శక్కర్‌నగర్, జనవరి 21 : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి తరహాలో అలరారిన శక్కర్‌నగర్ రామాలయానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ఆలయ కమిటీతోపాటు దాతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 1952లో ఈ ప్రాంతంలో నిర్మించిన నిజాం షుగర్‌ఫ్యాక్టరీ అధికారులు గతంలో ఆలయ నిర్వహణ బాధ్యతలను చూసేవారు. ఆసియాఖండంలోనే రెండో అతిపెద్ద ఫ్యాక్టరీగా గుర్తింపు పొందిన నిజాంషుగర్స్ ఓ వెలుగు వెలిగిన కాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. కాలక్రమేణ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కావడంతో అధికారులు సైతం రామాలయ నిర్వహణ విషయంలో శ్రద్ధ చూపలేదు. ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ చేతులెత్తేయడంతో ఫ్యాక్టరీలో పనిచేసే కొందరు అధికారులు.. రైతుల సహకారంతో ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపట్టినప్పటికీ ఇబ్బందులు తప్పలేదు.
70 ఏండ్ల చరిత్ర కలిగి, సుమారు రెండెకరాల పైచిలుకు స్థలంలో నిర్మించిన ఈ ఆలయంలో ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. శ్రీరామ నవమి ఉత్సవాలకు ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయానికి పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు ప్రస్తుత కమిటీ సభ్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడడంతోపాటు నిర్వహణ కోసం ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.
పూజారి, మేనేజర్, పారిశుద్ధ్య సిబ్బంది వేతనాల చెల్లింపు ఆలయ కమిటీకి ఇబ్బందిగా మారింది. ఏటా శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలను ఇప్పటికీ అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్థానికుల సహకారంతో కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ గత వైభవం కనిపించడం లేదు.
ఆదాయం సరిగాలేక ఆలయ నిర్వహణ ఇబ్బందిగా మారిందని ఆలోచించిన ఆలయ కమిటీ కార్యదర్శి మల్లాది వెంకటేశ్వరశర్మ.. కమిటీ చైర్మన్, సభ్యులు, దాతల సహకారంతో ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. తన సొంత డబ్బులు రూ.15లక్షలు వెచ్చించి వివిధ పనులు చేపట్టారు. వాటితోపాటు స్థానికుల సహకారంతో ఆలయానికి చెందిన స్థలంలో రూ.55లక్షల వ్యయంతో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను చేపట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి నిర్మాణ పనులు పూర్తయితే వాటి ద్వారా వచ్చే ఆదాయం ఆలయ నిర్వహణకు ఉపయోగపడుతుంది.
శాశ్వత ఆదాయం కోసం చర్యలు
దశాబ్దాల చరిత్ర ఉన్న శక్కర్‌నగర్ రామాలయం నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా శాశ్వత ఆదాయం కో సం చర్యలు తీసుకుంటున్నాం. ఇందులోభాగంగా ఇండ్ల సముదాయాన్ని నిర్మిస్తున్నాం. ఇప్ప టి వరకు నా సొంత డబ్బులు రూ.15 లక్షలు ఖర్చు చేశా. ఆలయ స్థలం కబ్జాకాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆలయ కమిటీ అధ్యక్షుడు విశ్వనాథం, కమిటీ సభ్యుల సహకారం, సూచనల మేరకు పనులు కొనసాగుతున్నాయి.