ఎములాడ రాజన్న క్షేత్రం.. పరివార దేవతల నిలయంగా భాసిల్లుతున్నది. ఇంటి ఇలవేల్పుగా.. కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా రాజరాజేశ్వరస్వామి విరాజిల్లుతుండగా, ఇతర ప్రాంతాల్లో ఎక్కడా లేని విధంగా ఎన్నో విశిష్టతలతో అలరారుతున్నది. ప్రధాన ఆలయంలో ఎటు చూసినా కొలువైన దేవతల గుడులతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నది. మరోవైపు ఆలయ ప్రాంగణంలోని దర్గా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నది. ఈ మహిమాన్విత దివ్యధామాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ భవ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. ఆ దిశగా ఇప్పటికే అడుగులు పడగా, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడా లేని విధంగా రాజన్న క్షేత్రంలో పరివార దేవతలు కొలువు దీరారు. కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా రాజరాజేశ్వరస్వామి విరాజిల్లుతుండగా, ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న గుడుల్లో కనులనిండా దర్శనమిస్తున్నారు. ఎన్నో విశిష్టతలు, విశేషాలతో రాజన్న క్షేత్రం అలరారుతుండగా, ధర్మ పుష్కరిణి పుణ్యస్నానాల నుంచి మొదలు.. తిరిగి వెళ్లేదాకా భక్తులు మొక్కులు చెల్లిస్తూ తన్మయత్వం చెందుతున్నారు. ఈ దివ్యధామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కదులుతున్నారు. శాస్ర్తోక్తంగా విస్తరణకు ఇప్పటికే పీఠాధిపతుల ముందు ప్రణాళికలు పెట్టారు. గుడిని ఆధునీకరించడమే కాదు.. ఇదే సమయంలో పట్టణాన్ని అభివృద్ధి చేయనున్నారు. భవిష్యత్లో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా.. ప్రణాళికా బద్ధంగా పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజన్న క్షేత్రంలో కొలువైన పరివార దేవతలు, విశిష్టతలపై ‘నమస్తే తెలంగాణ’అందిస్తున్న ప్రత్యేక కథనం..
– కరీంనగర్, మార్చి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ వేములవాడ టౌన్
రాజన్న క్షేత్రం పరివార దేవతలతో నిత్యం కళకళలాడుతున్నది. కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా… ఇంటి ఇలవేల్పుగా శ్రీ రాజరాజేశ్వర స్వామి భాసిల్లుతుండగా.. ఇతర ప్రాంతాల్లో లేని విధంగా ఇదే గుడిలో పరివార దేవతలు కొలువు దీరారు. అందుకే భక్తులు రాజన్న క్షేత్రంలో అడుగుపెడితే.. చాలు ఎటు చూసినా గుడులు కనిపిస్తాయి. మరోవైపు మతసామర్యానికి ప్రతీక మహ్మదీయుల దర్గా ఇదే గుడిలో ఉండడం విశేషం. ఎన్నో విశేషాలు, విశిష్టతలు కలబోసి వెలసిన రాజన్న క్షేత్రంలో ఏది చూసినా.. ఎంత చూసినా.. కనులు సరిపోవు. దక్షిణకాశీగా పేరుపొందిన ఈ దేవాలయాన్ని ముఖ్యమంత్రి మరో మహిమాన్విత ఆలయంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నారు. ఆ దిశగా శాస్ర్తోక్తంగా విస్తరణకు ఇప్పటికే పీఠాధిపతుల ముందు ప్రణాళికలు పెట్టారు. గుడిని ఆధునీకరించడమేకాదు.. ఇదే సమయంలో.. పట్టణంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. భవిష్యత్లో వేములవాడకు వచ్చే భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రణాళికాబద్ధంగా పనులను ముందుకు తీసుకెళ్తున్నారు.
