది. వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న అనేక వాటిల్లో వివిధ రంగులతో తయారయ్యే వినాయకులు కూడా కారణం. అందుకే ఈ తరాన్ని జాగృతం చేసి మట్టి వినాయకులను ప్రతిష్ఠించేలా కృషిచేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఎంతైనా ఉంది. ఆ దిశగా అందరూ ఆలోచించి మట్టి విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రతిఒక్కరూ భారీ సైజుల్లో వినాయకులను ఏర్పాటుపై చేయాలనే ఉత్సాహంతో ప్లాస్టర్ ఆఫ్ పారీస్‌తో తయారైన రంగురంగుల వినాయకులపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. రసాయనిక విగ్రహాల తయారీలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నది. రసాయనిక విగ్రహాలను చెరువుల్లో వేయడంతో అవి కరగడానికి నెలలు పడుతున్నాయి. చెరువులు కూడా కలుషితమై జీవరాశులకు ప్రమాదం కలిగే అవకాశం ఉంది. అందరం మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించేలా ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి జిల్లాలో ఇప్పటికే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇండ్లలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించేవారికి గ్రామ గ్రామాన మట్టి వినాయకులను పలు సంస్థల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
విఘ్నాలు తొలగాలి.. కార్యాలు నిర్విఘ్నంగా సాగాలి
విగ్నేశ్వరుని అనుగ్రహం మన అందరిపై ఉండాలి
దేవున్ని పూజిద్దాం.. ప్రకృతిని ప్రేమిద్దాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
జిల్లా ప్రజలకు మంత్రి వినాయక చవితి శుభాకాంక్షలు
సిద్దిపేట, సెప్టెంబర్ 9 : ఏ కార్యం చేయాలన్నా తొలి పూజ ఆరాధన విఘ్నేశ్వరుడికే అని, అన్ని విఘ్నాలు తొలిగించే గణపతి.. కరోనా మహమ్మరి అనే విఘ్నం తొలిగించి అన్ని కార్యాలు నిర్విఘ్నంగా సాగేలా దీవించాలని గణపతిని ప్రార్థిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా ప్రజలకు మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంట్లోనే మట్టి గణపతుల ప్రతిమలను ప్రతిష్ఠించి ఇంటిల్లిపాది పూజించుకోవాలన్నారు. ప్రకృతిని దేవుడి రూపంలో పూజించే గొప్ప పండుగ అని, మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ప్లాస్టిక్ పూలు కాకుండా ప్రకృతి సిద్ధమైన పత్రులు పూల దండలతో పూజిద్దామన్నారు. చెరువులు, వాగులను, ప్లాస్టిక్ రహితంగా ఉంచుకొని పర్యావరణాన్ని సంరక్షంచుకుందామన్నారు. విగ్నేశ్వరుడి అనుగ్రహం మన అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అందరు అనందోత్సవాల మద్య పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.
అరచేతిపై వినాయకుడి చిత్రం
నారాయణఖేడ్, సెప్టెంబర్ 9 : మండలంలోని అనంతసాగర్‌కు చెందిన చిత్రకారుడు గుండు శివకుమార్ వినాయక చవితిని పురస్కరించుకుని అరచేతిపై చిత్రకారుడి రూపంలో గీసిన వినాయకుడి చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆకర్షణీయమైన రంగులతో అరచేతిలో వినాయకుడి చిత్రాన్ని గీయడంతో పాటు గోళ్లపై సైతం ఐదు రకాల వివిధ రూపాల్లో వినాయకుడి చిత్రాలను తీర్చిదిద్దారు. గుండు శివకుమార్ చిత్రలేఖనంలో సందర్భానుచితంగా తన విభిన్నతను ప్రదర్శిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఫలితంగా పలు పురస్కారాలు లభించాయి.
పండుగును సుఖసంతోషాలతో జరుపుకోవాలి
వినాయక చవితి పండుగను ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలి. మెదక్ జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు. కరోనా నేపథ్యంలో గతేడాది వినాయక చవితి పం డుగకు ప్రజలు దూరమయ్యాయారు. ఈ ఏడాది పండుగను ప్రజలు ఘనంగా జరుపుకొనేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నది. ప్రతిఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించుకోవాలి.
-సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి,
ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి
మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలి
పర్యావరణానికి హాని కలిగించకుండా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించుకోవాలి. పర్యావరణానికి హాని కలిగించే రసాయన విగ్రహాలతో జరిగే అనర్థాలపై ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రతిఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి. మెదక్ నియోజకవర్గంలో 10వేలకు పైగా మట్టి విగ్రహాలు, విత్తన విగ్రహాలు పంపిణీ చేశాం.
-పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మెదక్
రేజింతల్ సిద్ధివినాయక ఆలయం ముస్తాబు
న్యాల్కల్, సెప్టెంబర్ 9: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్‌లో స్వయంభూవుగా వెలిసిన సిద్ధివినాయక ఆలయం నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరానున్నారు. ఆలయ కమిటీ ఆధ్యర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ గర్భగుడిని రంగురంగుల పువ్వులు, విద్యుత్ దీపాలతో అలకరించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారికి కుంకుమార్చన, అభిషేకం, పాలాభిషేకం, గణపతి హోమం, అఖండ దీపోత్సవం తదితర ప్రత్యేక పూజలు చేయనున్నట్టు ఆలయ అర్చకులు తెలిపారు. మం డలంలోని హద్నూర్ గ్రామ వరసిద్ధివినాయక, చీకూర్తిలోని సిద్ధివినాయక ఆలయాల్లో ప్రత్యేక పూజలకు ఏర్పాటు చేశారు.