నీలగిరి, మే 9 : చెడు అలవాట్లకు బానిసై ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను నల్లగొండ జిల్లా కేంద్రంలో పోలీసులు వేర్వేరుగా రిమాండ్‌కు తరలించారు. నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన నరందాస్ మణికంఠ అలియాస్ మున్నీ 10వ తరగతి వరకు చదివి కారు డ్రైవర్‌గా పని చేసేవాడు.
వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడి 2013లో జైలు శిక్ష అనుభవించాడు. మణికంఠపై దాదాపు 25కు పైగా కేసులు ఉన్నాయి. చివరిగా సూర్యాపేట వన్‌టౌన్ పరిధిలో బైక్ దొంగతనం కేసులో జనవరిలో అరెస్టు అయి మార్చి 12న జైలు నుంచి విడుదలయ్యాడు. మే 2న హైదరాబాద్ రోడ్డులోని సాయిశ్రీ వీల్టెక్ ఎదుట పార్కింగ్ చేసిన కారును దొంగిలించాడు.
వాహన యజమాని గంజి యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిఘా పెట్టిన పోలీసులు పానగల్ రోడ్డు నుంచి నల్లగొండకు వస్తుండగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించిగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకొన్నాడు. నిందితుడు వద్ద 12 బైక్‌లు,7 సెల్ఫోన్లు, 1500 నగదును కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మణికంఠపై నల్లగొండ వన్‌టౌన్‌లో 1, టూటౌన్లో 4, మిర్యాలగూడ వన్ టౌన్లో 2, సూర్యాపేట వన్‌టౌన్‌లో 3, టూటౌన్లో 2, ఉప్పల్‌లో 1, వనస్థ్ధలిపురంలో 1, ఉస్మానియా యునివర్సిటీలో 1 చొప్పున మొత్తం 15 కేసులు ఉన్నట్లు తెలిపారు.
ఖమ్మం జిల్లా మధిరలోని మాడుపల్లి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వంశీ 10వ తరగతి వరకు చదువుకుని కూలి పనులు చేస్తూ జల్సాలకు అలవాటు పడి వాహనాల దొంగతనాలకు పాల్పడేవాడు. ఆరునెలల క్రితం కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి ప్రాంతంలో పల్సర్ దొంగిలించి పోలీసులకు పట్టుబడి మూడు నెలలపాటు జైలు శిక్ష అనుభవించి వచ్చి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో డబ్బులు లేక ఏప్రిల్‌లో మునగాల, మే 2న నల్లగొండ కలెక్టరేట్లో బైక్‌లను దొంగతనం చేశాడు.
ఈ నెల 8న సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. కేసును చేధించిన సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో నల్లగొండ టూటౌన్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సిబ్బంది ఎస్.శంకర్, శంషుద్దీన్, బాలకోటి, బ్రహ్మచారి, ఖయ్యు ముద్దీన్, గాంధీ, గోపి ఉన్నారు.