పటాన్చెరు, ఏప్రిల్ 1: నిరుద్యోగ యువత పట్టుదలతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఉద్యోగాలు సాధించాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సౌజన్యంతో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ శిబిరాన్ని శుక్రవారం పటాన్‌చెరులోని మైత్రీ గ్రౌండ్స్ లో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతుల బ్రోచర్‌ను విడుదల చేసి, అభ్యర్థులకు టీషర్టులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు పైసా ఖర్చు లేకుం డా ఉచిత వసతి, భోజన సౌకర్యాలు, స్టడీ మెటీరియల్‌ను ఇచ్చి శిక్షణ అందిస్తున్న ఎమ్మెల్యేను మంత్రి అభినందించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టి, నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు. 11వేల కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధ్దీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 80 వేల ఉద్యోగాల నియామకాల్లో పోలీస్‌శాఖలో 18 వేలు, అటవీ, ఎక్సైజ్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ శాఖలో 4వేలకు పైగా ఉన్నాయన్నారు. మొత్తం 22వేలకు పైగా కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత 1.54లక్షల ఉద్యోగాలకు నోటిఫై చేసిందని, అందులో ఇప్పటివరకు 1.32లక్షల నియామకాలు పూర్తయ్యాయని మంత్రి వెల్లడించారు. కేంద్రంలో 16లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మంత్రి అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ రమణకుమార్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, శిక్షణ అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.