తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆ తర్వాత కరెంట్ సరఫరాలో ఎంత మార్పు వచ్చిందో నేడు పట్టణాలు, మండల కేంద్రాల్లో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. నాడు దుకాణాలు, హోటళ్లు, దవాఖానలు, మెడికల్ షాపుల ముందు ఎక్కడ చూసినా జనరేటర్లు, ఆయిల్ ఇంజిన్లు కనిపించేవి. కరెంట్ పోగానే వీటిని ఆన్‌చేస్తే పొగలు చిమ్ముతూ మోత మోగేవి. డీజిల్ ఖర్చులు తడిసిమోపెడయ్యేవి. నేడు స్వరాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన కరెంట్ సరఫరాతో వ్యాపారాలు సజావుగా సాగుతున్నాయి.
ఆస్పత్రుల్లో రోగులకు ఇబ్బందులు లేకుండా చికిత్సలతోపాటు సర్జరీలు విజయవంతంగా పూర్తవుతున్నాయి. కరెంట్‌తో పని ఎక్కువగా ఉండే మెకానిక్స్‌కు ఉపాధి మెరుగు పడింది. ఇతర రాష్ర్టాల్లో కోతలు కన్నీళ్లు పెట్టిస్తుండగా మన దగ్గర నిరంతరంగా అందిస్తుండడంపై వ్యాపార వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
ఉద్యమ నేతగా కేసీఆర్ 2001 సంవత్సరంలో చెప్పిన విషయాలన్నీ అక్షర సత్యాలవుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ చేసిన ప్రసంగాలు నేడు స్పష్టమైన ఫలితాలను కళ్లకు కడుతున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు మనకే దక్కాలన్న లక్ష్యంతో ఉద్యమాన్ని ప్రారంభించిన కేసీఆర్.. ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయా సమస్యలపై దృష్టిసారించారు. ప్రాధాన్యతా క్రమంలో ఒక్కొక్క రంగాన్ని ప్రక్షాళన చేస్తున్నారు. ప్రధానంగా విద్యుత్ రంగంలో సీఎం కేసీఆర్ దూరదృష్టి నేడు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నది. మండు టెండల్లోనూ నిరంతర విద్యుత్ అందిస్తుండడం సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షతకు నీరాజనం పడుతున్నది.
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కేవలం ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యకు పరిష్కారం దొరికింది. వ్యవసాయం సహా అన్ని రంగాలకూ 24 గంటల విద్యుత్ సరఫరా కొనసాగుతున్నది. దాంతో నేడు వ్యాపార, వాణిజ్య వర్గాలతో పాటు నర్సింగ్‌హోం నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో విద్యుత్ కోతల కారణంగా ఆస్పత్రుల్లో జనరేటర్లు అమర్చుకునేవారు.
కానీ, నేడు కళ్లు చెదిరే వెలుగులు, ఏసీలు, ఫ్యాన్ల నడుమ చికిత్సలు అందిస్తున్నామని వైద్యులు చెప్తున్నారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో విద్యుత్ కోతలు, పవర్ హాలిడేలు అమలవుతున్నా మన రాష్ట్రంలో కోతలు లేకపోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా పట్ల సంతోషంగా ఉన్నామని చెబుతున్నారు.
గతంలో ఎండాకాలంలో కరెంట్ కోతలు ఎక్కువగా ఉండేవి. మా పనులు ఆగిపోయేవి. పల్లెల్లో ఇంకా ఎక్కువగా ఇబ్బంది ఉండేది. రాష్ట్రం ఏర్పడ్డాక 24 గంటల కరెంట్‌తో మాకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.
– ఆలేటి రామకృష్ణ, హెయిర్
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో కరెంటు కష్టాలకు పూర్తి స్థాయిలో తెరపడింది. విద్యుత్ వినియోగం పెరుగడంతో పాటు రైతుల కష్టాలు సైతం తొలగిపోయాయి. గృహ విద్యుత్ కొత్త లైన్ల ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేపట్టడం జరిగింది. జిల్లాలో విద్యుత్ సమస్యను అధిగమించేందుకు 132/33కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశాం.
