సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 7 : వృద్ధులను నిరాధారణకు గురి చేయకుండా ఆదరించాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువా రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత హాజరయ్యారు. ఈ సందర్భంగా వృద్ధులను ఘనంగా స న్మానించి గౌరవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వృద్ధులైన తల్లిదండ్రుల మనస్సును పిల్లలు తెలుసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వయోవృద్ధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వయోవృద్ధుల సహాయార్థం ప్రత్యేక టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 14567ను ఏర్పాటు చేశామని తెలిపారు. అవసరమైన వృద్ధులు ఫోన్ చేసి సహాయం పొందాలన్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్స్‌ను రెగ్యులర్‌గా తనిఖీ చేయాలని మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమాధికారి పద్మావతికి సూచించారు.
60 ఏండ్లు నిండిన వారందరూ
సీనియర్ సిటిజన్లే…
సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత మాట్లాడుతూ 60 ఏండ్లు నిండినవారందరూ సీనియర్ సిటిజన్లే అన్నారు. వయోవృద్ధుల కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయని, వాటిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పిల్లలు పోషించకపోతే చట్టం ద్వారా న్యాయం పొందవచ్చన్నారు. వారికి సంబంధించిన పలు చట్టాలపై జడ్జి వివరించారు. అనంతరం కొవిడ్-19 దృష్ట్యా వయోవృద్ధులు, వారి సంరక్షకులకు సలహాలకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో వయోవృద్ధుల అసోసియేషన్ అధ్యక్షుడు చిన్నారెడ్డి, అధికారులు, ఆయా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు.