రైతులు తక్కువ ఖర్చుతో పంటలు సాగు చేసి ఎక్కువ లాభం పొందేలా జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, పూల సాగులో ఆధునిక పద్ధతులను అవలంబించేలా కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ఉద్యాన పంటల సాగులో ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇజ్రాయిల్ సాగు విధానాన్ని రంగారెడ్డి జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. పొలంలో విత్తనాలు వేయకుండా నేరుగా నారు నాటాల్సి ఉంటుంది. దీంతో పెట్టుబడి తగ్గడంతోపాటు తక్కువ విస్తీర్ణంలోనే అధిక దిగుబడి వస్తుంది. పైలట్ ప్రాజెక్టుగా యాచారం మండలం నందివనపర్తి, చౌదరిపల్లి గ్రామాలను ఎంపిక చేశారు. ఒక్కో గ్రామంలో 100 ఎకరాల చొప్పున కొత్త పద్ధతులతో కూరగాయలు, పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టనుండగా.. ఉద్యానవన శాఖ అధికారులే నారును రాయితీపై అందించనున్నారు. ఈ మేరకు ఆ గ్రామాల రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు సాగుకు అవసరమైన మల్చింగ్ షీట్, డ్రిప్, స్ప్రింక్లర్లు తదితరాలను సబ్సిడీపై అందించనున్నారు.
రంగారెడ్డి, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : పంటలను సాగు చేసేందుకు డ్రిప్, మల్చింగ్, నారు వేసే విధానంతోపాటు అధునాతన టెక్నాలజీతో ఉద్యానవన సాగులో ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఇజ్రాయిల్‌లో అమలు చేస్తున్న సాగు విధానాన్ని జిల్లాలో అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు అధిక దిగుబడి, అధిక లాభాలిచ్చే విధంగా కొత్త సాగు విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచే జిల్లాలో అమల్లోకి తీసుకువచ్చేందుకు జిల్లా ఉద్యానవన శాఖ కార్యాచరణ రూపొందించింది. పాత పద్ధతిలోనే కూరగాయల సాగు కొనసాగకుండా ఉద్యానవన సాగులో నూతన టెక్నాలజీని ఉపయోగించుకొని ముందు వరుసలో నిలిచిన ఇజ్రాయిల్ సాగు విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు నిర్ణయించారు. హైదరాబాద్ నగర జనాభా పెరుగుతుండడంతో కూరగాయాలకు సంబంధించి ఇతర జిల్లాలపై ఆధారపడాల్సి వస్తుండగా, దీంతో తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడి, అధిక లాభాలు వచ్చే నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. సాగులో ఆధునిక టెక్నాలజీపై రైతులకు అవగాహన కల్పించడంతోపాటు ప్రత్యేక శిక్షణనివ్వడంతోపాటు జిల్లా ఉద్యానవన శాఖ నుంచి సబ్సిడీపై అందించే మల్చింగ్, డ్రిప్లాంటి వాటిని రైతులకు అందించేందుకు మొదటి ప్రాధాన్యతనివ్వనున్నారు.
నారుతో సాగు…
మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో ఆధునాతన పద్ధతులతో కూరగాయలు, పండ్లు సాగు చేసేందుకు ఇజ్రాయిల్ సాగు విధానాన్ని జిల్లా ఉద్యానవన శాఖ శ్రీకారం చుట్టింది. ప్రధానంగా కూరగాయల సాగులో ఇప్పటివరకు ఉన్న విత్తనాలతో సాగు చేసే విధానం కాకుండా నారుతో సాగు చేసే విధానాన్ని అమలుచేయనున్నారు. కూరగాయల సాగును కొత్త పద్ధతులతో అధిక మొత్తంలో చేస్తున్న జిల్లాలోని రెండు గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. యాచారం మండలం నందివనపర్తి, చౌదరిపల్లి గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్‌గా జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు ఎంపిక చేశారు. సంబంధిత రెండు గ్రామాల్లో ఒక్కో గ్రామంలో 100 ఎకరాల చొప్పున ఇజ్రాయిల్ విధానంలో కూరగాయల సాగు చేయనున్నారు. జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నుంచి ఉద్యానవన శాఖ అధికారులే నారును రాయితీపై అందించనున్నారు. అయితే నందివనపర్తి, చౌదరిపల్లి గ్రామాల్లో పంట కాలనీలను ఏర్పాటు చేసి కూరగాయల సాగును చేయనున్నారు. కూరగాయలతోపాటు పండ్ల తోటల పెంపకాన్ని కూడా సంబంధిత గ్రామాల్లో చేపట్టనున్నారు. టమాట, కాకర, బీర, వంకాయ కూరగాయ పంటలను రెండు గ్రామాల్లో కలిపి 200 ఎకరాల్లో సాగు చేసేందుకు నిర్ణయించారు. అదేవిధంగా పండ్ల తోటలకు సంబంధించి బొప్పాయి, మామిడి, పుచ్చకాయ పండ్ల తోటలను సాగు చేయనున్నారు. ఎంపిక చేసిన రెండు గ్రామాల రైతులకు కొత్త టెక్నాలజీపై అవగాహన కల్పించడంతోపాటు శిక్షణనివ్వనున్నారు. ఇజ్రాయిల్ సాగు విధానంతో పంట సాగుకు పెట్టే పెట్టుబడి తగ్గడంతోపాటు తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడి రావడంతో రైతులకు అధిక లాభాలను పొందుతారు. నారు విధానంతో సాగు చేసే సంబంధిత గ్రామాల రైతులకు జిల్లా ఉద్యానవన శాఖ నుంచి కూడా అన్ని రకాల ప్రోత్సాహం అందించనున్నారు. ఫాంపాండ్స్, మల్చింగ్ షీట్, డ్రిప్, స్ప్రింకర్లు తదితరాలను సబ్సిడీపై రైతులకు అందించనున్నారు. అంతేకాకుండా ఉద్యానవన శాఖ నుంచి అందించే ప్రతి పథకంలోనూ సంబంధిత గ్రామాల రైతులకే మొదటి ప్రాధాన్యతనిచ్చి పథకాల ప్రయోజనాలను అందించనున్నారు.