సర్దార్‌నగర్ వారాంతపు సంతకు యమ క్రేజ్
జిల్లాలోనే అతిపెద్దదిగా పేరు
సరసమైన ధరల్లో అన్నిరకాల వస్తువులు, తినుబండారాలు లభ్యం
తాజా కూరగాయలు, నాన్‌వెజ్, వంట సామగ్రి, గృహోపకరణాలు, దుస్తులు వ్యవసాయ పనిముట్లు, మరెన్నో అందుబాటులో..
సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌కు దీటుగా అంగడి నిర్వహణ..
జోరుగా పశువులక్రయ విక్రయాలు
రంగారెడ్డి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీగా జనం రాక
సంతా మా ఊరి సంతా.. వారానికోసారి జోరుగా సాగేటి సంతా మా ఊరి సంతా.. అన్నట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో వారాంతపు సంతలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. ఎక్కడ సంత ఉంటే అక్కడ నిత్యావసరాలు, వస్తువులు విక్రయిస్తూ ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. గది అడ్వాన్స్, అద్దె వ్యాపార వాణిజ్య పన్నులు, విద్యుత్ బిల్లుల భారం లేకపోవడంతో చాలామంది వ్యాపారులు వారాంతపు సంతలకే మొగ్గు చూపుతున్నారు. ప్రజలకు కూడా దూరభారంతోపాటు వ్యయప్రయాసలు తప్పుతుండటంతో ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా సంతలు జనంతో కిక్కిరిస్తున్నాయి. ముఖ్యంగా షాబాద్ మండలంలోని సర్దార్‌నగర్ అంగడికి భలే క్రేజ్ ఉన్నది. పట్టణాల్లోని సూపర్ బజార్లు, షాపింగ్ మాల్స్‌కు దీటుగా ఇక్కడ అన్ని రకాల సరుకులు, వస్తువులు లభిస్తాయి. జిల్లాలోనే అతిపెద్ద సంతగా దీనికి పేరున్నది. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ అంగడిలో సరసమైన ధరలకే నాణ్యమైన సామగ్రి లభిస్తుండడంతో రంగారెడ్డి జిల్లా నుంచే కాకుండా ఇతర చుట్టుపక్కల జిల్లాల ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. పెద్ద ఎత్తున పశువుల క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. కేవలం కూరగాయలే కాకుండా గుండుపిన్ను మొదలుకొని గృహోపకరణాలు, నిత్యావసరాలు, మటన్, చికెన్, చేపలు, దుస్తులు, వ్యవసాయ పనిముట్లు, వేడుకలకు అవసరమయ్యే అన్ని రకాల సామగ్రి ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
షాబాద్, ఆగస్టు 28 : దశాబ్దల కింద వెలిసిన వారాంతపు సంత (అంగడి)లకు నేటికి ఆదరణ తగ్గడం లేదు. నేడు నగరాల్లో వెలసిన సూపర్ బజార్లు, షాపింగ్ మాల్స్‌కు దీటుగా సంతలు గ్రామీణ సూపర్ బజార్లుగా పేరుపొందుతున్నాయి. గుండు పిన్ను మొదలుకొని గృహోపకరణాలు, నిత్యావసరాలు, పెండ్లిళ్లు, పేరంటాలకు అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు ఒకేచోట లభిస్తుండటంతో సంతలు పూర్వ వైభవాన్ని చాటుకుంటున్నాయి. గ్రామాల్లో నివసించే ఎక్కువ శాతం పేద, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరలకే కావాల్సిన వస్తువులు లభిస్తున్నాయి. ప్రధానంగా మండల కేంద్రాలు, పెద్ద పంచాయతీల ప్రధాన కూడళ్లలో ఏర్పాటైన వారాంతపు సంతలు అనునిత్యం శ్రమించే కర్షకులు, కార్మికులకు ఈ ఒక్కరోజు తమ శ్రమను మరిచిపోయేలా సంతలు ఉపయోగపడుతున్నాయి. రైతులు, కూలీలు అవసరమయ్యే వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలం సర్దార్‌నగర్‌లో ప్రతి మంగళవారం సంత జరుగుతున్నది. ఈ సంతలో కూరగాయల విక్రయాలు, ఇంటికి అవసరమయ్యే అన్ని రకాల సామగ్రి దొరుకుతుంది. పశువుల సంత పెద్ద ఎత్తున ఉంటుంది. జిల్లా ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉమ్మడి మహబూబ్‌నగర్, సంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి పశువుల క్రయ విక్రయాలు చేపడుతారు. జిల్లాలోనే అతి పెద్ద సంతగా సర్దార్‌నగర్‌కు పేరున్నది.
