
రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా సిద్దిపేట జిల్లా వాసులు
మెదక్ జిల్లా నుంచి ఇద్దరు ఎంపిక
జహీరాబాద్ నుంచి ఒకరు
ప్రకటించిన ప్రభుత్వం.. ఈనెల 5న హైదరాబాద్‌లో ప్రదానం
ఉత్తమ విద్యా బోధనతో పాటు విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిందుకు గాను 38మంది ఉపాధ్యాయులను రాష్ట్రస్థాయి అవార్డులకు ప్రభుత్వం శుక్రవారం ఎంపిక చేసింది. ఇందులో సిద్దిపేట జిల్లానుంచి ఇద్దరు, మెదక్ జిల్లా నుంచి మరో ఇద్దరు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుంచి ఒకరు ఉన్నారు. ఈనెల 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో వీరికి విద్యాశాఖ అవార్డులను ప్రదానం చేయనుంది. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని తోటి టీచర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా డాక్టర్ విజయ్
జహీరాబాద్, సెప్టెంబర్ 3 : రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ టీఎస్ఆర్ఎస్ ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ను ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను విడుదల చేసింది. అందులో జహీరాబాద్ మండలంలోని హోతి(కే) శివారులోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ ఎంపికైంది. టీఎస్ఆర్ఎస్ గురుకుల పాఠశాల, కళాశాల కోహీర్ మండలంలోని దిగ్వాల్లో అద్దె భవనంలో ఉండేది. ప్రభుత్వం జహీరాబాద్ మండలంలోని హోతి(కే) శివారులో 10 ఎకరాల స్థలంలో భవన నిర్మాణం చేసేందుకు నిధులు మంజూరు చేసింది. డాక్టర్ విజయ కొత్తగా ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే భవన నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు పలుమార్లు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, కలెక్టర్ హనుమంతరావును కలిసి సమస్యను వివరించారు. దీంతో వారు స్పందించి పనులను వేగవంతం చేసి కొత్త భవనం పనులు పూర్తి చేయించారు. దిగ్వాల్లోని గురుకుల పాఠశాల, కళాశాలను హోతి(కే) శివారులో నిర్మించిన భవనంలోకి మార్చారు. 10 ఎకరాల్లో భవనాల నిర్మాణం చేయడంతో పాటు ఆట స్థలం, హరితహారంలో పండ్ల మొక్కలు నాటించారు. ఖాళీ స్థలంలో కూరగాయ పంటలు పండిస్తున్నారు. టెన్త్, ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించింది. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర స్థాయి అవార్డులు సైతం పొందారు. దీంతో ప్రభుత్వం ప్రిన్సిపాల్ విజయ సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసింది.
బాధ్యత పెరిగింది..
రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డుకు ఎంపిక కావడం మరింత బాధ్యత పెంచింది. గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న బాలికలకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు భోజనం పెట్టి ఉత్తమ ఫలితాలు సాధించాం. టెన్త్, ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందాం. బాలికలు ప్రదర్శించిన నాటిక రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. పాఠశాల అవరణలో హరితహారంలో భాగంగా పండ్లు మొక్కలు పెంచుతున్నాం. విద్యార్థులకు కూరగాయల పంటలపై ఆవగాహన కల్పిస్తున్నాం. ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో పాఠశాల, కళాశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించి మంచి ఫలితాలు సాధిస్తున్నాం. టీఎస్ఆర్ఎస్ పాఠశాలకు చేసిన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా.