షాబాద్/పరిగి, అక్టోబర్ 2 : తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాల్లో శనివారం ఉమ్మడి రంగారెడ్డిజిల్లా లోని 18 మండలాల్లో 29,858 మందికి చీరలు పంపిణీ చేశారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లిలో మంత్రి సబితారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య చీరలు పంపిణీ చేయగా, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట్‌లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆమనగల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, షాద్‌నగర్, కొందుర్గు మండలాల్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఆయా మండలాల్లో, మున్సిపాలిటీలలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు చీరల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
వికారాబాద్ జిల్లాలో..
వికారాబాద్‌లోని అంబేద్కర్‌భవన్‌లో, నవాబుపేట్ మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి సబితారెడ్డి ప్రారంభించగా, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పి.సునితా మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్యలు పాల్గొన్నారు. పరిగి నియోజకవర్గంలోని పరిగి, దోమ, కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ప్రారంభించారు. తాండూరు నియోజకవర్గంలో తాండూరు, బషీరాబాద్, యాలాల్, పెద్దేముల్ మండలాలతోపాటు తాండూరు పట్టణంలో ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్‌రెడ్డిలు బతుకమ్మ చీరలు పంపిణీని ప్రారంభించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్ మండలాల్లో బతుకమ్మ చీరలు పంపిణీని ప్రారంభించారు. పలుచోట్ల ఆయా మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు సైతం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఆడపడుచులకు పెద్దన్నలా..
ప్రతి పండుగకు బతుకమ్మ సారెలను పెడుతూ సీఎం కేసీఆర్ పెద్దన్నలా ఆడబిడ్డలను గౌరవిస్తున్నారు. ఇదివరకెన్నడూ ఏ ముఖ్యమంత్రి మహిళలను పట్టించుకోలేదు. పింఛన్లు, పెండ్లిళ్లకు ఆర్థిక సాయం అందిస్తూ మహిళల్లో ధైర్యాన్ని నింపుతున్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
బతుకమ్మ పండుగకు మంచి గుర్తింపు తెచ్చారు…
బతుకమ్మ పండుగకు ప్రభుత్వం మంచి గుర్తింపు తెచ్చింది. వారం రోజుల పాటు సంబురాలు చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం బతుకమ్మ పండుగను పట్టించుకోలేదు. ప్రతి ఏడాది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వానికి మహిళలు అండగా ఉంటారు.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
ప్రతి ఏటా దసరాకు బట్టలు పెడుతున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. తెలంగాణ వచ్చినంక బతుకమ్మ పండుగను గొప్పగా చేస్తున్నారు. బతుకమ్మ చీరలు ఇవ్వడంతో కొంతమేర పండుగ ఖర్చు తగ్గుతున్నందుకు సంతోషంగా ఉన్నది.
మహిళల సంక్షేమానికి పెద్దపీట
ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
ఆమనగల్లు, అక్టోబర్ 2 (జోన్‌బృందం) : మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. శనివారం ఆమనగల్లు మున్సిపాలిటీలో బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ రాంపాల్‌నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, జడ్పీటీసీ విజితారెడ్డి, అనురాధ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ పాల్గొన్నారు.
మహిళల సంక్షేమానికి పెద్దపీట
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 2 : ఆడపడుచులకు తెలంగాణ సర్కార్ అండగా నిలుస్తుందని, పండుగ రోజు సంతోషంగా గడుపాలని దసరా కానుగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి, అమ్మఒడి తదితర సంక్షేమ పథకాలను అమలు చేసి ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, పెద్దఅంబర్‌పేట్ మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్న, వైస్ చైర్మన్ సిద్దంకి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు నీలం శ్వేత, మమత, సుజాత, పద్మ, మంగ, జగన్, బాలరాజు, శ్రీలత, నాయకులు మహేష్‌గౌడ్, మోహీజ్పాషా, జెర్కోని రాజు, మైలారం విజయ్‌కుమార్, శివసాయి, బలరాం తదితరులు పాల్గొన్నారు.
సర్కారు సారె.. బతుకమ్మ చీరె
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
కొడంగల్, అక్టోబరు 2 : సర్కారు సారెగా బతుకమ్మ చీరను కానుకగా సీఎం కేసీఆర్ అందిస్తున్నారని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లో బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీలు ముద్దప్ప దేశ్‌ముఖ్, హేమీబాయి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషారాణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దామోదర్‌డ్డి, కోట్ల యాదగిరి తదతరులు పాల్గొన్నారు.
సంతోషంగా ఉండాలన్నదే సర్కారు ఉద్దేశం
ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
తాండూరు, అక్టోబర్ 2: బతుకమ్మ పండుగకు ప్రతి ఒక్క ఆడపడుచు సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం చీరలను పంపిణీ చేస్తున్నదని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. శనివారం తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే చీరలను పంపిణీ చేసి మాట్లాడారు.
కోట్‌పల్లి మండలంలో..
కోట్‌పల్లి, అక్టోబర్ 2 : కోట్‌పల్లి మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అశ్పక్స్రూల్, సర్పంచ్ రాధాకృష్ణ, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మంజులపాండు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనిల్, ఉపాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
ఆడబిడ్డలకు అన్నగా సీఎం కేసీఆర్ కానుక
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
పరిగి, అక్టోబర్ 2 : బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు అన్నగా సీఎం కేసీఆర్ చీరలను బతుకమ్మ కానుకలను అందజేస్తున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం పరిగి, దోమ మండలం బాస్పల్లి, బొంపల్లి, కులకచర్ల, చౌడాపూర్ మండల కేంద్రాల్లో బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఆడబిడ్డకు చీరలు అందుతాయన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తూ ఆడబిడ్డల పెండ్లిళ్లకు సాయం చేస్తుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ సీఈవో జానకిరెడ్డి, ఎంపీపీలు కె.అరవిందరావు, అనసూయ, సత్యమ్మ, జెడ్పీటీసీలు కొప్పుల నాగారెడ్డి, బి.హరిప్రియ, రాందాస్‌నాయక్, పరిగి పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, కులకచర్ల మార్కెట్ చైర్మన్ హరికృష్ణ, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ పాల్గొన్నారు.