ధన్య బాలకృష్ణన్, తేజ ఐనంపూడి, చైతన్య రావ్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించి ఇటీవలే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘జగమేమాయ’. ఈ చిత్రాన్ని జ్యాపీ స్టూడియోస్ పతాకంపై ఉదయ్ కిరణ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే నిర్మించారు. క్రైమ్ డ్రామా కథతో దర్శకుడు సునీల్ పుప్పాల రూపొందించారు. ఈ చిత్ర విజయోత్సవ కార్యక్రమం బుధవారం హైదరాబాద్లో జరిగింది. నటుడు తేజ ఐనంపూడి మాట్లాడుతూ…‘ఫలితం ఎలా ఉంటుందో అనే భయం సినిమా విడుదల ముందు నాలో ఉండేది. ఇవాళ మీ ఆదరణ చూశాక సంతోషంగా ఉంది’ అన్నారు. నటుడు చైతన్య రావ్ మాట్లాడుతూ…‘అన్ని భాషల్లో మా చిత్రానికి ఆదరణ దక్కుతున్నది. ఓటీటీలో విడుదలైంది కాబట్టి మీకు వీలున్న టైమ్లో మా చిత్రాన్ని చూడండి’ అన్నారు.