ఇబ్రహీంపట్నం, ఆగస్టు 9: నగరశివారులోని ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల అభివృద్ధికి హెచ్ఎండీఏ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. శివారు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల అభివృద్ధిపై హెచ్ఎండీఏ దృష్టి సారించింది. ముఖ్యంగా ఓఆర్ఆర్తో పాటు సాగర్, శ్రీశైలం, విజయవాడ రహదారుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఓఆర్ఆర్ పరిధిలోని పలు జంక్షన్లు పర్యాటకులను ఆకర్శించేలా ముస్తాబు చేస్తున్నారు. అందులో భాగంగానే ఓఆర్ఆర్ బొంగ్లూరు జంక్షన్‌లోని పలు కూడళ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. బొంగ్లూరు సమీపంలో ఓఆర్ఆర్ జంక్షన్లు రెండు ఉన్నాయి. ఓఆర్ఆర్ పరిధిలోని ఇవే అతి పెద్ద జంక్షన్లు. ఈ జంక్షన్లలో ఆకర్షణీయమైన రంగురంగుల చెట్లు నాటడంతో పాటు రహదారి వెంట ప్రయణించేవారిని ఆకర్శించేలా బుద్ధుడు, ఇతరత్రా విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సాగర్ రహదారి అభివృద్ధి దిశలో ముందుకు సాగుతున్నది. ఇప్పటికే ఓఆర్ఆర్కు అనుబంధంగా ఉన్న సాగర్ రహదారి ఇంజాపూర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు విస్తరణ పనులు పూర్తయ్యాయి. రహదారి మధ్యలో డివైడర్‌పై అందమైన పూల మొక్కలు పెంచుతున్నారు. మన్నెగూడ, తుర్కయంజాల్, ఇంజాపూర్ తదితర గ్రామాల్లో సాగర్ రహదారిపై సెంట్రల్ లైటిం గ్ సిస్టంతో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. దీంతో రాత్రి సమయంలో విద్యుత్ కాలంతులతో రహదారి జిగేల్‌మంటోంది.
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాలను ల్యాండ్ పుల్లింగ్ ద్వారా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉన్న భూములను హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో తీసుకుని వాటిలో భారీ భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారులు రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ల్యాండ్ పుల్లింగ్ ద్వారా ఈ ప్రాంత అభివృద్ధితో పాటు రైతులకు కలిగే ప్రయోజనాలపై ప్రత్యేకంగా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ల్యాండ్ పుల్లింగ్ ద్వారా భూములివ్వడానికి ముందుకొచ్చే రైతుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. రైతులు ముందుకొచ్చి ఓఆర్ఆర్కు ఇరువైపులా భూములు ఇవ్వడానికి సిద్ధమైనట్లు, వెంటనే వారి భూములను హెచ్ఎండీఏ పేరిట రిజిస్ట్రేషన్ చేయించనున్నారు. ఈ భూముల్లో జరిగే అభివృద్ధిలో రైతులకు 40 శాతం వాటా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ఎండీఏ నిర్ణయంతో కొంతమంది రైతులు ముందుకొస్తున్నారు. మరికొందరికి అవగాహన కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నగర శివారులోని ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అర్బన్ ఫారెస్టు అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అర్బన్ ఫారెస్టు భూములు పర్యాటకులను ఆకర్శించేలా తయారుచేసే మాస్టర్ ప్లాన్ రూపొందించారు. అందులో భాగంగానే అర్బన్ ఫారెస్టు భూముల్లో వాకర్ పార్కులు, చిన్నపిల్లలను ఆకర్శించేలా ఆటస్థలాలను తయారుచేస్తున్నారు. ఇప్పటికే గుర్రంగూడ పరిధిలోని అటవీ ప్రాంతాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. త్వరలోనే మన్నెగూడ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న అటవీ భూమిలో వాకర్పార్కు, క్రీడా మైదానం, పర్యాటకులను ఆకర్శించేలా పలు కార్యక్రమాలు చేపట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.