
జహీరాబాద్, ఆగస్టు 31: ట్రైడెంట్ చక్కెర పరిశ్రమలో నవంబర్ 15 వరకు చెరుకు క్రషింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఎంపీ బీబీపాటిల్ యాజమాన్యాన్ని ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ క్యాంపు కార్యాలయంలో ట్రైడెంట్ యాజమాన్యంతో ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. గతేడాది జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బీ)లో ఉన్న ట్రైడెంట్ చక్కెర పరిశ్రమలో క్రషింగ్ లేకపోవడంతో చెరుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. గతంలో పరిశ్రమకు చెరుకు సరఫరా చేసిన రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు పెండింగ్ బిల్లులు అందేలా చూసిందన్నారు. 2021-22 సంవత్సరంలో క్రషింగ్ సీజన్ ప్రారంభించి పరిశ్రమకు చెరుకు సరఫరా చేసిన రైతులకు 14 రోజుల్లో బిల్లులు చెల్లించాలని సూచించారు. నవంబర్ 15 వరకు పరిశ్రమలో క్రషింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మద్దతు ధరను 14 రోజల్లో ప్రకటించాలన్నారు. చెరుకు సరఫరా చేసిన 14 రోజుల్లో రైతులకు బిల్లులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రైడెంట్ పరిశ్రమ చైర్మన్ నందకుమార్ తెలిపారు. జహీరాబాద్ ప్రాంతంలో ఉన్న చెరుకు రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, సంగారెడ్డి జిల్లా చెరుకు అభివృద్ధి సహాయ అధికారి కె.రాజశేఖర్, జహీరాబాద్ సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, చెరకు రైతు సంఘం నాయకులు జీ.గుండప్ప, గోవర్ధన్‌రెడ్డి, విజయ్‌కుమార్, నర్సింలు, నర్సింహారెడ్డి, పాండురంగారెడ్డి, పెంటారెడ్డి తదితరులున్నారు.