భారీ వర్షం.. పొంగిపొర్లిన వాగులు
అత్యధికంగా హయత్నగర్ మండలంలో 53.2 మి.మీటర్ల వర్షపాతం
ఉధృతంగా ప్రవహిస్తున్న జిల్లాలోని ఈసీ, మూసీ వాగులు
అలుగుపారుతున్న చెరువులు, కుంటలు
సాధారణానికి మించి వర్షపాతం నమోదు
భారీ వర్షంతో జిల్లా తడిసి ముద్దయింది. ముఖ్యంగా అర్బన్ మండలాల్లో గురువారం రాత్రి దాదాపు మూడు గంటలపాటు వాన దంచికొట్టింది. దీంతో జిల్లాలోని మూసీ, ఈసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండగా.. చెరువులు అలుగు పారుతున్నాయి. వాగులు, కాలువలు పొంగిపొర్లాయి. అత్యధికంగా హయత్నగర్ మండలంలో 53.2 మి.మీటర్ల వర్షపాతం నమోదుకాగా.. అత్యల్పంగా శంకర్పల్లి మండలంలో 1.5 మి.మీటర్లు నమోదైంది. జిల్లాలో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఇప్పటివరకు 506.6 మి.మీ వర్షం కురువాల్సి ఉండగా.. 574.9 మి.మీటర్లు కురిసింది.
రంగారెడ్డి, సెప్టెంబర్ 3, (నమస్తే తెలంగాణ): జిల్లాలో వర్షం దంచికొట్టింది. జిల్లాలోని అర్బన్ మండలాల్లో గురువారం రాత్రి దాదాపు మూడు గంటలపాటు నిరంతరాయంగా వర్షం కురిసింది. జిల్లాతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో ప్రధానమైన మూసీ, ఈసీ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా జిల్లాలోని మెజార్టీ చెరువులు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా అలుగుపారుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు సాధారణ వర్షపాతానికి మించి వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఈ వానకాలం ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 506.6 మి.మీటర్ల వర్షపాతం, ఇప్పటివరకు 574.9 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది వానకాలం జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో సాధారణ వర్షపాతానికి మించి దాదాపు 70 మి.మీటర్ల వర్షపాతం అధికంగా కురిసింది. జూన్లో సాధారణ వర్షపాతం 91.3 మి.మీటర్లు కాగా, 90.3 మి.మీటర్లు, జూలై మాసంలో సాధారణ వర్షపాతం 153కాగా, 315.8 మి.మీటర్ల వర్షపాతం, ఆగస్టులో సాధారణ వర్షపాతం 140.9 కాగా, 147.9 మి.మీటర్ల వర్షపాతం, సెప్టెంబర్లో సాధారణ వర్షపాతం 121కాగా, ఇప్పటివరకు 20.9 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.
హయత్నగర్లో అత్యధిక వర్షపాతం
జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు జిల్లావ్యాప్తంగా వర్షం కురిసింది. జిల్లాలోని హయత్నగర్ మండలంలో అత్యధిక వర్షపాతం 53.2 మి.మీటర్ల నమోదైంది. అబ్దుల్లాపూర్మెట్ 31, కొత్తూరు 5.7, నందిగామ 6, ఫారూఖ్నగర్ 5.9, చౌదరిగూడ 27, కొందుర్గులో 48.3, షాబాద్ 5.8, చేవెళ్ల 3.6, మొయినాబాద్లో 3.8, మహేశ్వరం 8, కందుకూరులో 4.6, కడ్తాల్లో 6.8, కేశంపేటలో 17.3, తలకొండపల్లిలో 36.4, ఆమనగల్ 5.1, మాడ్గులలో 18.2, యాచారంలో 15.3 మి.మీటర్లు, మంచాల 17, ఇబ్రహీంపట్నం 35.8, సరూర్నగర్ 36.4, రాజేంద్రనగర్ 26.5, గండీపేట 38.1, శేరిలింగంపల్లిలో 36.3, శంకర్పల్లి 1.5, బాలాపూర్ మండలాల్లో 8.5 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 13 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా, 14 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది.