
జిల్లాలో 1.51 లక్షల ఎకరాల్లో పత్తి పంట
రెండో స్థానంలో మొక్కజొన్న,మూడో స్థానంలో వరి
జిల్లాలో 3.19 లక్షల ఎకరాల్లో పంటల సాగు
షాద్నగర్, సెప్టెంబర్ 3 : ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో కురిశాయి. దీంతో జిల్లాలో 3,19,134 ఎకరాల్లో జొన్న, మొక్కజొన్న, వరి, పత్తి, చిరు ధాన్యాల పంటలు సాగు కాగా, అక్కడక్కడ పనులు సాగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఇప్పటికే వేసిన పంటలు పచ్చగా కళకళలాడుతున్నాయి. జిల్లాలో పత్తి సాగు మొదటి స్థానంలో ఉండగా, మొక్కజొన్న రెండో స్థానంలో ఉన్నది. మూడో స్థానంలో వరి పంటను సాగు చేశారు.
షాద్నగర్ డివిజన్లో అత్యధికం..
షాద్నగర్ వ్యవసాయ శాఖ డివిజన్ పరిధిలో అత్యధికంగా మొక్కజొన్న 52,087 ఎకరాల్లో సాగు చేశారు. పత్తి 42,874 ఎకరాలు, వరి 9,926, కందులు 18,760, జొన్నలు 3,720, సోయాబిన్ 17, చెరుకు 5, ఇతర పంటలు 656 ఎకరాల్లో సాగు చేశారు.
17 ఎకరాల్లో సోయాబిన్, 5 ఎకరాల్లో చెరుకు..
జిల్లాలో మొదటిసారిగా కొత్తూరు మండలంలో 17 ఎకరాల్లో సోయాబిన్, కొందుర్గు మండలం రేగడిచిల్కమర్రి గ్రామంలో 5 ఎకరాల్లో చెరుకు, ఆమనుగల్లు మండలంలో 17 ఎకరాల్లో అముదం, పెసర్లు… ఆమనుగల్లు మండలంలో 10 ఎకరాలు, యాచారం మండలంలో 12, మంచాల మండలంలో 105, మాడ్గుల మండలంలో 10 ఎకరాల విస్తీర్ణంలో పెసర్లను సాగు చేశారు.
70,519 ఎకరాల్లో మొక్కజొన్న సాగు..
మొక్కజొన్న పంటపై రైతులు ఎక్కువగా ఆసక్తి చూపారు. అత్యధికంగా షాద్నగర్ డివిజన్లో 52,087 ఎకరాల్లో సాగు కాగా, అత్యల్పంగా రాజేంద్రనగర్ డివిజన్లో సాగైంది. షాబాద్, మహేశ్వరం, కొందుర్గు, ఫరూక్నగర్, చౌదరిగూడ, కేశంపేట, తలకొండపల్లి మండలాల్లో కలిపి మొత్తం 70,519 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు.
సాగు విస్తీర్ణం పెరిగింది..
ఈసారి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. షాద్నగర్ డివిజన్లో 50 వేలకు పైగా ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు. వరి సాగు తగ్గగా, పత్తి పంటపై రైతులు ఆసక్తి చూపారు. చెవేళ్ల, షాద్నగర్ డివిజన్లలో పత్తి అధికంగా సాగు చేశారు. వాణిజ్య పంటలనూ సాగు చేశారు. ఈఏడాది పంటలు అధిక దిగుబడి రానున్నాయి.