నిజామాబాద్ లీగల్, సెప్టెంబర్ 11: పౌరుల వ్యక్తిగత ఆర్థిక ఎదుగుదల పైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉందని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్.గోవర్ధన్‌రెడ్డి అన్నారు. కక్షలు, కార్పణ్యాలు అభివృద్ధికి ఆటంకాలేనని అన్నారు. పౌరుల మధ్య పట్టువిడుపులుంటేనే ప్రగతి వైపు పయనం ఆటంకాలు లేకుండా సాగుతుందన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవా సదన్‌లో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రజలకు న్యాయ విజ్ఞానాన్ని అందించడానికి న్యాయ సేవా సంస్థ తోడ్పాటునందిస్తున్నదన్నారు. న్యాయ సంబంధిత వివాదాలను రాజీ పద్ధతిన పరిష్కరించుకోవడంలో ఇరుపక్షాల విజయాలున్నాయని వివరించారు. లోక్ అదాలత్‌కు జాతీయ ప్రాధాన్యముందని, జనహితమే జీవనాడిగా జనంతో మమేకమైందన్నారు. అదనపు జిల్లా జడ్జిలు షౌకత్ జహన్ సిద్ధిఖీ, పంచాక్షరి మాట్లాడుతూ న్యాయ, శాసన కార్యనిర్వాహక వర్గానికి తోడుగా మీడియా సమాజ సహకారం తీసుకుని న్యాయసేవలను విస్తృతం చేద్దామన్నారు. న్యాయ వ్యవస్థకు బాసటగా నిలిచి బాధ్యతల బరువు పంచుకుంటున్నామని అసిస్టెంట్ కలెక్టర్ చంద్రశేఖర్, డిప్యూటీ పోలీసు కమిషనర్ అరవింద్ తెలిపారు. కార్యక్రమంలో న్యాయ సేవా కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్, జూనియర్ సివిల్ జడ్జీలు కళార్చన, పెద్ది చందన, సౌందర్య, గిరిజ, భవ్య, ప్రభుత్వ న్యాయవాది ఈగ గంగారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజారెడ్డి, సంస్థ న్యాయవాదులు రాజ్‌కుమార్ సుబేదార్, మాణిక్‌రాజ్, జగన్మోహన్గౌడ్, ఆశ నారాయణ, న్యాయ సేవా సంస్థ పర్యవేక్షకుడు పురుషోత్తంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కక్షిదారులతో కోర్టు ప్రాంగణాలు కళకళ
ఆర్మూర్, బోధన్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి న్యాయస్థానాలతో పాటు నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణాలు వందలాది మంది కక్షిదారుల రాకతో కళకళలాడాయి. ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రతి కక్షిదారుడిని పరీక్షించిన తరువాతనే కోర్టులోకి అనుమతించారు.
మొత్తం కేసులకు అవార్డులు జారీ
ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్ కేసులు మొత్తం 1025 పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ తెలిపారు. ఇందులో 46 మోటరు రోడ్డు ప్రమాద నష్టపరిహార దావాలు బీమా కంపెనీలు బాధితుల ఉమ్మడి అంగీకారం మేరకు అవార్డులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. 3 కోట్ల 63 లక్షల 3వేల 86 రూపాయలు బాధితులకు అందజేయనున్నట్లు తెలిపారు. బ్యాంకులకు సంబంధించి 231 సివిల్ దావాలలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకులకు రుణగ్రహీతలు దాదాపు 98 లక్షల 47 వేల 121 రూపాయలు చెల్లించడానికి అంగీకారం కుదిరిందని వివరించారు.