
‘మల్లన్న మమ్మేలు.. కోరమీసాల సామి.. మమ్ము దీవించు.. మా కోరికలు తీర్చు.. మా మొక్కులు స్వీకరించు’.. అంటూ భక్తజనం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం పట్నంవారం వైభవంగా జరిగింది. మల్లన్న నామస్మరణతో ఆలయం మార్మోగింది. శివసత్తుల పూనకాలు, పోతరాజుల చిందులతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. భక్తులు గంగిరేగు చెట్టుకు ముడుపులు కట్టి, స్వామివారికి ఒడిబియ్యం, పట్టువస్ర్తాలు సమర్పించి, పూజలు నిర్వహించారు. పట్నాలు వేసి, మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. భక్తుల కోసం ఆలయ పాలకవర్గం అన్ని ఏర్పాట్లు చేయగా, స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పట్టింది. కొవిడ్ కారణంగా నేటి అగ్నిగుండం, పెద్దపట్నం రద్దు అయ్యాయి.
చేర్యాల, జనవరి 16: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి క్షేత్రానికి పట్నం వారం సందర్భంగా 40వేల మంది భక్తులు తరలివచ్చారు. పట్నం వారం సందర్భంగా భక్తులు భారీగా తరలిరావడంతో కొమురవెల్లి క్షేత్రం జనసంద్రంగా మారింది. బ్రహ్మోత్సవాల్లో మొదటి వారం పట్నం వారంగా పిలువడం ఆనవాయితీ. ఆదివారం హైదరాబాద్‌కు చెందిన భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం నుంచే భక్తులు కొమురవెల్లి క్షేత్రానికి చేరుకున్నారు. ఆదివారం వేకువజామునే పవిత్ర స్నానం ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ముఖ మండపం, గంగరేగు చెట్టు ప్రాంగణంలో పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. కొందరు భక్తులు స్వామి వారికి కల్యాణం నిర్వహించడంతో పాటు అమ్మవార్లకు ఒడి బియ్యం పోయడం, అభిషేకం, అర్చన తదితర పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, మల్లన్న క్షేత్రంలో ఓ మోస్తారు వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు.
మల్లన్న దర్శనానికి 4 గంటలు..
కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజామునే క్యూలైన్లలో వేచి ఉన్నారు. ధర్మ దర్శనంలో భక్తులు 4 గంటలు, ప్రత్యేక దర్శనంలో భక్తులు 3 గంటలు, శీఘ్రదర్శనంలో భక్తులు 2 గంటల్లో స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం 5 గంటల ప్రారంభమైన దర్శనాలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగాయి. కార్యక్రమంలో ఆలయ ఈవో ఏ.బాలాజీ, చైర్మన్ గీస భిక్షపతి, ఏఈవో వైరాగ్యం అంజయ్య, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు తదితరులు పాల్గొన్నారు.
కాలినడకన వచ్చిన భక్తులు..
రంగారెడ్డి జిల్లా దూలపల్లికి చెందిన గుర్రాల శ్యామ్యాదవ్, కిరణ్, సంపత్, సత్యనారాయణయాదవ్ కొమురవెల్లి క్షేత్రానికి కాలినడకన వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. 10 సంవత్సరాలుగా నలుగురు భక్తులు ఇంటి నుంచి పాదరక్షలు లేకుండా కాలినడకన వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
దారులన్నీ కొమురవెల్లికే..
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చేర్యాల, సిద్దిపేట, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, జనగామ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. పట్నం వారం సందర్భంగా ప్రధాన రహదారులన్నీ కొమురవెల్లి వైపునకే కొనసాగాయి. స్వామి వారి క్షేత్రానికి చేరుకునే హైదరాబాద్, సిద్దిపేట, చేర్యాల కొమురవెల్లి రహదారుల్లో రెండు కిలోమీటర్ల మేర భక్తులు నిండిపోయారు. కాగా, మల్లన్న క్షేత్రంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హుస్నాబాద్ ఏసీపీ సతీశ్ ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్షేత్రంలో పోలీస్ ఔట్‌పోస్టును ఏర్పాటు చేసి సేవలు అందించారు. ఏసీపీ ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల్లో పరిస్ధితులను గమనించడతో పాటు పోలీస్ వాహనంలో క్షేత్రంలో పరిశీలించారు. మల్లికార్జున స్వామి వారి క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో, ధర్మకర్తల మండలి చైర్మన్ తెలిపారు.
పట్నాలు, బోనాలు..
మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తమ మొక్కులను చెల్లించుకున్నారు. స్వామి వారికి పట్నాలు, మల్లన్న గుట్ట పైన ఉన్న ఎల్లమ్మకు బోనాలు చెల్లించుకున్నారు. కార్యక్రమాల్లో తూముల రమేశ్‌యాదవ్, ఉట్కూరి అమర్, ధరావత్ అనిత, తాళ్లపల్లి శ్రీనివాస్, కొంగరి గిరిధర్, చింతల పర్శరాములు, తివారి దినేశ్‌కుమార్, బొంగు నాగిరెడ్డి, శెట్టె ఐలయ్య, ముత్యం నర్సింహులు, పొతుగంటి కొమురవెల్లి, గడ్డం మహేష్‌యాదవ్, సాయియాదవ్ క్షేత్రంలో భక్తులకు సేవలు అందించారు.