కవాడిగూడ, మే 4 : యువతలో చైతన్యానికి క్రీడలు దోహదపడుతాయని నల్లగొండ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి జస్టిస్ బి. సౌజన్య అన్నారు. మాదకద్రవ్యాల బారిన పడి యువత తమ ఉజ్వలమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, క్రీడల్లో రాణించడం వల్ల చెడు వ్యసనాలను దూరం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో మాజీ కార్పొరేటర్, నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్ కన్వీనర్ వి.శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దివంగత నాయిని నర్సింహారెడ్డి స్మారక క్రికెట్ పోటీలను బుధవారం ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా జస్టిస్ సౌజన్య మాట్లాడుతూ యువతలో చైతన్యం కల్పించేందుకు క్రికెట్ టోర్నీని నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఫౌండేషన్ కన్వీనర్ వి. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఈ పోటీల్లో దాదాపు 95 జట్లు పేర్లు నమోదు చేసుకున్నారని అన్నారు. ఈ నెల 8న ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని, విన్నర్స్‌గా నిలిచిన జట్టుకు రూ.లక్షా, రన్నర్స్‌గా నిలిచిన జట్టుకు రూ. 50 వేల నగదును అందజేయనున్నట్లు తెలిపారు. ముగింపు సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కవిత, ఇతర ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కాల్వ గోపి, నేత శ్రీను, రమేశ్, సిరిగిరి శ్యామ్, ఉమేశ్, రంజిత్, శివ, వెంకటేశ్, హైమత్, ఖలీల్, అస్లాం, ప్రవీణ్, హమీద్ పాల్గొన్నారు.