
సుదీర్ఘ విరామం తర్వాత నేటినుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కాగా, కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. విద్యాసంస్థల్లో పారిశుధ్య, శానిటైజేషన్ పనులు పూర్తి చేయించింది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టారు. విద్యార్థులు భౌతికదూరం పాటించడం, కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలుకు రంగం సిద్ధం చేశారు. వ్యాక్సినేషన్ పూర్తయినఉపాధ్యాయులతో బోధన కొనసాగనున్నది. పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులకు అనుమతి ఇచ్చిన హైకోర్టు, గురుకులాలు, వసతి గృహాలను మాత్రం తెరవొద్దని ఆదేశించింది. పాఠశాలలకు రాని విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేయగా, ఆ మేరకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుం టున్నది. ప్రత్యక్ష తరగతులు లేదా ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహించుకునే స్వేచ్ఛను ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
సంగారెడ్డి/సిద్దిపేట అర్బన్/మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 31 : ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాసంస్థలు నేటి నుంచి ప్రారంభించనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యా శాఖ అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. చాలాకాలం తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా అధికారులు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా అన్ని విద్యాసంస్థల్లో పారిశుధ్యం పనులు ఇప్పటికే ముగిశాయి. పది రోజుల నుంచే మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి విద్యాశాఖ అధికారులను సమాయత్తం చేస్తూ పాఠశాలల పునఃప్రారంభానికి చర్యలు తీసుకున్నారు. అన్ని పాఠశాలల్లో శానిటైజైషన్, నీటి వసతి, మరుగుదొడ్లు, మధ్యా హ్న భోజనానికి కావాల్సిన సరుకులు అందించడం లాం టి తదితర సౌకర్యాలు కల్పించారు.
సిద్దిపేటలో 1391 విద్యాసంస్థలు
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మొత్తం 1391 విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. అందులో 1224 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, 40 రెసిడెన్షియల్ పాఠశాలలు, ఒక నవోదయ, ఒక కేంద్రీయ విద్యాలయంతో కలిపి 1266 పాఠశాలలున్నాయి. 20 ప్రభుత్వ, 39 ప్రైవేటు జూనియర్ కళాశాలలు, 8 ప్రభుత్వ డిగ్రీ, 26 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, 13 ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలతో పాటు 11 ప్రభుత్వ, ప్రైవేటు డీఈడీ, బీఈడీ, బీపీఈడీ కళాశాలలు, 4 బీటెక్, బీ ఫార్మసీ కళాశాలలు, ఒక ప్రభుత్వ పీజీ, 3 ప్రైవేటు పీజీ కళాశాలలు, 1150 అంగన్వాడీ కేంద్రాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా పాఠశాల స్థాయిలో మొత్తం 1,63,113 మంది విద్యార్థులున్నారు. అందులో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 35,632 మంది విద్యార్థులుండగా, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు 20,006 మంది విద్యార్థులున్నారు. సంగారెడ్డి జిల్లాలో 1794 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 2,71,993 మంది విద్యార్థులు చదువుతున్నారు. అన్ని పాఠశాలల్లో 12500 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలుండగా, 89,604 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో 108 ప్రైవేట్ పాఠశాలల్లో 32,088 మంది చదువుకుంటున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు జిల్లాలో 40 ఉండగా ఇందులో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ సెక్టైర్లెన కస్తూ ర్బా, మోడల్, టీఎస్ గురుకుల, మైనార్టీ జూనియర్ కళాశాలలు 24 ఉన్నాయి. వీటిల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారు సుమారు 11 వేల వరకు ఉన్నారు. ప్రభుత్వం అంతే గాకుండా జిల్లాలో 22 ప్రైవేట్ జూనియర్ కళాశాలలున్నాయి. అలాగే జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 2 ఉండగా 2,100 మంది చదువుతున్నారు. అంతేగాకుండా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు 8 ఉన్నా యి. వీటితో పాటు 2 బీఈడీ కళాశాలు, ఒక పీజీ సెంటర్, ఒక ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి.
ప్రైవేట్ పాఠశాలలు సమాయత్తం..
పునఃప్రారంభానికి ప్రైవేట్ పాఠశాలలు సమాయత్తమయ్యాయి. విద్యార్థులను బస్సుల్లో తీసుకొచ్చేందుకు ఏర్పా ట్లు చేసుకున్నాయి. మెదక్ జిల్లాలో 300కుపైగా స్కూల్ బస్సులు ఉండగా, వాటి ఫిట్నెస్ను మూడు రోజులుగా రవాణాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. బస్సుల కండీషన్‌ను చూశారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
పాఠశాలలు భౌతికంగా తెరుస్తున్న ఈ సందర్భంలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు చాలా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ తప్పకుండా కరోనా నిబంధనలు పాటించేలా చూడాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాచిస్తూ, మాస్క్ ధరించి రావాలని అధికారులు చెబుతున్నారు. ఒక తరగతికి కేవలం 20మంది విద్యార్థులకు మాత్రమే కూర్చునేలా సీటింగ్ అరెంజ్మెంట్ ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో పరిశుభ్రత, శానిటైజేషన్ పనులు దాదాపు పూర్తి చేశారు. అనారోగ్యంతో ఉన్న విద్యార్థులు ముందుగా సమాచారం ఇస్తే వారికి తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. అందుకనుగుణంగా ప్రతి పాఠశాలలో ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేశారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులు పాటించాల్సిన నియామాల బోర్డులను ఏర్పాటు చేశారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం అవసరమైన బియ్యం ఇప్పటికే పాఠశాలలకు చేరుకున్నాయి. విద్యార్థుల సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సులు నడిచేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.