నీలమేఘశ్యాముడైన శ్రీరాముడు సీత, లక్ష్మణుడు, ఆంజనేయస్వామితో సహా ఇక్కడ కొలువుదీరాడు. ప్రతి శ్రీరామనవమిన ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి, సీతారామచంద్రుల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి, కనులారా తిలకిస్తారు.
ఇక్కడి విశ్వేశ్వరలింగం గోధుమ గులాబీ వర్ణంతో కాశీవిశ్వేశ్వరుడిని తలపించేలా ఉంటుంది. విశ్వేశ్వరుడికి, ఆంజనేయస్వామికి మధ్యన భక్తుల విగ్రహాలు ఉన్నాయి. అందులో ఓ భక్తురాలు తన చేతులతో కలశాన్ని విశ్వేశ్వరుడి లింగం వైపు వంచి నిల్చొని ఉంటుంది. ఆ విగ్రహ శిరోమధ్యమున రంధ్రంలోంచి పోసిన జలం, విశ్వేశ్వరుడిని అభిషేకిస్తుంది.
నందిమండపం, ధ్వజస్తంభానికి సమీపాన వల్లుబండ ఉంది. దీనిని ఎప్పుడు ఎవరు కట్టారో తెలియదుగానీ స్త్రీలు ధర్మగుండంలో స్నానం చేసి, తడి బట్టలతో వచ్చి ఇక్కడ అల్లు పడుతారు.
రాజన్న ఆలయ ప్రాంగణంలోని ఈ దర్గా మాత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నది. హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా దర్శించుకుంటారు. నిజానికి ఈ దర్గా రాజ్బక్షి అనే ముసల్మాన్ సమాధి. ఆయన తన భక్తుడేనని, తన పాదాల చెంతే అతడి సమాధి నిర్మించాలని స్వామివారు ఆదేశించడం వల్లే అక్కడ మసీదు నిర్మించారని చెబుతారు. అలాగే హజ్రత్ ఖ్వాజాబాఘ్ సవర్ సమాధి కూడా అయి ఉండవచ్చని కొందరి భావన.
ఇక్కడ లింగరూపంలో ఉన్న శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని భక్తులు కొలిచి, కుడిపక్కన ఉన్న సోమసూత్రం దగ్గర రాజరాజేశ్వరస్వామివారి పంచముఖముల్లో ఒకటైన వామదేవ ముఖ ప్రదేశం నుంచి వెలువడే అభిషేకజలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు.
రాజరాజేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన భక్తులు మొదట ధర్మపుష్కరిణిలో పవిత్ర స్నానం చేసి, సూర్యభగవానుడికి, శ్రీరాజరాజేశ్వర స్వామికి నమస్కరిస్తారు. శుభ్రమైన వస్ర్తాలను ధరించి, కొబ్బరి కాయలు మొదలగు పూజా సామగ్రిని వెంట తీసుకొని, దేవాలయ ప్రాకారానికి వాయువ్య దిశలోని క్యూలైన్ ద్వారా వెళ్లి కోడె టికెట్ కొనుగోలు చేస్తారు. దేవాలయ ఈశాన్యభాగంలోని శ్రీ బాలరాజేశ్వరస్వామివారికి అభిముఖంగా ఉన్న ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తారు. వల్లుబండ వద్ద కోడెను తీసుకొని, దాని ముఖ, పాదాలు కడిగి, కుంకుమ, పసుపు, అక్షితలు, పుష్పాలు సమర్పిస్తారు. అనంతరం భక్తి పూర్వకంగా నమస్కరించి, కోడెతో ప్రదక్షిణ చేసి, వల్లుబండ వద్ద రాతి స్తంభానికి కట్టేసి మొక్కు చెల్లిస్తారు. తమ పంటలు బాగుండాలని, పాడి వృద్ధి చెందాలని, ముఖ్యంగా సంతానం కలుగాలని మొక్కుతారు. కోడె మొక్కులేని భక్తులు తూర్పు దిక్కున ఉన్న రాజగోపురంలోని సింహ ద్వారం గుండా నేరుగా ఆలయంలోకి వచ్చి దర్శనం చేసుకుంటారు.
