శక్కర్‌నగర్, ఆగస్టు 18:బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను న్యాక్ త్రిసభ్య కమిటీ బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా వివిధ విభాగాలపై ప్రిన్సిపాల్‌తోపాటు అధ్యాపకులు, బోధనేతర సిబ్బందితో బృందం సభ్యులు వేర్వేరుగా సమీక్షించారు. విద్యార్థులు, వారి పోషకులతోనూ మాట్లాడి వివరాలను సేకరించారు. కళాశాలలో కల్పించిన వసతులు, బోధనా తీరుపై సంతృప్తి వ్యక్తంచేశారు. బృందం పర్యటన సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనను, ప్రతిభను సభ్యులు అభినందించారు. బృందం చైర్మన్ ప్రొఫెసర్, డాక్టర్ రమేశ్, బీహార్ బాగల్పూర్ యూనివర్సిటీ, వైస్ చాన్స్‌లర్, సమన్వయ కర్త ఆచార్య ప్రకాశ్‌చంద్ర పట్నాయక్, ఢిల్లీ యూనివర్సిటీ, ఆచార్య ప్రభు చప్కేలు కళాశాలను సందర్శించిన వారిలో ఉన్నారు. వారివెంట జడ్పీ సీఈవో గోవింద్, స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ జేడీ, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రంగరత్నం, కళాశాల సమన్వయకర్త నహీదాబేగం, సిబ్బంది ఉన్నారు.
ఎస్ఆర్ఎన్కే కళాశాల ఆకస్మిక తనిఖీ
బాన్సువాడ, ఆగస్టు 18 : పట్టణంలోని ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కమిషనరేట్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ జేడీ రాజేందర్ సింగ్ తనిఖీ చేశారు. కళాశాలకు న్యాక్ గుర్తింపు కోసం అధ్యాపక బృందానికి సలహాలు, సూచనలు అందజేశారు. అనంతరం అన్ని విభాగాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. మధుమలంచ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, స్థానిక ప్రిన్సిపాల్ గంగాధర్, సిబ్బంది పాల్గొన్నారు.