కృత్రిమ మేధస్సు, యంత్రనైపుణ్యం కలగలిపి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ‘ఇంటిగ్రేటెడ్ అగ్రి బ్లాక్‌చైన్ టెక్నాలజీ’గా పిలువబడే ఈ విధానం చిన్న, సన్నకారు రైతులకు మేలుచేస్తుందని భావిస్తున్నారు. తమిళనాడులో ఇప్పటికే 30వేల మంది రైతులు ఈ పద్ధతిని పాటిస్తుండగా.. త్వరలో కామారెడ్డి జిల్లాలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తామని పరిశోధక బృందం చెబుతున్నది.
కొండాపూర్(హైదరాబాద్), ఆగస్టు 27: రైతులకు మేలు చేకూర్చేలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు సరికొత్తగా ఇంటిగ్రేటెడ్ అగ్రి బ్లాక్‌చైన్ టెక్నాలజీని రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజె న్స్, మెషిన్ లర్నింగ్‌ల సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే బ్లాక్‌చైన్ ప్రాసెస్‌ను రెండు సంవత్సరాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు వర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ప్రొఫెసర్లు విజయ్ మరిశెట్టి, వర్ష మామిడి శుక్రవారం పేర్కొన్నారు. ఇన్‌క్లూజివ్ గ్రో త్ చైన్ పేరుతో ఈ ప్రాజెక్ట్‌ను హెచ్‌సీయూ, సమున్నతి సంస్థలు సంయుక్తంగా అందుబాటులోకి తీసుకువస్తున్నారని తెలిపారు. ఇందులో చేరేందుకు కొంతమంది రైతులు కలిసి ఫార్మర్స్ ప్రొడ్యుసింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీవో)గా ఏర్పడి బ్లాక్‌చైన్‌లో పూర్తి వివరాలను పొందుపరిస్తే, వారికి సం బంధించిన ప్రతి కొనుగోలు అమ్మకాల వివరాలు పారదర్శకంగా ఉంటాయన్నారు. వ్యాపారంలో వచ్చే లాభాలను ఎఫ్‌పీవో నిర్వహిస్తుండడంతో పాటు లాభాలను అందరికీ అందజేసేలా చూస్తుందని తెలిపారు. బ్లాక్‌చైన్‌లో రైతు వివరాలతో పాటు వారు చేసే వ్యాపార లావాదేవీల సంస్థలు, బ్యాం కులు, ఇన్సూరెన్స్ సంస్థల వివరాలు కూడా పొం దుపర్చబడి ఉంటాయన్నారు. ఇప్పటికే తమిళనా డు రాష్ట్రంలో 30వేల మంది రైతులు ఎఫ్‌పీవోగా ఏర్పడి ఈ టెక్నాలజీ ద్వారా లాభసాటి వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే తెలంగాణలోని కామారెడ్డిలో ఇంటిగ్రేటెడ్ అగ్రి బ్లాక్‌చైన్ టెక్నాలజీని అందుబాటులోకి వస్తుందన్నారు. ఇక్కడ విజయవంతంగా కొనసాగితే దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.