వేల్పూర్, జనవరి 22: ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కోరా వద్ద శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన అత్త, అల్లుడు పోచవ్వ(60), తిరుపతయ్య (40) సీజనల్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం ఉదయం వీరు పల్లికాయ కొనుగోలు కోసం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్‌కు వెళ్లారు. అంకాపూర్‌లో పల్లికాయ కొనుగోలు చేసి ఆటోలో మెట్‌పల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వేల్పూర్ మండలం లక్కోరా వద్ద మెట్పల్లి నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొన్నది. ఆటోలో ఉన్న తిరుపతయ్య, పోచవ్వకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో డ్రైవర్‌కు కాలు విరగడంతో ఆర్మూర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. మృతదేహాలను ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఏఎస్సై యాదగిరి వివరించారు. కేసు నమోదు చేసినట్లు చెప్పారు.