ప్రస్తుత దేవాలయ అంతర్భాగంలోని ఆగ్నేయ దిశలో గండాదీపం, మెట్ల స్తంభం ఉన్నాయి. మెట్లకింద స్తంభాన్ని ఆనుకొని ఒక వెడల్పు ప్రమిదలో దీపం వెలుగుతూ ఉంటుంది. భక్తులు తమ గండాలు గట్టెక్కితే ఇందులో నూనె పోస్తామని మొక్కి అలాగే మొక్కు తీర్చుకుందురు.
భక్తులు ఈ దేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. దసరా సందర్భంగా ‘శరన్నవరాత్రులు’ పేరిట ఆలయంలో కన్నుల పండువగా ఉత్సవాలు నిర్వహిస్తారు.
దేవాలయానికి పశ్చిమంగా ఈ మండపం ఉంది. దీనిని రాజరాజేశ్వరస్వామి పరమభక్తుడు నాగిరెడ్డి నిర్మించాడని చెబుతారు. శరన్నవరాత్రులు, గణపతి ఉత్సవాలు, గీతా యజ్ఞాలు, అభిషేకాశీర్వచనాది మొక్కులు కూడా ఈ మండపంలోనే జరుగుతున్నవి.
ఇందులో ప్రవేశించగానే మొదటి ద్వారం లోపల నంది, గణపతి, పార్వతీదేవి విగ్రహాలు కనిపిస్తాయి. రెండో ద్వారం లోపలి గర్భాలయంలో శ్రీ ఉమా మహేశ్వరుడు పానవట్టంపై లింగరూపంలో దర్శనమిస్తాడు.
ఈ ఆలయంలో ప్రథమ ద్వారం నుంచి లోనికి ప్రవేశించగానే నంది, గణపతి, శ్రీ గౌరీదేవి, నాగదేవతా విగ్రహాలు కనిపిస్తాయి. రెండో ద్వారం లోపలి గర్భాలయంలో పానపట్టంపై శ్రీ సోమేశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడు.
రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో పశ్చిమ వాయువ్యదిశలో ఈ మందిరాన్ని నిర్మించి, బాలత్రిపురసుందరీ దేవిని ప్రతిష్ఠించారు.
ఈ ఆలయంలో మయూర వాహనాయుతుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువుదీరి కనిపిస్తాడు.
“కృతే తు స్ఫటికాకారం త్రేతాయాం హరితద్యుతి ద్వాపరే తు హరిద్రాహభం కలౌ నీలోత్పలచ్ఛవి” అని స్థల పురాణ శ్లోకంలో చెప్పినట్లే నీతోత్పలశ్యామల వర్ణంతో.. కోమలమైన నునుపుతో దివ్య ప్రభలతో విరాజిల్లుతూ లింగరూపాన ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామివారు, భక్తులకు నయనానందకరంగా దర్శనమిస్తాడు. పానవట్ట మూలన బ్రహ్మ,మధ్యన త్రిలోకనాథుడు విష్ణువు, ఆపైన ప్రణవ స్వరూపుడైన మహాదేవుడగు సదాశివుడు భాసిల్లుతూ ఉంటాడు. లింగవేది యందు శక్తిస్వరూపిణియైన మహాదేవి విరాజిల్లుతూ ఉంటుంది.
స్వామివారికి దక్షిణభాగాన ఉన్న క్యూ ద్వారా నడిచి.. స్వామివారికి ఆగ్నేయ దక్షిణ భాగాన ఉన్న ప్రధానాలయ దక్షిణ ద్వార సమీపాంత ర్భాగానికి భక్తులు కదులుతారు. అవక్క సర్వాభరణ భాసుర, కల్యాంబర, సర్వాపన్నివారిణి, బ్రహ్మాండ జనని, సంధాయిని, వేదవేదాంగవేద్య, జగదంబయగు సర్వ మంగళ, శ్రీ చక్రరాజనిలయమైన, పంచమి శ్రీరాజ రాజేశ్వరీ దేవిని భక్తులు కనులనిండా తిలకించి పునీతులవుతారు. అర్చనల అనంతరం అక్కడి కుంకుమను నుదుట ధరించి బయటకు వెళ్తారు.
