
ఒకప్పుడు సమస్యలతో సతమతం
నేడు అభివృద్ధిలో ఆదర్శం
ప్రతి వీధి సీసీ రోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు, ఎల్ఈడీ లైట్లు
సకల సౌకర్యాలతో వైకుంఠధామం
పక్కాగా పారిశుధ్య నిర్వహణ
డంపింగ్ యార్డులో సేంద్రియ ఎరువు తయారీ
ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం
హరితహారంతో పల్లెంతా పచ్చదనం
‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామ రూపురేఖలు
యాచారం, సెప్టెంబర్ 8 : పల్లె ప్రగతి కార్యక్రమం ఆ ఊరి ముఖ చిత్రాన్నే మార్చేసింది. ఒకప్పుడు ఆ ఊరు అనేక సమస్యలతో సతమతమవ్వగా, ప్రస్తుతం సమస్యలు లేకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది. గ్రామంలో ఆహ్లాదాన్నిచ్చే మొక్కలు, నర్సరీలో మొక్కల పెంపకం, పచ్చదనాన్ని పెంపొందించడం కోసం చిట్టడవిని తలపిస్తున్న పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, తడి,పొడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేయడానికి కంపోస్టుయార్డు షెడ్, ఇంటింటికీ స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీరు, ఎల్ఈడీ బల్బులు, భూగర్భ డ్రైనేజీ, వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, తడి,పొడి చెత్త సేకరణ కోసం పంచాయతీ ట్రాక్టర్, మొక్కలకు నీరందించేందుకు పంచాయతీ నీటి ట్యాంకర్‌తో పాటు డ్రోజర్‌ను సమకూర్చుకున్నారు. సకల సౌకర్యాలతో ఆ పంచాయతీ ప్రగతి బాటన పయనిస్తున్నది.
పల్లెప్రగతితో సమస్యల పరిష్కారం
గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో అభివృద్ధి, మౌలిక వసతుల్లో ముందుకు సాగుతున్నది. గ్రామంలో 646కుటుంబాలు ఉన్నాయి. గ్రామంలో రోడ్డు పక్కనే ఉన్న 2పాడుబడ్డ బావులు పూడ్చగా, శిథిలావస్థకు చేరిన 72 ఇండ్లను కూల్చివేశారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్తకుప్పలు, కలుపు మొక్కలు తొలగించి రోడ్లను శుభ్రంగా మార్చారు.
స్వచ్ఛమైన తాగునీరు సరఫరా
మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామంలో ఇంటింటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరును సరఫరా చేస్తున్నారు. గ్రామంలో 1,20,000లీటర్లు, 40,000లీటర్ల సామర్థ్యం కలిగిన 2 ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకులున్నాయి. 600నల్లాల ద్వారా ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామంలో ఒకప్పుడు ఫ్లోరైడ్ నీటిని తాగుతూ గ్రామస్తులు అనేక వ్యాధుల బారిన పడేవారు. ప్రజలు ప్రస్తుతం స్వచ్ఛమైన తాగునీరుతో అలాంటి సమస్యలకు శాశ్వతంగా దూరమయ్యారు.
ప్రకృతివనంలో 30 రకాల మొక్కలు
గ్రామంలో 2ఎకరాల విస్తీర్ణంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. కొత్తపల్లి, కొత్తపల్లితండాలకు సంబంధించి మొత్తం 5,000ల మొక్కలను పెంచుతున్నారు. ఉపాధి పనిదినాలతో ఆహ్లాదాన్ని పంచే పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. కొత్తపల్లి పల్లె ప్రకృతి వనంలో 34రకాలతో కూడిన వివిధ రకాల పండ్లు, పూలు, ఔషధ, డిజైన్ ఇతర మొక్కలు నాటారు. కొత్తపల్లి తండా పల్లె ప్రకృతివనంలో 30రకాల మొక్కలను నాటారు. వాటి సంరక్షణ కోసం నిత్యం పంచాయతీ ట్యాంకర్‌తో నీరుపోసి రక్షిస్తున్నారు. పల్లె ప్రకృతి వనం ద్వారా ఒకే చోట పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, వర్షాభావాన్ని పెంపొందించేందుకు చిట్టడవిని తలపించేలా మొక్కలను ముమ్మరంగా పెంచుతున్నారు.
రోడ్డుకు ఇరువైపులా..
పచ్చదనాన్ని పెంపొందించేందుకు గ్రామంలో మొత్తం 1000 మొక్కలను విరివిగా హరితహారం కార్యక్రమం ద్వారా నాటారు. రోడ్లకు ఇరువైపులా నాటి సంరక్షిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన వీధుల్లో మొక్కలు నాటారు. ఆహ్లాదాన్ని పంచే వివిధ రకాల పూల మొక్కలకు ట్రీగార్డులను ఏర్పాటు చేసి పెంచుతున్నారు.
నర్సరీల్లో మూడు వేలు..
నర్సరీలో మొక్కలు పెంచేందుకు ప్రత్యేక నర్సరినీ ఏర్పాటు చేశారు. నర్సరీలో అనేక రకాల మొక్కలు పెంచుతున్నారు. తీరొక్క పూలు, పండ్లు, ఔషధ, డిజైన్ మొక్కల నారును నర్సరీ ద్వారా పెంచుతున్నారు. నర్సరీలో 3,000ల మొక్కలు పెంచుతున్నారు.
రూ.9.5లక్షలతో వైకుంఠధామం
దహన సంస్కారాలు చేసేందుకు వైకుంఠధామాన్ని రూ.9.5లక్షలతో నిర్మించారు. రెండు శ్మశాన వాటికలు, స్నానాల గదులు, బట్టలు మార్చుకునే గది, మరుగుదొడ్లు, తదితర వసతులను ఏర్పాటు చేశారు.
రూ.10లక్షలతో పంచాయతీ ట్రాక్టర్..
రూ.10లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, డోజర్లను కొనుగోలు చేశారు. చెత్తరహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి రూ.2.5లక్షలతో డంపింగ్‌యార్డును నిర్మించారు. టాక్టర్ ద్వారా సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు. సేంద్రియ ఎరువును నర్సరీ, పల్లెప్రకృతి వనంలో పెంచుతున్న మొక్కల ఎదుగుదలకు వేసేందుకు సిద్ధం చేస్తున్నారు. దీంతో రోడ్లపైన, జనావాసాల మధ్య చెత్తాచెదారం లేకుండా ఉండటంతో పాటుగా ప్లాస్టిక్ నిర్మూలన పూర్తిగా సాధ్యమైంది.
గ్రామాభివృద్ధికి కృషి
గ్రామాభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తా. గ్రామంలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించాం. ప్రభుత్వ సహకారం, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రోత్సాహంతో గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు నిరంతరం పాటుపడుతా. గ్రామాభివృద్ధే ప్రధాన ధ్యేయం.
పల్లె ప్రగతితో రూపురేఖలు మారాయి
పల్లె ప్రగతి ద్వారా గ్రామం రూపురేఖలు మారిపోయాయి. సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారుల సమష్టి కృషితోనే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. పల్లె ప్రగతి పనులతో గ్రామంలో మునుపెన్నడూ లేని విధంగా సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇతర సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించేందుకు అన్ని విధాలుగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలి.