మొయినాబాద్, ఆగస్టు25: పెండ్లి, పుట్టిన రోజు, నూతన వస్ర్తధారణ ఇలా కార్యం ఏదైనా ఫంక్షన్ హాల్లోనే జరుపడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇంతకు ముందు శుభకార్యమంటే ఇంటి ఎదుట పచ్చని పందిరి వేసి భాజాభజంత్రీలతో పెండ్లిళ్లు చేసేవారు. ట్రెండ్ మారడంతో ఫంక్షన్ హాళ్లలో పెండ్లిళ్లు చేస్తున్నారు. గతంలో సాదాసీదా వివాహ వేడుకలు జరిపేవారు. కాని ప్రస్తుతం కొత్త పోకడలు అవలంబిస్తున్నారు. వారి స్థాయిని బట్టి పెండ్లిళ్లు, విందులు చేసేందుకు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న శుభకార్యాల్లో వేదికలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. అతిథులకు వడ్డించే ఆహార పదార్థాలపై ఎంత ఆసక్తి చూపుతున్నారో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఈ వేదికలకు ఇస్తున్నారు. సమాజంలో ఆధునిక పోకడలు ప్రవేశించడంతో ఒకప్పుడు ఉన్నత వర్గానికే పరిమితమైన వేడుకల సంస్కృతి మెల్లగా మధ్య తరగతిలోకి వ్యాపించింది. ఎవరి స్థాయికి తగ్గట్టు వారు వేడుకల్లో వేదికలు ఏర్పాటుచేసుకుంటున్నారు. దీంతో వేదికలను అలంకరించే వారు కూడా మదిని దోచుకునేలా సృజనాత్మకతతో డిజైన్లు రూపొందిస్తున్నారు. వేదికలు, స్వాగత తోరణాల ఏర్పాటు కూడా అబ్బురపరిచేలా అలంకరిస్తున్నారు.
శుభకార్యాలకు వచ్చే అతిథులను ఆకట్టుకునేలా వేదికలు అలంకరిస్తున్నారు. రకరకాల పూలు వాడి అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఒకప్పుడు వేదిక అలంకరణకు మామిడి ఆకులు, రంగురంగుల కాగితపు డిజైన్లు, ప్లాస్టిక్ పూలు వాడేవారు. ప్రస్తుతం వేదిక మొత్తం పూలతో నింపేస్తున్నారు. అధిక ఖర్చు అని భావించిన వారు పూల స్థానంలో వివిధ ఆకృతుల్లో బెలూన్లు వాడుతున్నారు.
ఒక్కో శుభకార్యానికి ఒక్కో రకమైన అలంకరణను అనుసరిస్తున్నారు. చిన్న పిల్లల పుట్టిన రోజు వేడుకల్లో యాంగ్రీబర్డ్, డాల్ఫిన్, మంకీ, టైగర్ ఇలా కార్టూన్ బొమ్మలతో వాటిని ఏర్పాటుచేస్తున్నారు. రాజకీయ, వ్యాపారవేత్తల శుభకార్యాలు సినిమా సెట్టింగ్‌లను తలపిస్తున్నాయి. ఒక్కో వేదికకు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
పెండ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు, పుట్టుపంచలు, సిల్వర్ జూబ్లీ, పదవీ స్వీకరణ, ఉద్యోగ విరమణ, ప్రారంభోత్సవాలు, షష్టిపూర్తి ఇలా ఎన్నో కార్యక్రమాలకు వేదికలు ఏర్పాటు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మారిన ట్రెండ్‌తో వేదికలను అలంకరించే వారికి ఉపాధి అవకాశాలు కూడా మెరుగయ్యాయి. ఏడాది పొడవునా పని లభిస్తున్నది. ఒక్కో కార్యానికి వేలాది రూపాయలను ఆర్జిస్తున్నారు.
ప్రతి కార్యానికి వేదిక వేస్తున్నారు. ఆర్థిక స్థోమత బట్టి వేదికలు వేయించుకుంటారు. రూ.4500ల నుంచి వేదికలు ఉంటాయి. పూలు, బెలూన్స్, ఆస్పర గ్రాస్ వంటి వాటితో వేదికలను అందంగా అలంకరించుకునేందుకు ఇష్టపడుతున్నారు. పెద్ద వేదికలు అయితే కనీసం నాలుగు రోజుల ముందు నుంచే సంబంధించిన మెటీరియల్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఏడాదికి 20 నుంచి 25 వేదికలు వేస్తాను.