దక్షిణ ద్వారం నుంచి బయటకు వచ్చిన భక్తులు, పశ్చిమ మధ్యభాగాన ఉన్న శ్రీ అనంత పద్మనాభస్వామివారి దేవాలయం వైపు లైను ద్వారా శ్రీ అనంత పద్మనాభస్వామివారి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఈ మందిర మధ్యలో శేషతల్పమున శయనిస్తున్న శ్రీఅనంత పద్మనాభస్వామివారిని దర్శించుకుంటారు. ఎడమ పక్కన శ్రీ వేంకటేశ్వరస్వామి, కుడిపక్కన రుక్మిణి, సత్యభామా సహిత గోపాలకృష్ణ స్వామికి నమస్కరిస్తారు.
దేవాలయ దక్షిణ దిశలో పరమశివ భక్తుడు, శ్రీ వీరభద్రస్వామికి నమస్కరిస్తూ, ‘కోటి లింగాలు’గా ప్రసిద్ధిగాంచిన శివలింగాలను దర్శించుకుంటూ ముందుకు సాగుతారు భక్తులు. మధ్యలో ‘శ్రీ రుక్మిణి సత్యభామాసహిత విఠలేశ్వరుడి’ పక్కనే ఉన్న ‘శివ పంచాయతనాన్ని’దర్శించుకుంటారు. అలా ప్రధాన ఆలయం వెనుక పశ్చిమభాగాన క్యూలైన్లో ప్రవేశించి, ఉత్తర దిక్కున సోమసూత్రం వద్ద కొబ్బరి కాయలు కొడతారు. ఈ మధ్యే భక్తుల సౌకర్యార్థం ఫైఓవర్ క్యూలైన్లు నిర్మించారు.
ఉత్తర ద్వారం నుంచి లోనికి ప్రవేశించగానే భక్తులు, స్వామివారికి ఉత్తర ఈశాన్య భాగాన ఉన్న లక్ష్మీ గణపతిని దర్శించుకుంటారు. ద్వార పాలకులైన భైరవులను దర్శించుకుని వెళ్లి, లక్ష్మీగణపతి స్వామిని పూజిస్తారు.
స్వామివారికి అభిషేకాలు, అర్చనల కోసం సమర్పించిన పంచామృతాలు, కొబ్బరి కాయ జలం, శుద్ధోదకం, ఉత్తరాభిముఖంగా ఉన్న పానవట్టము ద్వారా ప్రవహించి, సోమసూత్రం ద్వారా బయటకు వెళ్తాయి. పానవట్టం చివరి భాగం నుంచి వచ్చే తీర్థ జలాన్ని భక్తులు సేవించి చండీకేశ్వరుడికి నమస్కరించి శివపూజకు అతని ఆజ్ఞను స్వీకరించినట్లు భావిస్తారు. అలా అక్కడి నుంచి ప్రధాన దేవాలయ ఉత్తర ద్వారం నుంచి లోనికి ప్రవేశిస్తారు.
రాజరాజేశ్వరస్వామికి అభిముఖంగా కొంత దూరంలో మహా మండపం మధ్యలో నందీశ్వరుడి విగ్రహం ఉంటుంది. ధర్మదేవతను ఈశ్వరుడు వరం కోరుకోమని ఆదేశించగా.. ‘వాహనంతే భవిష్యామి’ నీకు వాహనమై ఉండెదనని కోరుకొని నందీశ్వరుడిగా అవతరించెనని పౌరాణిక కథనం. ఆ నందీశ్వరుడే ‘కోడెల మొక్కు’ రూపాన ఆలయంలో ప్రత్యేక విశిష్టత సంపాదించాడు.