విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే సంకల్పమే ‘ఇన్స్పైర్-మానక్’. ఈ పర్యాయం జిల్లా విద్యాశాఖ విస్తృతంగా అవగాహన కల్పించడంతో ఉమ్మడి జిల్లాలో 1,797 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 2,555ప్రాజెక్టులు ఆన్లైన్లో నమోదయ్యాయి. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి గతేడాది అక్టోబర్లో ఎంట్రీ ముగియగా తాజాగా విడుదలైన ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా స్థాయిలో 264ప్రాజెక్టులు ఎంపిక కాగా, ప్రభుత్వ పాఠశాలల నుంచే అధికంగా ఉండడం గమనార్హం. ఎంపికైన ప్రాజెక్టులకు సంబంధించి విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో రూ.10వేలు జమయ్యాయి.
విద్యార్థులను శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తీర్చిదిద్దేలా కేంద్రం మిలియన్ మైండ్స్ అగ్యుమెంటింగ్ నేషనల్ యాస్పిరేషన్స్ అండ్ నాలెడ్జ్ (ఇన్స్పైర్ అవార్డు-మానక్)కు రూపకల్పన చేసింది. 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను ప్రయోగాల దిశగా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. దేశ వ్యాప్తంగా లక్ష ప్రాజెక్టులను ఎంపిక చేసి ఒక్కో ప్రాజెక్టుకు రూ.10వేలు అందిస్తున్నది. జిల్లా స్థాయిలో ఎంపికైన వాటిలో పది శాతం ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి, తిరిగి వాటి నుంచి పది శాతం జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. అంతిమంగా 60 ఉత్తమ ప్రాజెక్టులను రాష్ట్రపతి భవన్లో ప్రదర్శించే అవకాశం దక్కనుంది. ఒక్కో జాతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.20 వేల నగదు పురస్కారం అందిస్తారు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 843 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఇన్స్పైర్ మానక్ – అవార్డుకు అర్హత కలిగిఉన్నాయి. వీటిలో 495 ప్రభుత్వ, 345 ప్రైవేట్ పాఠశాలున్నాయి. 432 పాఠశాలల నుంచి 1,486 ప్రాజెక్టులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కావడంతో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అందులో 93 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి.
కృషి చేసిన అందరికీ
ఇన్స్పైర్ మానక్ -అవార్డుల నామినేషన్లలో కృషి చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులకు అభినందనలు. ఇదే స్ఫూర్తిని చాటి రాష్ట్ర స్థాయిలోనూ ప్రాజెక్టులు ఎంపికయ్యేలా పని చేయాలి. విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో నమోదైన నిధులను ప్రాజెక్టుల రూపకల్పనకు మాత్రమే ఉపయోగించేలా చూడాలి.
– అశోక్, డీఈఓ, సూర్యాపేట
ఇన్స్పైర్ మానక్ అవార్డులను సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా డీఈఓ ఆదేశాలతో డివిజన్ల వారీగా ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు, సీఆర్పీలకు అవగాహన కల్పించాం. దాంతో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 843 పాఠశాలల నుంచి 432 పాఠశాలలు ముందుకు వచ్చాయి. మొత్తం 1,486 ప్రాజెక్టులను ఆన్లైన్లో నమోదు చేయగా 93 ప్రాజెక్టులు ఎంపిక కావడం హర్షణీయం. అందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు.
– వనం లక్ష్మీపతి, జిల్లా సైన్స్ అధికారి, నల్లగొండ