ఇచ్చోడ, మార్చి 31 : ఇచ్చోడ మండలం అడెగామ (బీ)కు చెందిన యువరైతు కదం విశాల్ తనకున్న ఎకరంలో పాలీహౌస్ ఏర్పాటు చేసుకొని వివిధ పంటలు సాగు చేస్తున్నాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రభుత్వం పాలీహౌస్ ఏర్పాటు చేసుకునే ఎస్సీ, ఎస్టీ రైతులకు యూనిట్‌కు 95శాతం, ఇతర రైతులకు యూనిట్‌కు 75 శాతంపై సబ్సిడీ అందిస్తున్నది. దీంతో విశాల్ తనకున్న ఎకరంలో పాలీహౌస్ను ఏర్పాటు చేసుకున్నాడు. వానకాలంలో టమాట, కొత్తిమీర, మెంతి సాగు చేశాడు. పాలీహౌస్లో కలుపు మొక్కల బెడద లేకుండా బెడ్ పద్ధతితో పాటు వర్మీ కంపోస్టు ఎరువులను వాడుతున్నాడు. నీటిని వృథా చేయకుండా డ్రిప్ ద్వారా పంటకు నీటి తడులను అందిస్తున్నాడు. ప్రస్తుతం ఎకరంలో కీర దోస వేశాడు. ఇందుకు పెట్టుబడి రూ. 50 వేల వరకు పెట్టాడు. ప్రస్తుతం పంట చేతికి వస్తుంది. మొత్తంగా 400 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతు విశాల్ చెబుతున్నాడు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ కీరదోసకు రూ. 15 నుంచి రూ. 25 వరకు ధర పలుకుతుంది. ప్రతి రోజూ 7 నుంచి 10 క్వింటాళ్లను మార్కెట్లో విక్రయిస్తున్నాడు.
ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీని వినియోగించుకున్న. ఎకరంలో పాలీహౌస్ ఏర్పాటు చేసుకున్న. ఏడాదికి మూడు పంటలు సాగు చేస్తున్న. కూరగాయలు, ఆకు కూరలు వేస్తుంట. ఈసారి కీర దోసకాయ వేసిన. ఇది 45 రోజులకే కోతకు వస్తుంది. ప్రస్తుతం రోజూ 7 నుంచి 10 క్వింటాళ్ల వరకు మార్కెట్లో అమ్ముతున్న. డిమాండ్‌ను బట్టి కిలోకు రూ. 15 నుంచి రూ.25 వరకు ధర పలుకుతుంది. ఇంద్రవెళ్లి, ఉట్నూర్, బోథ్ మండలాల నుంచి వ్యాపారులు వచ్చి కొనుక్కొని పోతున్నరు.
– కదం విశాల్, రైతు, అడెగామ (బీ)