పొంగుతున్న వాగులు, వంకలు
రాకపోకలకు అంతరాయం.. పలుచోట్ల దారిమళ్లింపు
జోరువానతో ఆనందంలో రైతులోకం
అలుగుపోస్తున్న సగానికిపైగా చెరువులు
నిండుకుండల్లా జలాశయాలు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 19 గేట్ల ఎత్తివేత
చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ
అక్కడక్కడా కూలిన ఇండ్లు..
యంత్రాంగం అప్రమత్తం
ఉమ్మడి జిల్లాలో మూడు రోజుల నుంచి వర్షం జోరుగా కురుస్తున్నది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో కూడవెల్లి, ఎడ్లకట్టవాగులు పొంగుతున్నాయి. పెద్దచెరువు అలుగు పారుతుండడంతో ఎల్లారెడ్డి- హైదరాబాద్ మార్గంలో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. వరదనీటి ఉధృతికి మాచారెడ్డి మండలం వేల్పుగొండ చెరువు కట్ట తెగింది. భారీ వానలు పడుతుండడంతో ప్రాజెక్టులు సైతం నిండుకుండల్లా మారాయి. తాజా వర్షాలతో జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. సగానికి పైగా చెరువులు మత్తడిపోస్తుండగా.. ప్రాజెక్టుల గేట్లు తెరుచుకుని వరదనీరు దిగువకు ప్రవహిస్తున్నది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి పెద్దఎత్తున వరద వస్తుండగా.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 19 గేట్లు ఎత్తిన అధికారులు.. వరదను దిగువకు వదులుతున్నారు. కౌలాస్‌నాలా ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తారు. ఈ సీజన్లో జూన్ నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉభయ జిల్లాల్లో జూలై నెలాఖరుకే అత్యధిక వర్షపాతం నమోదైంది. మొన్నటివరకు వానలు ముఖం చాటెయ్యడంతో దిగాలు చెందిన కర్షకులకు మూడురోజులుగా కురుస్తున్న వానలతో ఊరట లభించింది.
నిజామాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలో మూడు రోజుల నుంచి వర్షం జోరుగా కురుస్తున్నది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జూలై నెలాఖరుకే అత్యధిక వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే ఎక్కువగా వానలు కురవడంతో గ్రామాల్లో జలసందడి ఏర్పడింది. తటాకాలు నిండుకుండల్లా మారాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అత్యధిక చెరువులు అలుగులు పోస్తుండగా మిగిలిన చెరువులు సైతం జలకళతో కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు వానలు ముఖం చాటెయ్యడంతో దిగాలు చెందిన కర్షకులకు మూడు రోజులుగా కురుస్తున్న వానలతో ఊరట దక్కింది. సీజన్ మొదలైన నాటి నుంచి భారీ వానలు పడుతుండడంతో భారీ ప్రాజెక్టులు సైతం నిండుకుండల్లా మారాయి. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద వస్తుండగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రికార్డు స్థాయిలో పదుల సంఖ్యలో గేట్లు ఎత్తి వరదను దిగువకు వదులుతున్నారు.
గ్రామాల్లో జలకాంతులు..
గ్రామాల్లో జల సవ్వడులు కనిపిస్తున్నాయి. ఎటుచూసినా తటాకాలు నీటితో నిండుగా కనిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 968 చెరువులున్నాయి. ఇందులో 237 తటాకాలు ఇప్పటికే మత్తడి దుంకుతున్నాయి. 673 చెరువులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. 50-75శాతం నీటి నిల్వతో 44 చెరువులు, 25-50శాతం 9 చెరువులు, 25శాతంలోపు 5 చెరువుల్లో నీటి నిల్వ ఉన్నట్లుగా జల వనరుల శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో మొత్తం 2,167 చెరువులకు గాను 453 చెరువులు అలుగు పోస్తుండగా 925 చెరువులు 100శాతం నిండుగా ఉన్నాయి. 332 చెరువులు 50-75శాతం, 372 చెరువులు 25-50శాతం, 85 చెరువులు 25శాతం నీటి నిల్వతో కనిపిస్తున్నాయి.
