పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేస్తున్నది. రంగారెడ్డి జిల్లాకు 6,777 ఇండ్లు మంజూరు కాగా, 2,600 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఇందులో అత్యధికంగా షాద్‌నగర్ నియోజకవర్గంలో 1,880 ఇండ్లు పూర్తై పట్టాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన ఇండ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో సాగుతున్నాయి. పూర్తైన ‘డబుల్’ ఇండ్లకు మౌలిక వసతులను సమకూర్చేందుకు రూ.26 కోట్లు అవసరమని సంబంధిత అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఈ నెలాఖరు నుంచి విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు వంటి పనులను ప్రారంభించి, రెండు నెలల్లో పూర్తయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లోని ‘డబుల్’ ఇండ్లలో మౌలిక సదుపాయాల పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. మీ-సేవతోపాటు నేరుగా కలెక్టరేట్లోని హౌసింగ్ కార్యాలయానికి ఇప్పటి వరకు 2 లక్షలకుపైగా దరఖాస్తులు రాగా, లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లను కేటాయించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
రంగారెడ్డి, ఆగస్టు 8, (నమస్తే తెలంగాణ): గూడులేని పేద ప్రజల సొం తింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిం ది. జిల్లాలో ఇప్పటికే పూర్తైన డబుల్ బెడ్రూం ఇండ్లకు మౌలిక వసతులను కల్పించేందుకుగాను ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటివరకు జిల్లా వ్యా ప్తంగా 2600 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తికాగా, సంబంధిత ఇండ్లకు విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు వంటివి వీలైనంతా త్వరగా కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకు రూ.26 కోట్లు అవ సరమని అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. కాగా ఈ నెలాఖరు నుంచి పనులు ప్రారంభించేందుకు జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండు నెలల్లో మౌలిక వసతుల పనులు పూర్తి చేసి అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధి లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు దాదాపు పూర్తికాగా, జిల్లాకు సంబంధించి 16,630 ఇండ్లు ఉన్నా యి. జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాకు సంబంధించిన చేవెళ్ల, ఇబ్రహీం పట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లోని ప్రాంతాల్లో మౌలిక వసతుల పను లు దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే అర్హులైన లబ్ధి దారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించనున్నారు. లబ్ధిదారుల ఎంపికలోనూ, ఇండ్ల కేటాయింపులోనూ లాటరీ పద్ధతిలోనే ఎంపిక చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వచ్చిన దరఖాస్తులను బట్టి నేరుగా లబ్ధి దారులకు కేటా యించడమా, లాటరీ పద్ధతిలో కేటాయించడమనేది నిర్ణ యించనున్నారు. నిర్మాణం పూర్తైన డబుల్ బెడ్రూం ఇండ్లకు తగినట్లుగానే దరఖాస్తులు వచ్చి నట్లయితే దరఖాస్తు చేసుకున్న వారంతా అర్హులైనట్లయితే వారికి ఇండ్లను కేటాయించనున్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు అధిక మొత్తం లో దరఖాస్తులు అందాయి. మీసేవతోపాటు నేరుగా కలెక్టరేట్లోని హౌసింగ్ కార్యాలయంలో రెండు లక్షలకుపైగా దరఖాస్తు చేసుకున్నారు. మండలాల వారీగా దరఖాస్తులను తీసి ఆయా మండలాల్లో ఇండ్ల నిర్మాణం పూర్తైన అనంతరం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేయనున్నారు. అంతేకాకుండా ఆయా మండలాల్లో ఇండ్ల నిర్మాణం పూర్తైన అనంతరం మరోసారి దరఖాస్తులను ఆహ్వానించే ఆలోచనలో కూడా ఉన్నారు. దర ఖాస్తు ప్రక్రియ పూర్తైన అనంతరం ప్రభుత్వం ఆధార్ కార్డుల వివరాలతో దరఖాస్తుదారులకు ఇంతకు ముందు ఇల్లు మంజూరైందా, కారు ఉందా, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబమేనా తదితర వివరాలను సేకరించి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తుదారులు తప్పని సరిగా తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి. ఆయా నియోజకవర్గాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో స్థానికులతోపాటు స్థానికేతరులకు నిర్దేశించిన కోటా ప్రకారం కేటాయించనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, మైనార్టీ లకు 7 శాతం, ఇతరులకు 43 శాతం లెక్కన ఇండ్లను కేటాయించనున్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఈనెల 6వ తేదీ వరకు వచ్చిన దర ఖాస్తుల్లో చేవెళ్ల నియోజకవర్గంలో 7775 , కల్వకుర్తిలో 3036, ఇబ్రహీం పట్నంలో 10,822, మహేశ్వరంలో 11, 075, రాజేంద్రనగర్ లో 58, 724 , షాద్‌నగర్‌లో 3533 , శేరి లింగంపల్లి లో 50,002 , ఎల్బీ నగర్లో 62,743 ఉన్నాయి.
జిల్లాలో వ్యక్తిగత ఇండ్లతోపాటు జి ప్లస్2, జి-ప్లస్3గా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం జరుగుతుంది. జిల్లాకు మంజూరైన ఇండ్లలో 45 శాతం మేర పూర్తయ్యాయి. జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేవెళ్ల, ఇబ్ర హీంపట్నం, కల్వకుర్తి, షాద్‌నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియో జక వర్గాల్లో కొనసాగుతున్నది. జిల్లావ్యాప్తంగా 2600 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తికాగా, ఇప్పటివరకు పూర్తైన ఇండ్లలో అత్యధికంగా షాద్‌నగర్ నియోజకవర్గంలోనే ఉన్నవి. జిల్లావ్యాప్తంగా పూర్తైన ఇండ్లలో 1880 ఇండ్లు షాద్‌నగర్ నియోజకవర్గానికి సంబంధించినవి. అదేవిధంగా జిల్లాకు 6777 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా,…చేవెళ్ల నియోజకవర్గానికి 1060 ఇండ్లు, కల్వకుర్తికి 738, ఇబ్రహీంపట్నంకు 1239 , షాద్‌నగర్ కు 3100, రాజేంద్రనగర్‌కు 240, మహేశ్వరం నియోజకవర్గానికి 400 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరయ్యాయి.
అయితే 6383 ఇండ్లకు సంబంధించి ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికిగాను అయ్యే ఖర్చును గ్రామీణ ప్రాం తాల్లో యూనిట్ ఖర్చు రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. యూనిట్ కాస్ట్‌తో పాటు మౌలిక వసతుల నిమిత్తం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.25 లక్షలను, అర్బన్ ప్రాంతంలో రూ.75 వేలను ప్రభుత్వం అందజేస్తున్నది.
జిల్లాలో పూర్తి అయిన డబుల్ బెడ్రూం ఇండ్లకు రెండు నెలల్లో మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే నిధుల అంచనా వేశాం. త్వరితగతిన తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ పనులు పూర్తి చేసి అర్హులైన పేదలకు ఇండ్లను కేటాయిస్తాం. మీ సేవ ద్వారా డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
-రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి