ఎండనక.. వాననక రోడ్లపై సంతలు నిర్వహిస్తున్నవారికి త్వరలో మంచి రోజులు రానున్నాయి. అంగడి జరిగే గ్రామాల్లోనే నిర్దిష్ట స్థలంలో శాశ్వతంగా దుకాణాలు నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు అధికారులు రెండు నమూనాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. స్థలానికి అనుగుణంగా ఒక్కో గ్రామంలో రూ.15లక్షల వ్యయంతో 30 స్టాళ్లు లేదా రూ.12.25 లక్షలతో 15 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఉపాధిహామీ, గ్రామపంచాయతీల నిధులు వెచ్చించి వీటిని నిర్మించనున్నారు. గ్రామీణ అంగళ్ల తో క్రయవిక్రయదారుల సమస్యలు తీరనుండగా.. సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
పరిగి, సెప్టెంబర్ 24 : గతంలో మండలానికి ఒకటి చొప్పున వారాంతపు అంగడి కొనసాగేది. ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజ లు అంగడిలో కూరగాయలు కొనుగోలు చేస్తారు. ఇటీవలి కాలంలో ప్రతి మండలంలో కనీసం నాలుగైదు గ్రామాలలో వారంతపు అంగడి కొనసాగుతుంది. గ్రామాలలో ఎక్కడ అంగ డి కొనసాగుతున్నా రోడ్లపై కూర్చొని కూరగాయలు, ఇతర వస్తువులు విక్రయించేవారు కనిపిస్తారు. ఎండలకు, వర్షానికి ఇబ్బం ది పడుతూనే ఈ విక్రయాలు జరుగుతుంటాయి. అలాంటి అం గడి జరిగే గ్రామాలకు ఇదో శుభవార్త అని చెప్పవచ్చు. ఆయా గ్రామాలలో కొనసాగే అంగడి స్థాయి ఆధారంగా ప్రత్యేకంగా ఒకే దగ్గర దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ఇదో చక్కటి అవకాశం. సంబంధిత గ్రామపంచాయతీలు కొంత మొత్తంలో నిధులు ఖర్చు చేస్తే మిగతా నిధులు ఉపాధిహామీ ద్వారా అం దుతాయి. తద్వారా శాశ్వత ప్రాతిపదికన దుకాణాలు ఏర్పాటు చేయవచ్చు. వికారాబాద్ జిల్లా పరిధిలోని 18 మండలాల్లో 565 గ్రామపంచాయతీలు ఉండగా కనీసం 50 గ్రామాలలో వారాంతపు అంగడి కొనసాగుతుంది. ఇలాంటి గ్రామాలలో గ్రామీణ అంగళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది.
రెండు విధాలుగా గ్రామీణ అంగళ్లు…
ప్రభుత్వం రెండు విధాలుగా గ్రామీణ అంగళ్ల నిర్మాణానికి నిర్ణయించింది. అంగడి జరిగే ప్రాంతంలో 800 చదరపు గజాల భూమి ఉంటే 30 దుకాణాలు నిర్మాణం చేపట్టవచ్చు. ఇందుకు రూ.15 లక్షలు అంచనా వ్యయంతో నిర్మాణం చేయవచ్చు. రెండవది 20 దుకాణాల నిర్మాణానికి సంబంధించి రూ.12.25 లక్షలు అంచనా వ్యయంతో నిర్మాణ పనులు చేపడతారు. దీని నిర్మాణానికి 600 చదరపు గజాల స్థలం అవసరం. ఈ రెండింటిలో ఒక్కో కూరగాయల దుకాణం పొడవు 10 ఫీట్లు, వెడల్పు 6 ఫీట్లుగా ఉంటుంది. దీంతో పాటు అంగడి స్థలంలోనే ఒక కార్యాలయం, స్టోరేజ్ గది, మరుగుదొడ్డి నిర్మాణాలు చేపడతారు. మంచినీటి వసతి సైతం కల్పించడం జరుగుతుంది. ఈ రెండు స్లాబ్ వేసి నిర్మాణం చేపట్టగా, దుకాణాల పైకప్పు రేకులతో వేయడం జరుగుతుంది. చుట్టూ, మధ్యలో దుకాణాలతో పాటు వాటి మధ్య ఖాళీ స్థలం సైతం ఉంటుంది. తద్వారా వినియోగదారులు అన్ని దుకాణాలకు వెళ్లి కూరగాయల కొనుగోలు చేపట్టేలా నిర్మాణం ఉంటుంది.
నీడలో కూరగాయల విక్రయాలు…
గ్రామీణ అంగళ్ల నిర్మాణంతో చక్కటి సదుపాయాలతో కూడిన స్థలంలో, నీడలో కూరగాయల విక్రయాలు చేపట్టవచ్చు. వారాంతపు జరిగే అంగడి సందర్భంగా ఆయా దుకాణాల్లో కూరగాయల విక్రయాలు చేపట్టవచ్చు. శాశ్వత ప్రాతిపదికన చేపట్టే నిర్మాణాలతో ఎండలకు, వర్షాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంగడి కొనసాగడానికి అవకాశం ఏర్పడుతుంది. వారాంతపు అంగడిని రోజువారిగా ఇక్కడే నిర్వహించినా ఆయా గ్రామాలలో రోజు వినియోగదారులకు కూరగాయలు అందుబాటులో ఉంటాయి. కూరగాయలు విక్రయించే రైతులే నేరుగా ఈ అంగళ్లలోని దుకాణాలలో తమ కూరగాయలు విక్రయించేందుకు అవకాశంగా చెప్పవచ్చు. నడిరోడ్డుపై కూరగాయల అంగడితో ఓవైపు ఎండ, వర్షాలకు ఇబ్బంది. మరోవైపు రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడతాయి. గ్రామీణ అంగళ్లతో ఎలాం టి ఇబ్బందులు లేకుండానే కూరగాయలు, ఇతర వస్తువుల విక్రయాలు చేపట్టవచ్చు. ప్రతి గ్రామపంచాయతీకి ఒక గ్రామీణ అంగడి ఇవ్వడానికి సైతం గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధంగా ఉన్నది.
గ్రామీణ అంగడి నిర్మించుకోవాలి
గ్రామీణ అంగడిని నిర్మించుకోవడం ద్వారా సదుపాయలతో కూడిన అంగడిలో కూరగాయల విక్రయాలు చేపట్టవచ్చు. రెండు నమూనాలుగా గ్రామీణ అంగడి నిర్మాణాలు చేపట్టవచ్చు. రూ.15లక్షలతో 30 దుకాణాలు, రూ.12.25 లక్షలతో 20 దుకాణాల అంగడి నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇందులో ఉపాధిహామీ ద్వారా సైతం నిధులు అందుతాయి. గ్రామపంచాయతీ మిగతా నిధులు కేటాయిస్తే గ్రామాలలో చక్కగా గ్రామీణ అంగడి నిర్మాణం చేపట్టవచ్చు. తద్వారా కూరగాయల విక్రేతలకు, కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంగడి కొనసాగుతుంది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక అంగడి మంజూరుకు సైతం అవకాశం ఉన్నది.
కృష్ణన్, డీఆర్డీవో