పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన గులాబీ బాస్
అక్టోబర్‌లో పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం
పార్టీ పదవుల నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం
నిజామాబాద్‌లో నిర్మాణం పూర్తి చేసుకున్న తెలంగాణ భవన్
జిల్లా అధ్యక్షుడిని నియమించనున్నఅధినేత కేసీఆర్
సభ్యత్వ నమోదులో తెలంగాణలో అతిపెద్ద పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట్రసమితి.. త్వరలోనే సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించనుంది. గులాబీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో వచ్చే నెలలో వివిధ కమిటీల మార్పులు, చేర్పులు, నూతనంగా కార్యవర్గాల కూర్పు ఉండబోతుండడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో హుషారు కనిపిస్తున్నది. ఉద్యమ పార్టీగా అవతరించి, ఇంటిపార్టీగా గెలిచి నిలిచిన టీఆర్ఎస్.. రాష్ట్రంలో వాడవాడలా బలమైన పునాదుల్ని కలిగి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడంపై నాయకత్వం దృష్టిసారించింది. సెప్టెంబర్‌లో గ్రామ, మండల, జిల్లా కమిటీలను, వార్డు, పట్టణ కమిటీలను నియమించనుంది. గతంలో టీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరించిన జిల్లా సమన్వయకర్తల విధానాన్ని తిరిగి తీసుకురావాలని కేసీఆర్ భావిస్తున్నారు. జిల్లాల్లో పార్టీ సారథ్యబాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేవారినే జిల్లా అధ్యక్షులుగా నియమించాలని యోచిస్తున్నారు. అలాగే నిజామాబాద్ సహా పలు జిల్లాకేంద్రాల్లో నిర్మించిన టీఆర్ఎస్ కార్యాలయ భవనాలను అక్టోబర్‌లో ప్రారంభించనున్నారు. త్వరలోనే సంస్థాగత పదవుల నియామకం ఉందన్న సంకేతాల నేపథ్యంలో.. పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
నిజామాబాద్, ఆగస్టు 26, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో సభ్యత్వ నమోదులో అతి పెద్ద పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. గులాబీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలతో వచ్చే నెలలో వివిధ కమిటీల మార్పులు, చేర్పులు, నూ తనంగా కార్యవర్గాల కూర్పు ఉండబోతుండడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో హుషారు కనిపిస్తోంది. ఉద్యమపార్టీగా అవతరించి ఇంటి పార్టీగా గెలిచి నిలిచి.. రాష్ర్టానికి కొండంత అండగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితిని వాడవాడకూ విస్తరించింది. ఏటా నిర్వహించే సభ్యత్వ నమోదులో రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదు అవతున్నాయి. నియోజకవర్గానికి 50వేల సభ్యత్వాలు లక్ష్యంగా పార్టీ నిర్ణయిస్తే చాలా చోట్ల టార్గెట్ మించి సభ్యత్వాలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ పురుడు పోసుకున్న తొలి నాళ్ల నుంచి కంచుకోటగా ఉన్న ఉమ్మడి జిల్లాలో నేటికీ టీఆర్ఎస్ చెక్కుచెదరకుండా కొనసాగుతున్నది. కాంగ్రెస్, బీజేపీలు పత్తాలేకుండా పోతున్నాయి. త్వరలోనే పార్టీ కార్యవర్గాల ఎన్నిక, జిల్లా కార్యాలయం ప్రా రంభోత్సవం ఉండనుండడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. పార్టీ పదవులు చేపట్టేందుకు ఆశావహులు చాలా మంది ఆసక్తి చూపుతుండడం విశేషం.
