హరితహారం కార్యక్రమం పల్లెలకు వరంగా మారింది. ప్రతి పల్లెలో నర్సరీలను ఏర్పాటు చేసి విరివిగా మొక్కలు నాటడంతో పల్లెలన్నీ హరితశోభితమయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోని 558 గ్రామపంచాయతీలతోపాటు 307 అనుబంధ గ్రామాలు, వికారాబాద్ జిల్లాలోని 566 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలను నాటడంతో పాటు వాకింగ్ ట్రాక్‌లు, బెంచీలు, చిన్నారుల ఆటవస్తులను ఏర్పాటు చేశారు. ఏడాది కింద మొక్కలు నాటడంతో ఏపుగా పెరిగి నేడు చిట్టడవులను తలపిస్తున్నాయి. ఒకప్పుడు పట్టణాల్లోనే పార్కులు కనిపించేవి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించాలని సంకల్పించింది. ఇంతటి అద్భుతమైన హరితహారం కార్యక్రమం నిధుల కొరతతో నిలిచిపోవద్దన్న సదుద్దేశంతో ‘హరితనిధి’ పేరుతో బడ్జెట్ సమకూర్చాలన్న సీఎం కేసీఆర్ సంకల్పానికి జనం నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
రంగారెడ్డి, అక్టోబర్ 5, (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రకృతి వనాలతో పల్ల్లెల్లో పచ్చనిశోభ సంతరించుకున్నది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకుగాను ప్రభుత్వం పల్లెప్రకృతివనాలను ఏర్పాటు చేసింది. ప్రతి పల్లె పచ్చని వనంలా మారిపోయింది. గ్రామాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణం అందుతున్నది. పల్లెప్రకృతివనాల్లో వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేశారు.
ఎకరా స్థలంలో 4 వేల మొక్కల పెంపకం
జిల్లాలో 865 పల్లెప్రకృతివనాలను ఏర్పాటు చేశారు. వీటిలో 558 గ్రామ పంచాయతీలతోపాటు 307 అనుబంధ గ్రామాల్లో కూడా పల్లెప్రకృతివనాలను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో ఒక్క ఎకరా స్థలంలో 4 వేల మొక్కలతో చిట్టడవులను ఏర్పాటు చేశారు. మొక్కలు, వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటుకుగాను ప్రభుత్వం రూ.9 లక్షలను ఖర్చు చేసింది. ఈ వనాల్లో పొడువు జాతి, చిన్న జాతి మొక్కలతోపాటు ఔషధ మొక్కలను నాటారు. వేప, నెరపి, గంధం, టేకు, పొంగామియా, కుంకుడు, ఉసిరి, మారేడు, చింత, పనస, అండుగ, సీమచింత, మెహందీ, సీతాఫల్, జామ, దానిమ్మ, కరివేప, నిమ్మ, తాటిచెట్టు, మల్బరీ, వెదురు, జమ్మి, వావిల్లి మొక్కలను నాటారు. వాకింగ్ ట్రాక్‌కు చుట్టూ తంగేడు, అద్దసారం, పారిజాతం, తిప్పతీగ, పొడపత్రి, గుగ్గల్, పెద్ద నిమ్మ మొక్కలను నాటారు. ప్రతీ గ్రామ పంచాయతీకి కేటాయించిన 10 శాతం గ్రీన్ బడ్జెట్ నుంచి ప్రకృతి వనాలకు ఖర్చు చేశారు.
మండలానికి ఒక బృహత్‌వనం..
మండలానికి ఒక బృహత్ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఐదు నుంచి పది ఎకరాల్లో బృహత్ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 20-30 వేల మొక్కలను నాటుతున్నారు. నీడనిచ్చే మొక్కలతోపాటు పూలు, పండ్ల, ఔషధ మొక్కలను నాటుతున్నారు. జిల్లాలోని గ్రామీణ మండలాలైన 21 మండలాల్లో బృహత్ పల్లెప్రకృతి వనాల ఏర్పాటుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. వీటిలో ఇప్పటికే మోడల్‌గా ఏర్పాటు చేసిన నందిగామ మండలంతోపాటు చేవెళ్ల, శంషాబాద్, యాచారం, కేశంపేట మండలాల్లో బృహత్ పల్లెప్రకృతి వనాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యింది.
ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పుడమి మురిసేలా.. పల్లెలు పచ్చని వనాలుగా మార్చేలా ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఈ వనాల్లో పండ్లు, పూలు, వివిధ రకాల మొక్కలను నాటారు. వీటిలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చందాలతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో పల్లెలు పచ్చనిశోభ సంతరించుకున్నాయి. ప్రతినిత్యం మొక్కలకు పంచాయతీ ప్రజాప్రతినిధులు, సిబ్బంది ఎరువు, నీటిని అందిస్తూ సంరక్షిస్తుండడంతో చిట్టడవిలా పల్లె ప్రకృతి వనాలు మారాయి.
పరిగి, అక్టోబర్ 5 : పల్లెల్లో పచ్చదనాన్ని పెంపొందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామపంచాయతీలో పల్లె ప్రకృతివనాల ఏర్పాటుతో పల్లెల్లో పచ్చందాలు పరుచుకున్నాయి. వికారాబాద్ జిల్లా పరిధిలోని ప్రతి గ్రామపంచాయతీలో పల్లె ప్రకృతివనాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 566 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గ్రామగ్రామాన పల్లె ప్రకృతివనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఎకరాకు 2వేల మొక్కలు.. గ్రీన్ బడ్జెట్
పల్లె ప్రకృతివనాల్లో అందుబాటులో ఉన్న స్థలాల ఆధారంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఎకరాకు కనీసం 2వేల మొక్కలు నాటారు. గ్రామపంచాయతీల నుంచి గ్రీన్ బడ్జెట్ కింద 10శాతం నిధులు ఖర్చు చేస్తున్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా సర్కారు చర్యలు చేపట్టింది. ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్ కొనుగోలు చేసి వీటి ద్వారా మొక్కలకు నీరు పోస్తుండడంతో ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
గ్రామాల్లో పచ్చని వాతావరణం
పల్లెప్రకృతివనాలతో ప్రతి గ్రామ పంచాయతీలో చాలా మార్పు వచ్చింది. జిల్లాలోని పల్లెప్రకృతివనాలతోపాటు గ్రామాల్లో అంతటా మొక్కలు నాటడంతో హరితశోభితంగా మారింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి వాతావరణాన్ని అందించగలుగుతున్నాం. ఏడాదిలోగా పల్లెప్రకృతివనాల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి వనంలా దర్శనమిస్తున్నాయి. జిల్లాలోని ఏ గ్రామానికి వెళ్లినా పచ్చని వాతావరణం నెలకొన్నది.
ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది
మా గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతివనంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. గతంలో ఉన్న ఏ ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మొక్కల పెంపకంపై ఆలోచన చేయలేదు. పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లో వివిధ రకాల పనులతో పాటు ప్రభుత్వ భూమిలో పల్లెప్రకృతివనాలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచడం గొప్ప నిర్ణయం. ఏపుగా పెరిగిన మొక్కలతో ఆహ్లాదాన్ని పొందుతున్నాం.
అన్ని రకాల మొక్కలు పెంచుతున్నారు
ప్రభుత్వం గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా పల్లెప్రకృతివనాలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచడం సంతోషకరం. అందులో 20రకాల వరకు మొక్కలు పెంచుతున్నారు. నీడనిచ్చే మొక్కలతో పాటు పండ్ల మొక్కలు సైతం పెంచడంతో ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మంచి వాతావరణం లభిస్తున్నది.