తుర్కయాంజాల్, ఆగస్టు 14: తుర్కయాంజాల్ మాసాబ్ చెరువు సుందరీకరణ పనులు పూర్తి కావచ్చా యి. కొత్తందాలతో చెరువు పరిసరాలు ఆహ్లాదకరంగా మారాయి. చెరువు కట్టను పచ్చదనం, పూల మొక్కలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిదద్దడంతో వాకర్లు, ప్రజలు చెరువు అందాలను ఆస్వాదించేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరినీ ఆకట్టుకునేలా చెరువు కట్టను అధికారులు అత్యంత సుందరంగా అభివృద్ధి చేశారు. మిషన్ కాకతీయలో భాగంగా రూ.90 లక్షలతో చెరువులో పూడికతీత, చెరువు కట్ట పటిష్టం, ఫీడర్ ఛానళ్ల మరమ్మతులను అధికారులు చేపట్టారు. దీంతో ప్రస్తుతం చెరువు వర్షపు నీటితో నిండి జలకళను సంతరించుకున్న ది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాసాబ్ చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దుతానని ఇచ్చిన హామీ నెరవేరడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సుమారు 350 ఎకరాల్లో ఉన్న మాసాబ్ చెరువు ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలతో పూర్తిగా నిండి దశాబ్ధాల తరువాత జలకళతో కొత్తశోభను సంతరించుకున్నది. చెరువు కట్టను పూర్తి స్థాయిలో అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. హెచ్ఎండీఏ అర్బన్ లేక్స్ ఆధ్వర్యంలో రూ.1.32 కోట్లతో చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్, పచ్చదనం, పూల మొక్కలు, నీటి సౌకర్యం, మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టారు. సుమారు కిలోమీటర్ మేర ఉన్న చెరువు కట్ట పొడువునా వంకలు తిరుగుతూ వాకింగ్ ట్రాక్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. దీనికి తోడు కట్టపై అక్కడక్కడ సందర్శకులు కూర్చునేలా బెంచీలు ఏర్పాటు చేశారు. అలాగే అర్బన్ ఫారెస్టు సహకారంతో కట్టపై రకరకాల పూల మొక్కలతో సుందరీకరించారు. కట్టపై గ్రీనరీని ఏర్పాటు చేయడంతో పాటు కట్టపై రెండు వైపులా ఇనుప రేలింగ్‌ను కూడా బిగించారు. జీహెచ్ఎంసీ సౌజన్యంతో ప్రజల సౌకర్యార్థం దశల వారీగా లైటింగ్ సిస్టమ్, తాగునీటి వసతిని అధికారులు కల్పించనున్నారు. చెరువు కట్టపై ఏర్పాటు చేస్తున్న అభివృద్ధి పనులతో మాసాబ్ చెరువు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. సందర్శకులను ఆకట్టుకునేలా అధికారులు చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సందర్శకుల సౌకర్యార్థం చెరువులో బోటింగ్‌ను కూడా ఏర్పాటు చేసే యోచనలో అధికారులు ఉన్నారు.
తుర్కయాంజాల్ మాసాబ్ చెరువును దశల వారీగా మినీ ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దుతున్నాం. మిషన్ కాకతీయలో భాగంగా రూ.90 లక్షలతో కొంత మేర చెరువులో అభివృద్ధి పనులు చేపట్టాం. రూ.1.32 కోట్లతో జరుగుతున్న చెరువు కట్ట సుందరీకరణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. చెరువు కట్టపై ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేలా పచ్చదనం, పూల మొక్కలతో చెరువు కట్టను అందంగా తీర్చిదిద్దుతున్నాం.