ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్టు 8 : విజయవాడా జాతీయ రహదారికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న నెర్రపల్లి గ్రామం గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధిలో వెనుకబాటుకు గురైంది. తెలంగాణ ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతితో గ్రామం అభివృద్ధిలో ఉరకలు వేస్తున్నది. గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపాలన్న తపన.. ప్రభుత్వ సహకారం.. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరువతో సర్పంచ్ భాస్కర్‌గౌడ్ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.. రెండేళ్ల కాలంలో గ్రామంలో సీసీరోడ్లు, భూగర్భ డ్రైనేజీలు, హరితహారం, కమ్యూనిటీ భవనాలు, వైకుంఠధామం, వర్మీ కంపోస్టుయార్డుల నిర్మాణం పూర్తిచేశారు. ప్రతిరోజు వీధులను శుభ్రం చేయడం, కలపు మొక్కలను తొలగించే పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. గ్రామంలో ఏ వీధిలో చూసినా సీసీరోడ్లు కనిపిస్తుంటాయి. పంచాయతీ సిబ్బంది గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతున్నారని గ్రామస్తులు, పాలకవర్గం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో తెల్లవారక ముందే పంచాయతీ సిబ్బంది రోడ్లను శుభ్రం చేస్తున్నారు. ట్రాక్టర్ ద్వారా ఇంటింటికీ తిరిగి చెత్తసేకరించి కంపోస్టుయార్డుకు తరలించి ఎరువు తయారు చేస్తున్నారు. హరితహారం, పల్లె ప్రకృతి వనం, ఖాళీ స్థలా ల్లో నాటిన మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీటిని అందజేసి కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి పారిశుధ్య గ్రామంగా చేస్తున్నారు.
గ్రామంలో డ్రైనేజీలు పూర్తిగా నిర్మించడమే లక్ష్యంగా పాలకవర్గం డ్రైనేజీల నిర్మాణం పనులను పూర్తిచేశారు. దీంతో ప్రజలకు దోమలు, ఈగలు, పందుల బెడద నుంచి విముక్తి కలిగింది.
గత పాలకుల హయాంలో వెనుకబాటుకు గురైన గ్రామాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వ సహకారం, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చొరువతో గ్రామానికి నిధులు తీసుకువచ్చి సీసీరోడ్లు, డ్రైనేజీలు, ఇంటింటికీ తాగునీరు పాటు అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నాం. హరితహారం, పల్లె ప్రకృతి వనంలో భారీగా మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. గ్రామం విస్తీర్ణంలో చిన్నదిగా ఉన్నప్పటికీ అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.
-నిమ్మల భాస్కర్‌గౌడ్, సర్పంచ్ నెర్రపల్లి