
కట్టంగూర్(నకిరేకల్), జనవరి 14: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు లభించిందని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్గా డాక్టర్ దూదిమెట్ల బాలరాజుయాదవ్కు శుక్రవారం నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో విద్యార్థి నేతగా పోరాటాలు చేసిన దూదిమెట్ల బాలరాజు యాదవ్కు అరుదైన గౌరవం దక్కిందన్నారు. సమైక్య పాలనలో హైదరాబాద్ నడిబొడ్డున 2013 సెప్టెంబర్ 7న నిర్వహించిన ఏపీఎన్జీఓల సభలోకి దూసుకెళ్లి గుండాల దాడికి చెక్కుచెదరకుండా తెలంగాణ నినాదాన్ని వినిపించిన ఉద్యమకారుడు బాలరాజ్యాదవ్ అని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నడికుడి ఉమారాణి, నకిరేకల్, కట్టంగూర్ జడ్పీటీసీలు మాద ధనలక్ష్మి, తరాల బలరాములు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.