గోదావరి వరద 150 టీఎంసీలు..
ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా నిలిచిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఈసారి రికార్డుస్థాయి వరదతో తొణికిసలాడుతోంది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో భారీ వానలతో అనేక సార్లు గేట్లు తెరుచుకోవడం కనిపించింది. ఇరిగేషన్ అధికారులు భారీగా వరద నీటిని దిగువకు వదిలి పెడుతున్నారు. మరోవైపు ఎస్సారెస్పీ హైడల్ పవర్ ప్లాంట్‌లో దిగువకు వదులుతున్న నీటి ద్వారా జెన్కో విద్యుదుత్పత్తి చేస్తున్నది. జూన్ ఒకటో తారీఖు నుంచి నేటి వరకు ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు 150 టీఎంసీలు మేర వరద పోటెత్తింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగుల (90.313 టీఎంసీలు). వానకాలం ప్రారంభం నాటికే ప్రాజెక్టులో దాదాపుగా 30 టీఎంసీలు నీటి నిల్వ ఉండగా భారీ వానలతో తక్కువ సమయంలోనే ప్రాజెక్టు నిండుకుండలా మారింది. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వరుసగా ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువకు పదుల సార్లు వరద నీరు వదలడం విశేషం. తెలంగాణలో వర్షాలు కురవని రోజుల్లోనూ ఎగువ నుంచి ఎస్సారెస్పీకి వరద కొనసాగింది.
సగం నిండిన నిజాంసాగర్ ప్రాజెక్టు..
ఏటా బోసిపోతు రైతుల్లో నిరాశను నింపే చారిత్రక నిజాంసాగర్ ప్రాజెక్టు ఈసీజన్లో అన్నదాతలకు గుండె ధైర్యాన్ని ఇచ్చింది. సీఎం కేసీఆర్ చొరవతో కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ద్వారా హల్దీ వాగు నుంచి కాళేశ్వరం జలాలు ఒక టీఎంసీ మేర రావడం, అప్పటికే రెండున్నర టీఎంసీలు మేర నీటి నిల్వ ఉండడంతో వానకాలం సాగుపై డోలాయమాన పరిస్థితులు కొనసాగాయి. సీజన్ ఆరంభం నుంచి వానలు కురుస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా రావడం ప్రారంభమైంది. ప్రాజెక్టు సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10.43 టీఎంసీల మేర నీటి నిల్వ ఉన్నది. ఆగస్టు నెలాఖరుకే సగం కంటే ఎక్కువ నీటితో కళకళలాడుతున్న ప్రాజెక్టుకు ఈసారి కూడా గేట్లు ఎత్తే పరిస్థితి వచ్చే అవకాశాలున్నట్లుగా ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ మంజీర నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు నిండితే చారిత్రక ప్రాజెక్టుకు వరద పోటెత్తడం తథ్యమని చెబుతున్నారు.
ఎస్సారెస్పీ 19 గేట్ల ఎత్తివేత
కమ్మర్పల్లి, ఆగస్టు 31: నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీకి భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో అధికారులు 19గేట్లను ఎత్తి మిగులు జలాలను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. మంగళవారం ఉద యం నుంచి ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతూ వచ్చింది. సాయంత్రం ఇన్‌ఫ్లో 86,530 క్యూసెక్కులకు చేరింది. దీంతో 24గేట్లను ఎత్తి దిగువకు 99,880 క్యూసెక్కులు వదులుతున్నారు. ఎగువన మహారాష్ట్రతోపాటు ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీ ఇన్‌ఫ్లో కొనసాగుతున్నదని ప్రాజెక్టు ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, మంగళవారం సాయంత్రానికి పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉంది. రాత్రి 10.30 గంటలకు ఐదు గేట్లను మూసివేయగా, 19 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నది. జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి 150.633 టీఎంసీల ఇన్‌ఫ్లో, 78.757 టీఎంసీల ఔట్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. జెన్కోకు 7500 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువకు 50 క్యూసెక్కులు, గుత్ప ఎత్తిపోతలకు 51 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నిజాంసాగర్‌లోకి 3,517 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నిజాంసాగర్, ఆగస్టు 31: ఎగువ నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 3,517 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు ఏఈ శివకుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00అడుగుల (17.80 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1399.12 అడుగుల(10.43 టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. సింగీతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 416.55 అడుగులతో నిండుగా ఉండగా, ఎగువ నుంచి 550 క్యూసెక్కుల నీరు వస్తున్నది. జుక్కల్ మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్టు మంగళవారం సాయంత్రానికి పూర్తిస్థాయి నీటి మట్టం 458.00మీటర్ల (1.237టీఎంసీల)తో నిండి ఉండగా 846 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో మూడు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు డీఈఈ దత్తాద్రి తెలిపారు.
