గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆనందోత్సాహాల మధ్య మూడు రోజుల పాటు జరుపుకునే ముచ్చటైన పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే సంక్రమణం అని అర్థం. మకర సంక్రాంతి తెలుగు రాష్ర్టాల సంసృ్కతి, సంప్రదాయలను ప్రతిబింబించే పర్వదినం. ఈ పండుగను భోగి, మకర సంక్రాంతి, కనుమ అని మూడు రోజుల పాటు జరుపుకొంటారు. జిల్లాలో 14న భోగి, 15న మకర సంక్రాంతి, 16న కనుమ పండుగను జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.
-బాన్సువాడ రూరల్, జనవరి 13
మొదటి రోజు భోగి
భోగి పండుగ రోజున తెల్లవారుజామునే లేచి భోగిమంటలు వేస్తారు. భగ అనే పదం నుంచి భోగి అనే మాట పుట్టిందని చెబుతారు. భగ అంటే మంటలు లేదా వేడి పుట్టించడం అని అర్థం. దక్షణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు. సాయంత్రం పిల్లలకు పోసే భోగి పండ్లు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దివ్యమైన ఆశీస్సులుగా భావిస్తారు.
మూడో రోజు కనుమ..
మకర సంక్రాంతి మరుసటి రోజు అంటే మూడో రోజు కనుమ పండుగను చేస్తారు. దీనినే పశువుల పండుగ అని కూడా పిలుస్తారు. పల్లెల్లో పేదలకు పశువులే గొప్ప సంపద. వాటిని ప్రేమగా చూసుకునే రోజుగా కనుమ పండుగను భావిస్తారు. అందుకే ఈ రోజున పల్లెల్లో పశువులను పూజించడం ఆచారం. పశువుల పాకలను చక్కగా అలంకరించి అక్కడ పా లు, కొత్తబియ్యంతో పొంగలి వండుతారు. ఆ పొంగిలిని దేవుళ్లకు నైవేద్యంగా సమర్పించి తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు. దీనినే పాలి చల్లడం అంటారు. అంటే దాని అర్థం ఆ సంవత్సరం పాటు పండే పంటలు చీడపీడలు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్థించడం.
రెండో రోజు మకర సంక్రాంతి..
నక్షాత్రాలు ఇరవై ఏడు. ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలుండగా మొత్తం 108 పాదాలుగా విభజింపబడ్డాయి. తిరిగి 108 పాదాల్ని 12 రాశులుగా విభజించారు. సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి సంక్రాంతిగా వ్యవహరించబడుతుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని మకర సంక్రాంతి అంటారు. ఇది పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు వచ్చే పుణ్యదినం. సంక్రాంతిలో సం అంటే మిక్కిలి అని, క్రాంతి అంటే అభ్యుదయం అని, మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుకనే దీనిని సంక్రాంతిగా పెద్దలు చెబుతుంటారు. ఈ పండుగకు ఇంటికి ధన, ధాన్యరాశులు వచ్చి చేరుతాయి.
ప్రత్యేక వంటకాలు..
సంక్రాంతి పండుగ అనగానే గుర్తుకు వచ్చేది వివి ధ రకాల పిండి వంటలు. ఈ పండుగకు చేసే సంప్రదాయ పిండి వంటకాలు నోరూరిస్తాయి. వీటిలో అనేక పోషక విలువలు ఉంటాయి. శీతాకాలంలో తీసుకునే ఆహారం శరీరానికి అత్యధిక శక్తిని ఇస్తుంద ని, ఇది ఏడాది పాటు శక్తిని ఇచ్చేందుకు సహకరిస్తుందని అపార నమ్మకం. అందుకే కొత్త బియ్యం పిండి తో చేసిన వివిధ రకాలపండి వంటలు ఈ పండుగలో కనిపిస్తాయి.
సంక్రాంతి క్రీడలు
సంక్రాంతి పండుగ సందర్భంగా పల్లెల్లో, పట్టణాల్లో క్రీడోత్సవాలను, ముగ్గుల పోటీలను గ్రామపెద్దలు నిర్వహిస్తారు. పండుగ రోజు వివిధ రకాల ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలతో పాటు వివిధ రకాల క్రీడలను నిర్వహిస్తారు. యువకులు, పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని పండుగ సంబురాలు జరుపుకుంటారు. ఈ పోటీలతో ఊరినంతటినీ ఒక ప్రదేశానికి చేర్చి అందరూ కలిసి అనందించాలన్నది ముఖ్య ఉద్దేశం.
హరిదాసులు, గంగిరెద్దుల విన్యాసాలు
గొబ్బిళ్లతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్తు శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. హరినామ కీర్తనలు చేస్తూ ఇంటి ముంగిళ్లకు రావడం, తను ఏ భోగాలకు లొంగను కేవలం హరినామ సంకీర్తనకే వచ్చేవాడినని చాటడం. గంగిరెద్దులకు నూతన వస్ర్తాలతో అలంకరించి, గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ విన్యాసాలను ప్రదర్శిస్తారు. ప్రజలు పంట పొలాల్లో పండించిన ధాన్యం గింజలను నూతన వస్ర్తాలను సమర్పించి శ్రీరాముడిగా భావించి ఆశీస్సులు పొందుతారు.