అదేవిధంగా 33/11కేవీ 23, పవర్ ట్రాన్స్ఫార్మర్లు 42, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 9,105, 33కేవీ లైన్ 190కిలోమీటర్లు, 11కేవీ వైరు 2483కిలోమీటర్లు, ఎన్టీ లైన్ 2,285కిలోమీటర్లు, 22,489 కొత్త వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చాం. గతంలో రోజుకు సగటున 2.5మిలియన్ యూనిట్లు వాడకం ఉండగా, ప్రస్తుతం 6మిలియన్ యూనిట్లకు పెరిగింది. అదేవిధంగా గతంలో రోజువారి సగటు 150మెగావాట్లు కాగా ప్రస్తుతం 350మెగావాట్లకు పెరిగింది.
– శ్రీనాథ్, ట్రాన్స్‌కో ఎస్ఈ, భువనగిరి కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తుండడంతో బ్యాటరీలు, ఇన్వర్టర్ల గిరాకీ తగ్గింది. ఏడేండ్ల కిందట నిరంతర విద్యుత్ లేక పోవడంతో వేసవికాలంలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండేవి. దాంతో ఇండ్లు, వాప్యార సముదాయాల్లో ఇన్వర్టర్లు వినియోగించుకునేవారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే మా దగ్గరికి రిపేర్ కోసం వచ్చేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండడం లేదు. ఎండలు మండిపోతున్నా ఇన్వర్టర్ల బిజినెస్ తగ్గిపోయింది.
– మెడబోయిన అశోక్, బ్యాటరీ బిజినెస్, భువనగిరి అర్బన్
రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మన పక్క రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, చత్తీస్ఘడ్ వంటి రాష్ర్టాల్లో కరెంటు కోతలు, పవర్ హాలిడే ప్రకటిస్తున్నారు. కానీ, మన రాష్ట్రంలో నిరంతరం కరెంట్ ఉంటున్నది. ఎండలు దంచి కొడుతున్నా, రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతున్నా విద్యుత్ సరఫరాతో ఇబ్బందులు లేకుండా పోయాయి.
– రాజీవ్‌రెడ్డి, రెస్టారెంట్, మఠంపల్లి
మారుమూల పల్లెలకు సైతం నిరంతరంగా విద్యుత్ అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. గత ప్రభుత్వాల హయాంలో వేసవిలో విద్యుత్ కోతలతో ఉక్కపోత భరించలేక చల్లదనం కోసం చెట్ల కింద సేదదీరేవాళ్లం. ఇప్పుడు నిరంతర విద్యుత్ అందిస్తుడడంతో ఫ్యాన్లు, కూలర్ల కింద ఉపశమనం పొందుతున్నాం. మండుటెండల్లోనూ నిరంతర విద్యుత్ అందిస్తున్న సీఎం కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు.
– కరాటే బాలు, రేణికుంట, రాజాపేట
తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగం చేయాలంటే భయపడేవాళ్లం. ఉదయం, రాత్రి అనే తేడా లేకుండా ఏ ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడు కాలిపోతుందో అని భయమయ్యేది. ఎప్పుడూ, ఏదో ఒక ట్రాన్స్ఫార్మర్ రిపేర్‌కు వచ్చేది. బ్రేక్ డౌన్, ఫీజులు కొట్టేసేవి. ఉరుకులు, పరుగులు పెట్టేవాళ్లం. కానీ, ఇప్పుడు ఆ బాధలు తప్పినయి. రిపేర్లు రావడం లేదు. 24 గంటల కరెంట్ నిరంతరాయంగా ఇస్తున్నాం.
– టీఆర్ చంద్రమోహన్, ట్రాన్స్‌కో ఎస్ఈ, నల్లగొండ సిటీ
సమైక్య పాలకుల అసత్య ప్రచారాన్ని తిప్పికొడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ 24గంటల కరెంట్‌ను ప్రజలకు అందించి చూపించారు. గత ప్రభుత్వాల హయాంలో విద్యుత్ కోతలు లేని రోజే లేదు. అప్పట్లో ఐసీయూలో ఆపరేషన్ చేయాలంటే భయమయ్యేది. కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలిసేది కాదు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మండు వేసవిలో సైతం కరెంట్ కోతలు లేకుండా నిరంతరం సరఫరా చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికే దక్కుతుంది. ఇప్పటికే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవర్ హాలిడేస్ ప్రకటించారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో కరెంట్ కోతలు, ఇక్కట్లు ఉన్నాయనేది వాస్తవం. కానీ మన రాష్ట్రంలో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా 24గంటలు కరెంట్ అందిస్తున్నారు.
– డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్, సూర్యాపేట