పొంగుతున్న వాగులు, వంకలు
కమ్మర్పల్లి/ పిట్లం/ మాచారెడ్డి/ ఎల్లారెడ్డి రూరల్, ఆగస్టు 31: ఉమ్మడి జిల్లాలో జోరుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువుల మత్తళ్లు దుంకుతున్నాయి. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో కాలువలు, ఒర్రెల్లో వరద ప్రవాహం కొనసాగింది. పంట పొలాల్లోకి వరద చేరింది. పలు గ్రామాల సమీపంలో రోడ్లపై నుంచి నీరు ప్రవహించింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కాకివాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఊర చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతున్నది. మండలంలో 62.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ రామ్మోహన్రావు వెల్లడించారు. మాచారెడ్డి మండలంలోని పాల్వంచ వద్ద ఉన్న వాగు మంగళవారం ఉధృతంగా ప్రవహించింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగు నిండుగా పారుతున్నది. మాచారెడ్డి మండల కేంద్రంలోని ఊర చెరువు అలుగుపారడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేల్పుగొండ – వాడి రహదారిలో ఉన్న చెరువు కట్ట తెగడంతో నీళ్లన్నీ వృథాగా పోయాయి.
కళ్యాణి ప్రాజెక్టు గేటు ఎత్తివేత
ఎల్లారెడ్డి, ఆగస్టు 31: ఎగువ నుంచి వరద వస్తుండడంతో అధికారులు మంగళవారం సాయంత్రం కళ్యాణి ప్రాజెక్టు ఒక గేటును తెరిచి నీటిని విడుదల చేశారు. పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్లకు చేరుకోవడంతో గేటును తెరిచి మంజీరాలోకి 265 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి 158 క్యూసెక్కుల నీటిని మళ్లించారు.
గోదారి పరవళ్లు..
రెంజల్, ఆగస్టు 31 : రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గల త్రివేణి సంగమ క్షేత్రానికి వరద చేరుతుండడంతో గోదావరి పరవళ్లు తొక్కుతున్నది. దీంతో నదిపై నిర్మించిన వంతెనను ఆనుకొని నీరు ప్రవహిస్తున్నది. పురాతన శివాలయం నీట మునిగింది. మండలంలో 97.2మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ రాంచందర్ మంగళవారం తెలిపారు. వరద ప్రవాహం పెరిగే అవకాశముండడంతో జాలర్లు చేపలు పట్టేందుకు వెళ్లకుండా ఆంక్షలు విధించామన్నారు.
రికార్డు స్థాయి వర్షం
నిజాంసాగర్, ఆగస్టు 31: నిజాంసాగర్ మండలంలో 157.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు మండల ప్రణాళిక, గణాంక అధికారి శంకర్ తెలిపారు. మంగళవారం ఉదయం వర్షపాతం వివరాలు సేకరించిన ఆయన మాట్లాడుతూ మండలంలో పదేండ్ల తర్వాత రికార్డు స్థాయి వర్షం కురిసిందన్నారు.