నాటి పద్ధతులే…
పూర్వం సంతల్లో క్రయ విక్రయాలు పూర్తిగా వస్తు మార్పిడితో జరిగేవి. నేడు సైతం రైతులు, కూలీలు తాము పండించిన ధాన్యాలు, పెంపకం కోళ్లను సంతలో అమ్మి తమకు అవసరమయ్యే నిత్యావసరాలను కొనుగోలు చేస్తూ అదే పద్ధతులను పాటిస్తున్నారు.
తాజా కూరగాయలు…
సంతలో తాజా కూరగాయలు లభ్యమవుతున్నాయి. ఒక కుటుంబానికి వారానికి సరిపడా కూరగాయలను ఒకేసారి కొనుగోలు చేస్తున్నారు. షాబాద్ మండల ప్రజలే కాకుండా ఇతర మండలాల నుంచి రైతులు కూరగాయలు అమ్మేందుకు వస్తున్నారు. పెద్ద రైతులు సైతం తమ పంటలను ఇక్కడే అమ్ముతున్నారంటే సంతలో ఏ స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. రైతుల పొలాల నుంచి నేరుగా సంతకు తాజా కూరగాయలను తీసుకొచ్చి విక్రయిస్తారు.
ఉపాధి మార్గాలుగా..
చిరు వ్యాపారులు మొదలుకొని, పెద్ద పెద్ద వ్యాపారులు సైతం సంతకు వస్తున్నారు. అడ్వాన్స్‌లు, అద్దెలు చెల్లించి పర్మినెంట్‌గా ఏర్పాటు చేసే దుకాణాల జోలికి వెళ్లకుండా జిల్లాలో ఎక్కడ సంత ఉంటే అక్కడ వ్యాపారాలు కొనసాగిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. అడ్వాన్స్ అద్దె వ్యాపార వాణిజ్య పన్నులు, విద్యుత్ బిల్లుల భారం లేకుండా కొద్ది మొత్తంలోనే వ్యాపారులకు పెట్టుబడి కలిసి వస్తున్నది. వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరలకు విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు.
పశు విక్రయాలు…
సంతలో పశువుల విక్రయాలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని సర్దార్‌నగర్‌లో నార్సింగి, శంకర్పల్లి, తాండూర్, పరిగి, వికారాబాద్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి జిల్లాల నుంచి పశువులను వాహనాల్లో ఇక్కడికి తీసుకొచ్చి విక్రయాలు నిర్వహిస్తుంటారు. దళారుల అవసరం లేకుండా నేరుగా రైతులు తమ పశువులను అమ్ముకోవడం, కొనుగోలు చేయడం చేస్తుంటారు.
వ్యవసాయ సామగ్రి కొనుగోలు చేస్తాం…
సర్దార్‌నగర్ సంతలో వ్యవసాయానికి సంబంధించిన అన్ని వస్తువులు దొరుకుతాయి. ఆవులు, గేదెలను అమ్మడం, కొనడం చేస్తుంటాం. వేరే జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పశువులను తీసుకొచ్చి అమ్ముతారు.
సంతకు మంచి ఆదరణ..
ఏండ్ల తరబడిగా కొనసాగుతున్న సర్దార్‌నగర్ సంతకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉన్నది. ప్రతి మంగళవారం జాతర తలపిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సూపర్‌మార్కెట్‌గా సంతలో అన్ని రకాల వస్తువులు దొరుకుతున్నాయి.