వచ్చే నెలలో కార్యవర్గాల కూర్పు…
తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చే నెలలో గ్రామ, మండ ల, జిల్లా పార్టీ కార్యవర్గాలను ఏర్పాటు చేయబోతున్నది. ఈ మేరకు గులాబీ అధినేత కేసీఆర్ ప్రకటించడంతో శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. గతంలో జిల్లాలకు సమన్వయకర్తలను నియమించారు.అదే పాత నిర్మా ణ వ్యవస్థను పునరుద్ధరించుకోవాలని అధినేత ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లా శాఖ అధ్యక్షుడిని సై తం పార్టీ నామినేట్ చేయనున్నది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఇతర ప్రజా ప్రతినిధుల సారథ్యంలో కమిటీలను ఏర్పాటు చేయనున్నా రు. జిల్లాలో పార్టీ నిర్వహణ వ్యవహారాలు ఇక నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే నిర్వహించుకునేలా చర్యలు తీసుకోనున్నారు. సెప్టెంబర్ 2 నుంచి పార్టీ సం స్థాగత నిర్మాణం ప్రారంభం కానున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో కమిటీల నిర్మాణం జరుగుతుంది. ఆ తర్వాత మండల, మున్సిపల్, పట్టణ కమిటీలతో పాటు జిల్లా కమిటీలు కూడా వేయనున్నారు. గతంలో నిలిపివేసిన జిల్లా కమిటీలను తిరిగి ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో ఆశావహులు చాలా మంది పార్టీ పదవులపై ఆసక్తి చూపుతున్నారు. జిల్లా కమిటీలు పూర్తయ్యాక రాష్ట్ర కమిటీ కూర్పుపై అధినేత కేసీఆర్ దృష్టి సారిస్తారు.
రూ.60లక్షలతో మినీ తెలంగాణ భవన్…
మినీ తెలంగాణ భవన్‌గా పిలుస్తున్న టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల భవన నిర్మాణానికి అధిష్టానం రూ.60లక్షలు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహా డిజైన్‌ను, నిధులకు సంబంధించిన చెక్కులను ఇదివరకే అధినేత కేసీఆర్ స్వయంగా స్థానిక ఎమ్మెల్యేలకు అందించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. కామారెడ్డి జిల్లాలోనూ నూతన కలెక్టరేట్‌కు సమీపంలో కేటాయించిన చోట పనులు మొదలు కాగా కొన్ని అనివార్య కారణాలతో పనులు నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో భవన నిర్మాణం పూర్తి కాగా అక్టోబర్‌లో కేసీఆర్ ప్రారంభించనున్నారు.
టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నమూనాను సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించి ఆమోదించారు. ఒకే రకమైన పార్టీ కార్యాలయాలనే నిర్మిస్తున్నారు. మినీ తెలంగాణ భవన్ వైశాల్యం 8,352 చదరపు అడుగుల మేర ఉంది. ఇందు లో వివిధ విభాగాలను విభజించారు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు విస్తీర్ణం 2,537 చదరపు అడుగులుగా ఉంది. దీని పక్కనే మీటింగ్ హాలును నిర్మించారు. నియోజకవర్గ, మండల స్థాయి మీటింగ్‌లకు ఈ భవనం వేదికగా నిలువనున్నది. మీటింగ్ హాలు వైశాల్యం 4712 చదరపు అడుగులుగా తీర్చిదిద్దారు.
ద్విదశాబ్ది సంబురం…
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్లీనరీ వేడుకలు కరోనా కారణంగా రెండేండ్లుగా జరుపుకోలేదు. వార్షికోత్సవ సభలు కూడా నిర్వహించలేదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని లక్షల మందితో ఘనంగా జరిపే ఆనవాయితీ టీఆర్ఎస్కు మొదటి నుంచి ఉంది. కరోనా పరిస్థితిని చూసుకుని సరైన సమయంలో అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్‌లో పార్టీ ద్విదశాబ్ది ఉత్సవ సభ జరపాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏటా జరిగే ప్లీనరీని సరిగ్గా రెండు నెలల కాలంలోనే భారీ ఎత్తున నిర్వహించేందుకు పార్టీ ఆలోచన చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ కన్నా మిన్నగా టీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకూ బలం పెరుగుతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మొదటి నుంచి టీఆర్ఎస్కు కంచుకోట. ఉద్యమ కాలం నుంచి అనేక ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఈ ప్రాంత బిడ్డలు పట్టం కట్టినవారే. అదే అభిమానాన్ని నేటికీ గులాబీ పార్టీపై ప్రజలంతా చూపిస్తుండడంతో జాతీయ పార్టీల కంటే అనేక రెట్లు ఎక్కువగా టీఆర్ఎస్ బలం పెంచుకున్నది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో గులాబీ పార్టీ ఊహించిన దాని కంటే ఎక్కువగానే సభ్యత్వాలు నమోదు అవుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు మండల స్థాయిలో బలం అంతగా లేదు. కాషాయ జెండా పట్టుకున్న వారంతా గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీల బలం సన్నగిల్లింది. ఏటా టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ప్రాధాన్యత పెరుగుతోంది.